ఖాతాల నిలిపివేత హైకోర్టు
- ఎస్‌బీహెచ్‌పై పరువునష్టం దావా సమీక్ష అనంతరం గంటా వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తమ ఖాతాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్తంభింపచేయడంపై హైకోర్టును ఆశ్రయించాలని ఏపీ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. మండలి విధులకు ఆటంక పరిచినందుకు, విద్యార్థుల పరీక్షలు భవితతో ముడిపడి ఉన్న వ్యవహారాలు ఆలస్యమయ్యేలా వ్యవహరించినందుకు క్రిమినల్ డిఫమెషన్ దావా కూడా దాఖలు వేయాలని భావిస్తోంది.
ముందుగా ఖాతాల నిలిపివేతపై సోమవారం హైకోర్టును ఆశ్రయించనుంది. తాజా పరిస్థితిపై రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్నత విద్యా మండలి అధికారులతో శుక్రవారం సమీక్షించారు. సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి,విద్యా మండలి ఛైర్మన్‌ఎల్.వేణుగోపాలరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.నోటీసులు ఇవ్వకుండా ఎస్‌బిహెచ్ మండలి ఖాతాలను స్తంభింపచేయడం చట్టవిరుద్ధమని, దీనిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
కేబినెట్లో నిర్ణయించాక ఎంసెట్‌పై నిర్ణయం..: ఉమ్మడి ఎంసెట్ నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో తదుపరి కార్యాచరణపై ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి సమావేశంలో ప్రస్తావించారు. వివిధ సెట్లకు యూనివర్సిటీల ఎంపిక, కన్వీనర్ల నియామకం, పరీక్షల ఏర్పాట్లు వంటి అంశాలను పూర్తిచేయాల్సి ఉందని తెలిపారు. ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారం కనుక దీనిపై వచ్చేనెల 2న కేబినెట్లో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. సమావేశం అనంతరం మంత్రి గంటా మీడియాతో మాట్లాడుతూ సమీక్ష వివరాలను వెల్లడించారు.