శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్:రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, అందువల్ల సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ వి.లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. శ్రీకాకుళం ప్రెస్‌క్లబ్‌లో ఆది వారం వేదిక జిల్లా కన్వీనర్ పొన్నాడ వెంకటరమణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ పెత్తనం కోసం తెలుగుజాతిని విచ్ఛిన్నం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేస్తున్న యత్నాలను తిప్పికొట్టాలన్నారు. రాష్ట్రాన్ని విభజించాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్-3ని సవరించాల్సి ఉంటుందన్నారు. సమైక్యాంధ్ర కోసం ఎన్జీవోలు చేసిన సమ్మె అభినందనీయమని, అయితే అందరినీ కలుపుకొనిపోలేకపోయారన్నారు. సీమాంధ్ర ప్రజలు ఇంతగా ఉద్యమిస్తున్నా సోనియాగాంధీ విభజనకే కంకణం కట్టుకోవడం దురదృష్టకరమన్నారు.
సీమాంధ్రకు చెందిన కేంద్రమంత్రులు ఉద్యమాన్ని పట్టించుకోకుండా విభజన జరిగిపోయిందంటూ సమైక్యవాదాన్ని విచ్ఛిన్నం చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. సమైక్యాంధ్ర కోసం అసెంబ్లీ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర మంత్రులు అధికారాన్ని ఉపయోగించి ఆస్తులు కూడగట్టుకున్నారని, విభజన జరిగితే పోయేది సామాన్య ప్రజలే కదా అనే భావన వారిలో ఉందని విమర్శించారు. ఉద్యమ తీవ్రతను పెంచి రాష్ట్ర సమైక్యత కోసం కృషి చేద్దామన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గుంట తులసీరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో శాస్త్రీయత లేదన్నారు. శ్రీలంకలో తమిళ ప్రజలపై జరిగిన దాడులకు నిరసనగా శ్రీలంక పర్యటన రద్దు చేసుకోవాలన్న తమిళ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గిన ప్రధాన మంత్రి, కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర ప్రజల మనోభావాలను మాత్రం పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సమైక్యాంధ్రకు అనుకూలమో? ప్రతికూలమో? చెప్పలేని దుస్థితిలో ఉన్నారని విమర్శించారు. పరిరక్షణ వేదిక ప్రతినిధి దామోదరరెడ్డి మాట్లాడుతూ బలమైన రాష్ట్రం ఉండకూడదనే దురుద్దేశంతోనే కాంగ్రెస్ రాష్ట్ర విభజనకు పాల్పడుతోందన్నారు. మరోసారి ఉద్యమిస్తే విభజన ఆగిపోతుందన్నారు. వేదిక ప్రతినిధులు జామి భీమశంకర్, కాళీప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు రాజకీయ పార్టీలే కారణమన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి దుప్పల రవీంద్ర మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ఉద్యమించిన ఎన్జీవోలు సమ్మె విరమించడం ప్రభుత్వకుట్రగా అభివర్ణించారు. గ్రామీణస్థాయిలో ప్రజలను సమైక్య ఉద్యమంలో భాగస్వాములను చేయాలన్నారు.
జిల్లా పరిరక్షణ కమిటీ
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కమిటీ జిల్లా కమిటీని ప్రకటించారు. కన్వీనర్‌గా పొన్నాడ వెంకట రమణారావు, చైర్మన్‌గా గుంట తులసీరావు, వైస్ చైర్మన్‌గా జామి భీమశంకర్, కో-కన్వీనర్‌గా కొంక్యాన వేణుగోపాలరావు, సభ్యులుగా దుప్పల వెంకట్రావు, గేదెల ఇందిరాప్రసాద్, గీతాశ్రీకాంత్, ఎస్.వి.ఎస్.ప్రకాష్, వాన కృష్ణచంద్, శిష్టురమేష్, జి.కృష్ణప్రసాద్, కె.ఉషారాణి, సరళకుమారి, ఇతర అన్ని జేఏసీ ప్రతినిధులు వ్యవహరిస్తారు. ఈ సమావేశంలో పూజారి జానకిరాం, పైడిరెడ్డి, అంబటి ప్రకాష్, ఇతర జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు.
విభజన జరిగితే సీమాంధ్రకు నష్టం
Published Mon, Nov 18 2013 2:42 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
Advertisement