రిఫ్రిజిరేటర్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్ధాలు
విజయనగరం మున్సిపాలిటీ: పోపులపెట్టె అంటే అందరికి తెలిసిందే... రిఫ్రిజిరేటర్ పరిస్థితి నేడలా తయారైంది. తినే వస్తువుంటే చాలు అందులో దాచేస్తున్నారు. దీని వల్ల జరిగే అనర్థాలను గుర్తించడం లేదు. నేటి తరం ప్రజల దైనందిన జీవితంలో రిఫ్రిజిరేటర్ వినియోగం ఒక భాగమైంది. జిల్లాలో సుమారు 13 లక్షల కుటుంబాలు ఉండగా 40 శాతం కుటుంబాల్లో రిఫ్రిజిరేటర్ల వినియోగం ఉందని అంచనా. వీరిలో 25 శాతానికి పైగా కుటుంబాలు పూర్తి మెలకువలు తెలియకుండానే వినియోగిస్తున్నారు. ప్రతి రోజు జిల్లాలో 100 నుంచి 300 రిఫ్రిజిరేటర్లు వరకు విక్రయాలు జరుగుతున్నాయి. వీటితో పాటు దుకాణాలు, హోటళ్లు, బార్లు తదితర వ్యాపార సంస్థల్లో, ఆహార పదార్థాల దుకాణాల్లో కూడా రిఫ్రిజిరేటర్లు వేల సంఖ్యలో వినియోగిస్తున్నారు. సరైన అవగాహన లేకుండా వీటి వినియోగం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. ఫ్రిజ్‌లున్న ప్రతి ఒక్కరూ ఆహార పదార్థాలను ఎక్కువ సమయం నిల్వ చేయడం, తరువాత వాటిని వాడడం సాధారణమైంది. ఈ పరిస్థితుల్లో రిఫ్రిజిరేటర్లలో ఏయే రకాల ఆహార పదార్ధాలు ఎలా నిల్వ చేసుకొవాలనే విషయంలో పోషకాహార నిపుణులు ఇస్తున్న సూచనలు పాటించాల్సిందే.
ఏ పదార్ధాలు...ఎలా దాచుకోవాలి...
కేకులను గాలి సోకని డబ్బాలో నిల్వ చేసుకుంటే ఉత్తమం. తాజా పదార్ధాలతో చేసినదైతేనే ఫ్రిజ్‌లో ఉంచుకోవచ్చు. లేదంటే వాటిని ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చిన కేక్ డబ్బాలలో నిల్వ చేసుకోవచ్చు. తేనెకు సహజ సిద్ధంగానే నిల్వ ఉండే గుణం ఉంటుంది. రిఫ్రిజిరేటర్లలో దాచి పెట్టాల్సిన అవసరం ఉండదు. చల్లని వాతావరణంలో నిల్వ ఉంచితే గట్టిపడి, సహజత్వం కోల్పోతుంది. రుచి కూడా మారిపోతుంది. ఉల్లిగడ్డ లాగానే వేరే పదార్ధాలకు వాసన కలిగించే వెల్లుల్లిని కూడా ఇందులో దాచుకోకూడదు. వాటిని పొడిగా, పరిశుభ్రంగా ఉండే ప్రదేశాల్లో నిల్వ ఉంచుకోవడమే మేలు. ఉల్లిగడ్డలను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుకోవడం వల్ల ఇతర పదార్థాల రుచి, వాసన మారిపోతుంది. పొడిగా, పరిశుభ్రంగా ఉండే చోట నిల్వ ఉంచుకోవడమే ఉత్తమం. రొట్టెలు రిఫ్రిజిరేటరులో పెడితే తొందరగా పాడైపోతాయి. బూజు పట్టే అవకాశం ఉంది. అందుకే రొట్టెలను డబ్బాలో కానీ, ప్రత్యేకంగా వీటి కోసం తయారు చేసిన సంచులలో కానీ పెట్టి ఫ్రిజ్లో దాచుకోవాలి.
