అఖిల్ మృతిపై అన్నీ సందేహాలే !
- విషయాన్ని కప్పిపుచ్చుతున్న కాలేజీ యాజమాన్యం
- తల్లిదండ్రులతో మాట్లాడనివ్వని పోలీసులు
లబ్బీపేట : నిడమానూరులోని నారాయణ కళాశాలలో విద్యార్థి నర్రా అఖిల్‌తేజ్‌కుమార్ రెడ్డి మృతి విషయాన్ని ఆద్యంతం గోప్యంగా ఉంచిన యాజమాన్యం, అసలు మృతికి గల కారణాలను సైతం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెతున్నాయి. విద్యార్థి అనారోగ్యంతో బాధపడుతున్నాడని, పర్సనల్ ప్రాబ్లమ్స్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం చేయడంపై విద్యార్థి తండ్రి సింగారెడ్డి తీవ్రంగా ఖండిచారు. ఏవేవో కట్టుకథలు చెపుతున్నారని, మా అబ్బాయికి ఎలాంటి అనారోగ్యం లేదని, ప్రాబ్లమ్స్ కూడా లేవని చెబుతున్నారు. అసలు కళాశాలలో ఏమి జరిగిందో తెలియాల్సి ఉందని డిమాండ్ చేస్తున్నారు. గదికి తాళాలు వేసి ఉండగా, కిటికీలో నుంచి లోపలికి ఎలా ప్రవేశించాడని, అలా చేసే పర్యవేక్షణ లేకుండా కాలేజీ యాజమాన్యం ఏమి చేస్తున్నారని తండ్రి ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం 4.30 గంటల సమయంలోనే మృతి చెందినట్లు కాలేజీ యాజమాన్యానికి తెలిస్తే, తమకు 5.30 గంటల సమయంలో అనారోగ్యంగా ఉందని చెప్పడమేమిటని ప్రశ్నిస్తున్నారు. అన్నీ చూస్తే అనేక అనుమానాలు రేకిత్తిస్తున్నట్లు చెబుతున్నారు.
కాలేజీయాజమాన్యానికి అండగా పోలీసులు
విద్యార్థి మృతికి గల కారణాలు బయటకు పొక్కకుండా పోలీసులు సైతం కళాశాల యాజమాన్యానికి అండగా నిలిచారు. అఖిల్ తేజకుమార్‌రెడ్డి రూమ్‌లో మృతి చెందిన ఉండటాన్ని తొలుత చూసిన సహచర విద్యార్థులు గుణశేఖర్, జె మహేశ్వరరెడ్డి, సీహెచ్ మహేశ్వరరెడ్డి, వినోద్, ధనుష్, సాయిచరణ్‌లు ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీ వద్దకు వచ్చారు. వారితో ఎవరినీ మాట్లాడకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. తల్లిదండ్రులను సైతం మీడియాతో మాట్లాడకుండా చూశారు. ఒకదశలో తండ్రి సింగారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నట్లు తెలిసి, సీఐ వచ్చి సంతకాలు చేయాలంటూ లోపలికి తీసుకెళ్లి కూర్చోపెట్టారు. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తహశీల్దారు పంచనామా
నిడమానూరులోని కళాశాల నుంచి సమీపంలోని కార్పోరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లిన మృతదేహాన్ని అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. కాగా మృతదేహానికి విజయవాడ రూరల్ తహశీల్దారు మదన్‌మోహన్ పంచనామా నిర్వహించారు. తల్లిదండ్రులు, బంధువులతో పాటు, ప్రత్యక్ష సాక్షులైన సహచర విద్యార్థుల నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించగా,ప్రకాశం జిల్లాలోని స్వగ్రామానికి తరలించారు.
నారాయణ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి : ఎస్‌ఎఫ్‌ఐ
విద్యార్థుల ఆత్మహత్య పరంపరలు జరుగుతున్నా ప్రభుత్వం నారాయణ కళాశాలల పట్ల ఉదాశీనంగా వ్యవహరిస్తుందని, తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నగర అధ్యక్షుడు కోటి డిమాండ్ చేశారు. ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉన్న అఖిల్ మృతదేహాన్ని సందర్శించి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఆత్మహత్యలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు.ఆత్మహత్యలు నివారించేందుకు నారాయణ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తల్లిదండ్రుల రోదన
బేస్తవారిపేట(ప్రకాశం): విజయవాడలోని నారాయణ కళాశాలలో జూనియర్ ఇంటర్ విద్యార్థి అఖిల్ తేజారెడ్డి మృత దేహం శనివారం స్వగ్రామం బేస్తవారిపేటకు చేరుకోగానే కుటుంబ సభ్యుల రోదన పలువురిని కంటతడి పెట్టించింది. వసతి గృహంలో శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. కుటుంబ సభ్యులు తేజారెడ్డి మృతదేహాన్ని అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. మృతుడి తండ్రి నర్రా శింగరెడ్డి ఉపాధ్యాయుడు కావడంతో కంభం, అర్థవీడు, బేస్తవారిపేట మండలాలకు చెందిన ఉపాధ్యాయులు తరలి వచ్చి తేజారెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అంత్యక్రియల కోసం తేజారెడ్డి మృతదేహాన్ని స్వగ్రామమైన బేస్తవారిపేట మండలం పిటికాయగుళ్లకు తరలించారు.
విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరిపించాలి
గాంధీనగర్ : విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, దీనిపై విచారణ జరిపించాలని ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శులు శ్రీదేవి, కె వసంత్ డిమాండ్ చేశారు. ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల ఆత్మశాంతించాలని కోరుతూ లెనిన్‌సెంటర్‌లో ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన శనివారం నిర్వహించారు.నారాయణ కాలేజీల్లో నెలల వ్యవధిలోనే నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. అయినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.ఆత్మహత్యలకు కారణాలు వెలికితీయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.ప్రైవేటు విద్యాసంస్థల్లో పిల్లల్ని చదివిస్తున్న తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారన్నారు.
ఆందోళనకారులపై కేసు
పెనమలూరు: నిడమానూరు నారాయణ కాలేజీలో ఓ విద్యార్థి చనిపోయిన ఘటనపై కామినేని ఆస్పత్రి వద్ద ధర్నా చేసిన విద్యార్థి సంఘ నేతలపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. అతని మృతదేహం కామినేని ఆస్పత్రిలో ఉంచారు.మృతదేహాన్ని చూడటానికి ఎవ్వరిని అనుమతించక పోవటంతో విద్యార్థి సంఘ నేతలు పోతులసురేష్,బి.ఆంజనేయులు,ఎ.రవిచంద్ర,పలువురు విద్యార్థులు ఆందోళన చేశారు. ఆస్పత్రి సెక్యూరిటీ గార్డు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.