పట్టాలెక్కుతున్న డబుల్ డెక్కర్ రైళ్లు | double deccar train to run on tracks! | Sakshi
Sakshi News home page

పట్టాలెక్కుతున్న డబుల్ డెక్కర్ రైళ్లు

Published Fri, May 9 2014 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 7:05 AM

పట్టాలెక్కుతున్న డబుల్ డెక్కర్ రైళ్లు

పట్టాలెక్కుతున్న డబుల్ డెక్కర్ రైళ్లు

కాచిగూడ-గుంటూరు మధ్య 13న ప్రారంభం
కాచిగూడ-తిరుపతి సర్వీసు 14 నుంచి మొదలు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇదే తొలిసారి
 దేశంలో ఏడుకు పెరగనున్న రెండంతస్తుల రైళ్లు
  ఇప్పటివరకు ఉన్నవాటికంటే ఇవి ఆధునికమైనవి
 
 సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలిసారిగా డబుల్ డెక్కర్‌రైళ్లు పరుగుపెట్టబోతున్నాయి. హైదరాబాద్ (కాచిగూడ స్టేషన్ నుంచి)-గుంటూరు మధ్య నడిచే తొలి సూపర్‌ఫాస్ట్ రైలు ఈనెల 13న మొదలుకానుండగా, హైదరాబాద్ (కాచిగూడ)- తిరుపతి మధ్య రెండో రైలు 14న ప్రారంభం కానుంది.  దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం ఐదు మార్గాల్లో మాత్రమే డబుల్ డెక్కర్ రైళ్లు నడుస్తుండగా ఈ రెండింటితో ఆ సంఖ్య ఏడుకు పెరగనుంది. ఈ రెండు మార్గాల్లో తిరిగే రైలు ఒక్కటే. ఒక్కో మార్గంలో వారానికి రెండు రోజులు చొప్పున ఈ రైలు రెండు మార్గాల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది. మిగతా డబుల్ డెక్కర్ రైళ్లతో పోలిస్తే ఇది మరింత ఆధునికమైనది. గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర రైల్వే బడ్జెట్‌లో వీటిని ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు నెలన్నర క్రితమే డబుల్ డెక్కర్ రైలు నగరానికి చేరుకున్నా... రైల్వే సేఫ్టీ కమిషనర్ నుంచి అనుమతి రాకపోవటంతో అది ప్రారంభం కాలేదు. రూట్ వాచ్ నిర్వహించిన రేల్వే సేఫ్టీ కమిషనర్ తాజాగా పచ్చజెండా ఊపటంతో అధికారులు ముహూర్తం ఖరారు చేశారు.
 
 వారానికి రెండు రోజులు చొప్పున...
 
  కాచిగూడ-గుంటూరు డబుల్ డెక్కర్ రైలు (నం.22118) ఈ మార్గంలో ప్రతి మంగళ, శుక్రవారాల్లో తిరుగుతుంది. ఆ రోజుల్లో ఉదయం 5.30కు నగరంలో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి మంగళ, శుక్రవారాల్లో మధ్యాహ్నం 12.45కు గుంటూరులో (నం.22117) బయలు దేరుతుంది. ఇది కాచిగూడ, మల్కాజిగిరి, నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు స్టేషన్‌లలో ఆగుతుంది.
 
  కాచిగూడ-తిరుపతి (నం.22120) రైలు ప్రతి బుధ, శనివారాల్లో నడుస్తుంది. ఆ రెండురోజుల్లో ఉదయం 6.45కు కాచిగూడలో బయలు దేరుతుంది. తిరుగుప్రయాణంలో ప్రతి గురు, ఆదివారాల్లో ఉదయం 5.45కు తిరుపతిలో బయలుదేరుతుంది. ఇది కాచిగూడ, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుపతిలలో ఆగుతుంది.
 
 పొగ వస్తే అప్రమత్తం చేసే అలారం...
 
  దేశంలో ప్రస్తుతం చెన్నై-బెంగళూరు, ముంబై-అహ్మదాబాద్, ఢిల్లీ-జై పూర్, హౌరా-ధన్‌బాద్, హబీబ్‌గంజ్-ఇండోర్‌ల మధ్య డబుల్ డెక్కర్ రైళ్లు నడుస్తున్నాయి. వీటితో పోలిస్తే కొత్తగా ప్రారంభమయ్యే రైలు మరింత ఆధునికమైంది. అగ్నిప్రమాదాలను గరిష్ట స్థాయికి తగ్గించేలా ఈ రైల్లో  పొగ రాగానే గుర్తించి అలారమ్ మోగించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది పూర్తిగా ఎయిర్‌కండిషన్డ్ బోగీలతో ఉంటుంది.
 
  ఇందులో కూడా సాధారణ ఏసీ రైలు చెయిర్ కార్ ధరలే ఉంటాయి. పది బోగీలతో ఉండే ఈ రైల్లో ఒక్కో బోగీలో 120 చొప్పున సీట్లుంటాయి. ఇందులో మెరుగైన కుషన్ వ్యవస్థ ఉన్నందున ప్రయాణంలో కుదుపులు ఉండవు. గరిష్టంగా ఇది 160 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement