తాగేందుకు నీళ్లు కరువే
- తాగేందుకు నీళ్లు కరువే
- నిరుపయోగంగా మరుగుదొడ్లు
- మెనూలో మాయమవుతున్న గుడ్డు
- చలిని ఆపలేని పలుచటి దుప్పట్లు
జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు తిష్ట వేశాయి. వీటిపై సాక్షి దినపత్రికలో రెండు నెలల క్రితం సమరసాక్షి శీర్షికన వరుస కథనాలు ప్రచురించినా అధికారుల్లో చలనం లేదు. ఇప్పటికీ అనేక హాస్టళ్లలో కనీస సదుపాయాలు లేవు. చిన్నారులకు గుక్కెడు నీరు కరువవుతోంది.
సాక్షి, చిత్తూరు: జిల్లాలో ఎస్సీ 124, ఎస్టీ, 16, బీసీ 66, మైనారిటీలకు 2 హాస్టళ్లను సంక్షేమశాఖ ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇక్కడి సమస్యలు విద్యార్థులకు నరకం చూపుతున్నాయి. బాలికల హాస్టళ్ల వద్ద రా త్రిపూట రక్షణ ఉండడం లేదు. మం గళ, గురువారాల్లో గుడ్డు ఇవ్వాల్సి ఉంది. అయితే పలు హాస్టళ్లలో గుడ్డు మాయమవుతోంది. ప్రభుత్వం అం దజేసిన పల్చటి దుప్పట్లు చలిని ఆపలేకపోతున్నాయి. గదులకు కిటికీలు, తలుపులు బిగించకపోవడంతో చలితీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది. దోమల దెబ్బతో చిన్నారులు జ్వరాల బారినపడుతున్నారు.
-మదనపల్లె నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ బాలికల హాస్టళ్లలో బిందెలు, గ్లాసులు లేవు. అన్నం తినేటప్పుడు గొంతు పట్టుకుంటే విద్యార్థులు పరుగున కొళాయి వద్దకు చేరుకుంటున్నారు. విద్యుత్ పోతే కనీసం కొవ్వొత్తులు వెలిగించే దిక్కులేదు. వార్డెన్లు హాస్టళ్ల ముఖం చూడడం లేదు. వాచ్‌మెన్, వంటోళ్లతో నడిపిస్తున్నారు. మదనపల్లెలోని ఎస్సీ హాస్టల్‌కు ములకలచెరువు వార్డెన్‌ను ఇన్‌చార్జిగా నియమించారు. ఇక్కడ పిల్లల పరిస్థితి దయనీయంగా ఉంది. వృద్ధ మహిళలను వాచ్‌మెన్లుగా పెట్టారు. బాలికలకు రక్షణ లేదు. దుప్పట్లు లేవు. పాచినీళ్లే తాగుతున్నారు.
- చిత్తూరు ఎస్సీ బాలురు-1 హాస్టల్‌కు రెండు నెలల నుంచి ప్రహరీగోడ లేదు. పందులు, కుక్కలు లోపలకు వచ్చేస్తున్నాయి. బయటి వ్యక్తులు హాస్టల్ స్థలంలో గుడిసెలు వేసేందుకు యత్నిస్తున్నారు. ఎస్సీ హాస్టల్-2 వద్ద మరుగుదొడ్ల నిర్వహణ మెరుగుపడలేదు. విద్యార్థులు మల, మూత్రవిసర్జనకు ఆరుబయటకు వెళ్లాల్సిందే. గతంలో 300 మంది బాలురు ఉండేవారు. ప్రస్తుతం ఈ సంఖ్య 30 మందికి పడిపోయింది.
-జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు భవనాలు లేవు. పెనుమూరు మండలం ఉగ్రాణంపల్లె, పెనుమూరు ఎస్సీ బాలుర హాస్టల్ భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. విద్యార్థులకు సరిపోయే సంఖ్యలో మరుగుదొడ్లు లేవు.
- సత్యవేడులో బీసీ హాస్టల్ భవనం పరిస్థితి మెరుగుపడలేదు. అద్దెభవనంలో కిటికీలు, తలుపులు లేకుండానే కొనసాగుతోంది. ఇక్కడ ఆరుబయటే భోజనాలు తినాల్సి వస్తోంది.
- పలమనేరు హాస్టళ్లలో పల్చటి దుప్పట్లు చలిని ఆపలేకపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో ఇదే పరిస్థితి. పారిశుద్ధ్య లోపంతో దోమలు విజృంభిస్తున్నాయి. కిటికీలు లేకపోవడంతో పిల్లలు వణికిపోతున్నారు.
- తిరుపతిలోని బీసీ హాస్టల్‌లో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. గదుల్లో లైట్లు లేవు. కొందరు పిల్లలు వంటగదుల్లో పడుకుంటున్నారు. మెనులో గుడ్డు ఇవ్వడం లేదు. ఎస్సీ హాస్టల్‌లో గదుల, మరుగుదొడ్ల తలుపులు పూర్తిగా విరిగిపోయాయి. సాయంత్రం 5 గంటలు దాటితే వార్డెన్ అందుబాటులో ఉండడం లేదు. ఎస్టీ బాలుర హాస్టల్‌లో మెనూ పూర్తిగా అమలు కావడం లేదు.
- చంద్రగిరి నియోజకవర్గం పాకాలలో ఎస్సీ హాస్టల్‌లో మరుగుదొడ్లకు నీటి సదుపాయం లేదు. దోమల కారణంగా విద్యార్థులు జ్వరాల బారిన పడుతున్నారు. రామచంద్రాపురంలోని హాస్టల్‌లో రీడింగ్ రూం లేదు. దోమల బెడద అధికంగా ఉంది. చంద్రగిరి ఎస్సీ, బీసీ హాస్టళ్లలో మరుగుదొడ్లలో నీటి కొరతతో పారిశుద్ధ్యం లోపించింది.
- ముఖ్యమంత్రి నియోజకవర్గం పీలేరులోని హాస్టళ్లలో మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. పీలేరు ఎస్సీ బాలుర హాస్టల్‌లో నీటి సమస్య వేధిస్తోంది. చలికి పల్చటి దుప్పట్లే విద్యార్థులకు దిక్కవుతున్నాయి.