అరటిపండ్లు ఉష్ణ వాతావరణాన్ని తట్టుకునే శక్తితో ఉంటాయి. చల్లటి వాతావరణంలో అవి నిల్వ ఉండవు. ఇంకా పండని అరటి పండ్లను ఫ్రిజ్‌లో దాచుకుంటే చూడటానికి బాగానే కనిపించినా మెత్తగా, నల్లగా మారిపోతాయి. కాఫీ పొడి, గింజలకు పరిసరాల్లోని వాసనలను స్వీకరించే గుణం ఉంటుంది. అందుకే వాటిని ఫ్రిజ్‌లో ఉంచితే ఇతర పదార్థాల వాసనల్లోకి మారిపోతాయి. వాటిని బయట గాలి సోకని డబ్బాలో దాచుకోవడమే సరైనదని చెబుతున్నారు. సలాడ్లుగా ఉపయోగించుకునే చెర్రీలు, టమాటలు వంటి వాటిని చల్లగా, నాణ్యంగా ఉండాలని ఫ్రిజ్‌లో దాచుకుంటాం. నిపుణులు అది మంచిది కాదంటున్నారు. దీనివల్ల టమాటల లోపల పొరలు దెబ్బతిని, రుచి, సహజత్వం కోల్పోతాయని చెబుతున్నారు. ఫ్రిజ్‌లో ఉంటే వాటిలో నీటి శాతం పెరిగి రుచి కూడా తగ్గుతుంది. నీటితో ఉండే పుచ్చకాయలు, కర్బూజాలు వంటి వాటిని దాచుకునేందుకు వేసవిలో చల్లగా, రుచిగా ఉండేందుకు ఫ్రిజ్లో పెట్టుకుంటాం. కానీ ఆ పండ్లను కోయక ముందే ఫ్రిజ్లో పెట్టుకోవడం ఉత్తమం. కోసిన ముక్కలను ఫ్రిజ్‌లో దాచుకోవాల్సిన పరిస్థితి ఉంటే నేరుగా కాకుండా, తప్పనిసరిగా నాణ్యమైన కవర్లలో చుట్టి దాచుకోవాలి. బంగాళా దుంపలను ఫ్రిజ్‌లో పెట్టకూడదని గట్టిగా చెబుతున్నారు. ఆహార ప్రమాణాల సంస్థ నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగాళాదుంపలను ఫ్రిజ్‌లో దాచుకుని వాడితే వాటిలోని పిండి పదార్ధాలు ఉడికించినపుడు చక్కెరగా మారిపోతాయి. ఈ చక్కెరతో పాటు విడుదలయ్యే అమైనో ఆమ్లాలు, రసాయనాల వల్ల అత్యంత ప్రమాదకరం.
సరైన జాగ్రత్తలతో...
ఇప్పటి తరం ప్రజలు ఆధునికంగా ఉండాలని కోరుకుంటున్నారు. తీసుకునే ఆహారంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే ఆరోగ్యం దెబ్బతింటుందని గ్రహించాలి. రిఫ్రిజిరేటర్లలో ఏ పదార్థాలు దాచుకోవాలో తెలియక అనారోగ్యాలను కొనితెచ్చుకుంటున్నారు. తీరిక లేని బాధ్యతలతో అనేక మంది ఎక్కువ సమయం నిల్వ ఉండాలనే ఉద్దేశంతో ఆహార వస్తువులు ఫ్రిజ్‌లో దాచుకుంటున్నారు. దీని వల్ల వాటి తాజాదనం, రుచి, నాణ్యత పాడైపోతాయి. రిఫ్రిజిరేటర్లలో పెడితే చెడిపోయే పదార్ధాలను సాద్యమైనంత వరకు నిల్వ ఉంచుకోవద్దు.
శీతల పదార్ధాలు అనర్ధదాయకం
శీతలం అన్ని సందర్భాల్లో ఉపయోగపడదు. ప్రధానంగా మానవ జీవితంలో ఇటీవల పెరిగిన శీతల పదార్ధాల వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అతి శీతల పదార్ధాలు ఆరగిస్తే æ జీర్ణవ్యవస్థ కుంటుపడుతుంది. అది అన్ని రోగాలకు, అనర్థాలకు మూలంగా తయారవుతుంది. ప్రత్యేకించి రిఫ్రిజిరేటర్‌లో వస్తువులన్నీ నిల్వ చేయకూడదు. అలా చేయడం ద్వారా వాటి స్వాభావిక లక్షణాన్ని కోల్పోయి తినేటపుడు సహజ రుచిని అందించలేవు. చల్లదనం ఎపుడూ హానికరమే. ఇవాళ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో మెటబాలిజం ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం. తాజాగా ఉన్న ఆహారం తీసుకోవడమే ఉత్తమం.
– బి.నరేంద్ర, వైద్యులు, విజయనగరం
చద్దన్నం ఆరోగ్యకరమన్నది పాతతరం వారి మాట. చద్ది ఆహారం అనారోగ్యం అన్నది నేటి తరం మాట. మారుతున్న కాలానికి, తరానికి అనుగుణంగా ఆహార అలవాట్లు, రుచులు మారుతున్నాయి. చద్ది అనే భావన రాకుండా రోజుల తరబడి రిఫ్రిజిరేటర్లలో ఆహారాన్ని నిల్వ చేస్తున్నారు. నిల్వ చేసుకునే కొన్ని ఆహార పదార్ధాలు అనర్థమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment