జెడ్పీలో రసాభాస
- అర్ధాంతరంగా సభ రద్దు
- తాగునీటికి నిధుల కేటాయించలేదని నిలదీసిన విపక్షం
- తాగునీటి సమస్యే లేదన్న మంత్రి బొజ్జల
- వేదిక వద్ద బైఠాయించిన విపక్షం
జిల్లాలో తాగునీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు నిధుల కేటాయింపులో పాలకవర్గం వివక్ష పూరితంగా వ్యవహరించిందని నిరసిస్తూ విపక్షం ఆందోళనకు దిగడంతో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అర్ధాంతరంగా ముగిసింది.
సాక్షి,చిత్తూరు: జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం తాగునీటి సమస్యతోపాటు 29 అంశాలు అజెండాగా జెడ్పీ సర్వసభ్య సమావేశం చైర్‌పర్సన్ గీర్వాణి అధ్యక్షతన జరిగింది. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ విపక్షం నుంచి వైఎస్సార్‌సీపీకి చెందిన పలమనేరు, నగరి, పీలేరు, మదనపల్లె, గంగాధరనెల్లూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, ఆర్‌కే రోజా, చింతల రామచంద్రారెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డి, నారాయణస్వామి, సునీల్‌కుమార్, ఫ్లోర్ లీడర్ వెంకటరెడ్డి యాదవ్ హాజరయ్యా రు. జిల్లాలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులున్న ప్రాంతాలకు నిధులు కేటాయించక వివక్ష చూపించడమేంటని పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, మిగిలిన సభ్యులు నిలదీశారు.
పైసా కూడా కేటాయించని ప్రాంతాలను ఉదహరిస్తూ గట్టిగా ప్రశ్నించారు. ఇదే విషయంపై గత సమావేశాల్లో ప్రశ్నిస్తే భవిష్యత్తులో అలా జరగకుండా చూస్తామంటూ సమాధానమిచ్చారని అయినా పాలక వర్గంలో మార్పులేదని ధ్వజమెత్తారు. తాగునీటి సమస్యను చివరన చర్చిస్తామని మంత్రి పదేపదే చెప్పడంతో సభ్యులు కొంతసేపు శాంతించారు. ఆ తరువాత సమాధానం చెప్పకుండా సమావేశాన్ని ముగించే ప్రయత్నానికి దిగడంతో విపక్ష ఎమ్మెల్యేలు మంత్రిని నిలదీశారు. దీంతో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య లేదని మంత్రి ప్రకటించారు. మంత్రికి దమ్ముంటే గ్రామాలకు వస్తే చూపిస్తామని విపక్ష ఎమ్మెల్యేలు సవాల్ విసిరారు. వైఎస్సార్‌సీపీ సభ్యులకు నిధులిచ్చేది లేదని, లక్షలు కొల్లగొట్టినోళ్లకు నిధులెందుకని మంత్రి అనడంతో విపక్ష ఎమ్మెల్యేలు మండిపడ్డారు.
ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది. పట్టిసీమ పేరుతో కోట్లు కొల్లగొట్టింది మీరేనంటూ నిలదీశారు. నిధుల కేటాయింపుపై స్పష్టమైన ప్రకటన చేయాల్సిందేనని వేదిక ముందు బైఠాయించారు. దీంతో అధికారపక్షం నోరు మెదపలేదు. విపక్ష సభ్యులు సభను అడ్డకున్నందున అజెండాను ఆమోదించినట్లేనంటూ చెప్పి మంత్రి, చైర్‌పర్సన్ వెళ్లిపోయారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి, అధికార పార్టీకి చెందిన చిత్తూరు, తిరుపతి, తంబళ్లపల్లె, సత్యవేడు ఎమ్మెల్యేలు సత్యప్రభ,సుగుణమ్మ, శంకర్, ఆదిత్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.