కేసీఆర్ రెచ్చగొట్టడం మానుకోవాలి: పొన్నం
సీమాంధ్ర ఉద్యోగులపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్ రెచ్చగొట్టేలా మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర విభజనకు శాంతియుతంగా విడిపోయే వాతావరణం కల్పించాలని ఆయన సూచించారు.
ఉద్యమాల్లో నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడం సరికాదని పొన్నం ప్రభాకర్ అన్నారు. విగ్రహాలు కూల్చివేతకు బాధ్యులయిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమంలో పలువురు నేతల విగ్రహాలను ఆందోళనకారులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీమాంధ్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ ప్రాంతం వదిలి వెళ్లాలని, వారికి ఆప్షన్లు లేవని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలువురు నేతలు కూడా కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు.