పార్టీ మారుతున్నది స్వార్థ నాయకులే తప్ప కార్యకర్తలు కాదని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు అన్నారు.
మొయిద(నెల్లిమర్ల రూరల్) : పార్టీ మారుతున్నది స్వార్థ నాయకులే తప్ప కార్యకర్తలు కాదని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు అన్నారు. తాగునీటి సమస్యపై సోమవారం మండల కేంద్రంలో భారీ ఎత్తున ఆందోళన చేపడుతున్నామని చెప్పారు. మండలస్థాయి పార్టీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర నాయకులతో మొయిదలోని తన స్వగృహంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆ పార్టీ మండల అధ్యక్షుడు చనుమళ్లు వెంకటరమణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పెనుమత్స మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు రాజ్యమేలుతోందని, గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు హాహాకారాలు చేస్తున్నారని.. ఇవేవీ పట్టని చంద్రబాబు అక్రమ సంపాదనతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు తీరుపై యువకులు, మహిళలు, రైతులు.. ఇలా అన్ని వర్గాలవారూ అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. వైఎస్‌ఆర్‌సీపీకి ప్రజల్లో ఆదరాభిమానాలు ఉన్నాయని, కొంతమంది స్వార్థపూరిత ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుపోయినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని స్పష్టం చేశారు. తాగునీటి సమస్యపై పార్టీ అధిష్టానం పిలుపుమేరకు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున మహిళలు ఖాళీ బిందెలతో ర్యాలీగా వెళ్లి, తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టనున్నట్లు వివరించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములునాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజల సమస్యలను విస్మరించి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే పరమావధిగా పని చేస్తున్నారని, అవినీతి సొమ్ముతో విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.
తామంతా సాంబశివరాాజు వెంట పనిచే సి పార్టీ మరింత బలోపేతానికి కృషి చేస్తామన్నారు. చనమళ్లు వెంకటరమణ మాట్లాడుతూ మంచినీటి సమస్యపై చేపట్టిన ధర్నా కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు, పార్టీ కార్యవర్గ సభ్యులు యడ్ల గోవిందరావు, సంగంరెడ్డి సాంబ, నాఫెడ్ డెరైక్టర్ కె.వి.సూర్యనారాయణరాజు, మొయిద సూరిబాబు, రెడ్డి రామారావు, గుడివాడ గణపతిరావు, నక్కాన వెంకటరావు, రాయి విభీషణరావు, రేగాన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.