బిక్కుబిక్కుమంటూ..
విశాఖపట్నం: అన్ని సౌకర్యాలూ ఉంటాయని ఉత్తరాంధ్రతోపాటు ఇతర జిల్లాల నుంచి విశాఖకు ప్రజలు వలస వస్తుంటారు. కానీ హుదూద్ తుపాను ప్రస్తుతం విశాఖ నగరంలో తాగునీరుకు కూడా దిక్కులేని దుస్థితిని మిగిల్చింది. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో జీవీఎంసీ సరఫరా చేసే తాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడింది. విద్యుత్తు సరఫరా లేకపోవటం వల్ల బోర్లు కూడా పనిచేయటం లేదు. ఇప్పటికే ట్యాంకుల్లో ఉన్న నీళ్లు దాదాపుగా పూర్తికావచ్చాయి.
ట్యాంకుల ద్వారా సరఫరా చేయాలంటే మొదట రోడ్లపై వాహనాలు తిరిగే పరిస్థితి లేదు. లెక్కకు మిక్కిలిగా దుకాణాలు ధ్వంసం కావడంతో అత్యవసర, నిత్యావసర వస్తువుల అమ్మకం కూడా సాధ్యపడేట్లుగా లేదు. మందుల దుకాణాలు కూడా తెరవడం లేదు. విద్యుత్తు సరఫరా లేక ఆసుపత్రుల్లోనూ గాడాంధకారం నెలకొంది. ఈ నేపథ్యంలో అత్యవసర చికిత్స అవసరమైతే ఎక్కడికి వెళ్లాలో తెలియని దుస్థితి నెలకొంది.
విశాఖపట్నంలో ఓ కళాశాల హాస్టల్ విద్యార్థికి అస్వస్థత ఏర్పడితే ఎక్కడికి, ఎలా తీసుకువెళ్లాలో తెలియక సహ విద్యార్థులు నానా హైరానా పడాల్సి వచ్చింది. ఆంధ్రా విశ్వవిద్యాలయంతో సహా విశాఖలోని అన్ని కళాశాలల హాస్టళ్లలో విద్యార్థులకు ఆహారం, తాగునీరు సదుపాయం లేకుండాపోయింది. అంతర్జాతీయ నగరంలో వినుతికెక్కుతుందని ఆశిస్తున్న విశాఖ నగరం... హుదూద్ పెను తుపాను మిగిల్చిన విషాదాన్నుంచి కోలుకోవటానికి ఎంత సమయం పడుతుందన్నది కూడా చెప్పే పరిస్థితి లేదు.