- ప్రభుత్వ స్థలాన్ని విక్రయించారని మాజీ ఎమ్మెల్యే గద్దే బంధువుపై ఫిర్యాదు
- టీడీపీలోని ప్రత్యర్థుల తెరవెనుక ప్రోద్బలంతోనే ఈ ఆరోపణలు ?
- పక్కా డాక్యుమెంట్లతో విక్రయించామని గద్దే వాదన
- విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని తహశీల్దార్‌కు ఆదేశాలు
విజయనగరం : ఈ చిత్రంలో కనిపిస్తున్న భవనం, ఖాళీ స్థలం చీపురుపల్లిలోని జి.అగ్రహారంలో ఉంది. సర్వే నంబర్.124లో ఉన్న ఈ భూమి సర్కార్ పోరంబోకుగా రెవెన్యూ రికార్డులో నమోదై ఉంది. పదేళ్ల క్రితమే ఆ స్థలంలో కొంతమేర సర్వశిక్షా అభియాన్ నిధులతో పాఠశాల భవనాన్ని నిర్మించారు. కానీ దాన్ని వినియోగంలోకి తీసుకురాలేదు. ఇప్పుడా స్థలం, భవనం ఖాళీగా ఉన్నాయి. మైనపు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఆ స్థలాన్ని విసినిగిరి శ్రీనివాసరావుకు గత సంవత్సరం నవంబర్ 26న దస్తావేజు ద్వారా విక్రయించారు. ఇప్పుడిది వివాదంగా మారింది. టీడీపీలోని అంతర్గపోరు నేపథ్యంలో ఇది బయటికొచ్చింది. అధికారులకు ఫిర్యాదు అందడంతో వారు రంగంలోకి దిగారు.
చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య అంతర్గత పోరు సాగుతున్న విషయం తెలిసిందే. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు, గతంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన కె.త్రిమూర్తులరాజు మధ్య అభిప్రాయ బేధాలున్నాయి. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు బంధువైన మైనపు వెంకటేశ్వరరావు వ్యవహారాన్ని ఆయన ప్రత్యర్థి వర్గీయులు బయటకు లాగేందుకు ఉపక్రమించారు. అందులో భాగంగా దండు వినాయకరాజు అనే వ్యక్తి తెరమీదకొచ్చారు. ప్రభుత్వ భూమిని విక్రయించి, దస్తావేజు ద్వారా రిజిస్ట్రేషన్ చేసేశారని తెరపైకి తీసుకొచ్చి గద్దే బంధువులపై అధికారులకు ఫిర్యాదు చేశారు.
అధికారులకు వచ్చిన ఫిర్యాదు సారాంశం
జెడ్పీ అధికారులకు చీపురుపల్లికి చెందిన వినాయకరాజు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి. ఠాణా బిల్డింగ్ అనే పేరు గల స్థలం చీపురుపల్లి గ్రామానికి చెందిన అల్లూరి బాపిరాజు పేరున ఉండేదని, వారి ద్వారా తన పూర్వీకులైన పెనుమత్స రాజేశ్వరమ్మ పొందారని, వీరి నుంచి వీలునామా ద్వారా నాకు లభించిందని వినాయరాజు పేర్కొన్నారు. అయితే రాజకీయపలుకుబడిని ఉపయోగించి మెనపు వెంకటేశ్వరరావు సుమారు 1578 చదరపు గజాల్లో ఆర్‌సీసీ శ్లాబు డాబా ఇంటి క్రయ దస్తావేజు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, తరువాత ఆ స్థలాన్ని ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారని తెలిపారు.
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆ స్థలాన్ని వెంకటేశ్వరరావు మళ్లీ తనకు తానుగా రీవెకేషన్ ఆఫ్ గిప్ట్ పేరుతో స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఇది చట్ట సమ్మతం కాదని, ఒకసారి ప్రభుత్వానికి అందజేసినప్పుడు మళ్లీ ప్రభుత్వమే ఇతనికి దస్తావేజు మూలంగా దఖలు పర్చాలని చెప్పారు. కానీ వెంకటేశ్వరరావు ఆస్తిని స్వాధీ నం చేసుకుని, విసినిగిరి శ్రీనివాసరావుకు అన్యాక్రాంతం చేశారని తెలిపారు. స్థలాన్ని విక్రయించిన వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆ స్థలాని అసలు అనుభవ దారుడినైన తనకు ఇప్పించాలని దండు వినాయకరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై జిల్లా పరిషత్ సీఈఓ రాజకుమారి జోక్యం చేసుకుని చీపురుపల్లి తహశీల్దార్‌కు లేఖ రాశారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరారు.
అన్ని డాక్యుమెంట్లూ ఉన్నాయి...
ఇదే విషయాన్ని మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తమ బంధువులు 1985లో ఆ స్థలాన్ని కొనుగోలు చేశారని, విద్యాభివృద్ధి కోసం 1989లో మండల పరిషత్‌కు ఇచ్చామని, కాకపోతే దాన్ని వినియోగించకపోవడంతో వెనక్కి తీసుకున్నారని, తమ బంధువుల పేరున రిజిస్ట్రేషన్ కూడా జరిగిందని, తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయని తెలిపారు. దాన్నిప్పుడు మా బంధువులు విక్రయించారని చెప్పారు. వినాయకరాజుకు ఇదే విషయాన్ని చెప్పానని,ఆ ఫిర్యాదులో తన పేరు ప్రస్తావిస్తే మాత్రం తగు చర్యలు తీసుకుంటానని చెప్పుకొచ్చారు.
మొత్తానికి టీడీపీలో నెలకున్న అంతర్గత పోరు నేపథ్యంలో ఈ విషయం వెలుగు చూసింది. అయితే, ఇందులో ఎంత వాస్తవం ఉందో అధికారులే తేల్చాలి. వాస్తవానికైతే ఎవరైనా ప్రభుత్వానికి స్థలం దానం ఇచ్చినప్పుడు సంబంధిత శాఖ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తారు. సదరు స్థలాన్ని వినియోగించుకోకపోతే దాత కోరిన పక్షంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి మళ్లీదాత పేరుమీద రిజిస్ట్రేషన్ చేస్తారు. కానీ అందుకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ జరిగిందని గద్దే వ్యతిరేక వర్గీయులు వాదిస్తున్నారు. కాగా, ఇదే విషయమై చీపురుపల్లి తహశీల్దార్ డి.పెంటయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా సీఈఓ నుంచి తనకు విచారణ ఉత్తర్వులొచ్చానని, పూర్తి స్థాయిలో పరిశీలన చేసి నివేదిక ఇస్తామని చెప్పగా, వీఆర్‌ఓ రమణమూర్తి మాత్రం అది ప్రభుత్వ స్థలంగా రికార్డులో నమోదై ఉందని తెలిపారు.
టీడీపీలో స్థల రాజకీయం
Published Wed, Feb 11 2015 3:49 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement