ఆదిలాబాద్‌టౌన్, న్యూస్‌లైన్ : వైద్యాధికారులు, ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని వైద్య, ఆరోగ్యశాఖ రీజినల్ డెరైక్టర్(ఆర్డీ) మాణిక్యరావు అన్నారు. గురువారం ఆయన నర్సాపూర్(జి), మామడ, గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం స్థానిక వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేది పేదలేనని, వారికి మెరుగైన వైద్యసేవలు అందించే బాధ్యత వైద్యులపైనే ఉందని అన్నారు.
ఆస్పత్రుల్లో కాన్పుల సంఖ్య పెంచాలని, మాత, శిశు మరణాలను తగ్గించాలని సూచించారు. కుటుంబ నియంత్రణ లక్ష్యాలను సాధించాలని, మార్చిలోగా వంద శాతం పూర్తి చేసే విధంగా చూడాలని అన్నారు. వైద్యశాఖ ద్వారా అమలయ్యే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. ఉప కేంద్రాల్లో సేవలు, వైద్యాధికారులు, ఉద్యోగుల పనితీరు పరిశీలించాలని తెలిపారు. ఎన్‌ఆర్‌హెచ్‌ఎం లక్ష్యాలను నెరవేర్చాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో మేకల స్వామి, కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
పీహెచ్‌సీలో ఆర్డీ ఆకస్మిక తనిఖీ
నర్సాపూర్(జి)(దిలావర్‌పూర్) : మండలంలోని నర్సాపూర్(జి) గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్య, ఆరోగ్యశాఖ రీజినల్ డెరైక్టర్(ఆర్డీ) మాణిక్యరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి వైద్యసేవల తీరును తెలుసుకున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లపై దృష్టి సారించి గ్రామాల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రస్తుత ఆస్పత్రి భవనం ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సిద్ధార్థ, సిబ్బంది పాల్గొన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు
Published Fri, Dec 20 2013 4:34 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM
Advertisement
Advertisement