రూ.42.5 లక్షల ఎంపీ నిధులతో తాగునీటి పథకాలు
► ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి
ఆత్మకూరు: ఆత్మకూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యను శాస్వతంగా పరిష్కరించే నిమిత్తం నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రూ.42.50 లక్షల ఎంపీ లాడ్స్ నిధులను మంజూరు చేశారని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం ఆత్మకూరు క్యాంప్ కార్యాలయంలో ఈ వివరాలను విలేకరులకు అందజేశారు. 1000లీ సామర్థ్యం గల ఆర్వో ప్లాంటును ఏర్పాటుచేయటం, ఇందుకు సంబంధించిన షెడ్డు బోర్ వెల్ మోటారు విద్యుత్ కనెక్షన్ కోసం మొత్తం రూ.ఆరు లక్షలు ఎంపీ లాడ్స్ నిధులను ఒక్కొక్క ప్లాంటుకు మంజూరుచేసినట్టు తెలిపారు.
ఈ ప్లాంటులను అనంతసాగరం మండలంలోని అనంతసాగరం దిగువూరు, మంచాలపల్లి, గౌరవరం, కామిరెడ్డిపాడు, పడమటి కంభంపాడు గ్రామాల్లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆత్మకూరు మండలం దేపూరు, నల్లపరెడ్డిపల్లి, ఆరవీడు గ్రామాలకు కూడా ఈ వాటర్ ప్లాంటులను మంజూరు చేసారన్నారు. నిధులు మంజూరు చేసిన ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. సమావేసంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఇందూరు నరసింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరపల్లి శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.
ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలి
మర్రిపాడు : ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్‌ను ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి కోరారు. మర్రిపాడులో తహసీల్దారు కార్యాలయం తనిఖీకి వచ్చిన జేసీ ఇంతియాజ్‌ను గురువారం ఎమ్మెల్యే కలిశారు. నియోజకవర్గంలో పలు సమస్యల గురించి జేసి దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా ధాన్యానికి గిట్టుబాటు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారికి గిట్టుబాటు ధర కల్పించాలన్నారు.
అంతేకాకుండా మర్రిపాడు మండలంలో భూసమస్యలు అధికంగా ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ రికార్డులను పరిశీలించారు. ఈర్లపాడు భూములకు సంబంధించిన నివేదికలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే నివేదిక తయారుచేసి ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు ఎంవీ కృష్ణారావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవరపల్లి శ్రీనివాసులురెడ్డి, మందా రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.