
కరువు పంజా
సాక్షి ప్రతినిధి, తిరుపతి : జిల్లాలో ముందస్తు వర్షాలు అన్నదాతను ఊరించి ఉసూరుమనిపించాయి. ముందుగా వర్షాలు కురియడంతో అన్నదాతలు అష్ట కష్టాలు పడి వేరుశెనగ పంటను సాగుచేశారు. వరుణుడు ముఖం చాటేయడంతో జిల్లా ా్యప్తంగా పంట ఎండిపోతోంది. కళ్లేదుటే ఎండిపోతున్న వేరుశెనగ పంటను చూసి అన్నదాత తల్లడిల్లిపోతున్నాడు. పెట్టిన పెట్టుబడులు దక్కకపోవడంతో అప్పు తీర్చే దారిలేక గ్రామాలను వీడి వెళుతున్నారు. బ్యాంకుల నుంచి రుణాలు అందడం లేదు. 2013, 2014 సంవత్సరాలకు సంబంధించి జిల్లాకు రూ.200 కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీ రావాల్సింది. దీని కోసం 2లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారు. పంట బీమా ఊసే లేదు.
ఉపాధి పనులూ లేవు
జిల్లాలో ఉపాధి పనులు కల్పించడంలో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహారి స్తోంది. నీరు-చెట్టు పనులకు ప్రాధాన్యత ఇచ్చి కూలీల కడుపు కొడుతోంది. ముఖ్యం గా పడమటి మండలాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. తంబళ్లపల్లె, మదనపల్లె, పలమనేరు, పీలేరు, కుప్పంలో పనులు లేక తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వలస పోతున్నారు.
లక్షల సంఖ్యలో వలసలు
సీఎం సొంత ఇలాకాలోనే 50 వేల మందికిపైగా ప్రజలు వలసబాట పట్టారు. దీంతో పాటు తంబళ్లపల్లె, మదనపల్లె, పలమనేరు, సత్యవేడు, చిత్తూరు, గంగాధరనెల్లూరులో దాదాపు 1.50 లక్షల మందికి పైగా పొట్ట చేత పట్టుకుని తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. గ్రామాలకు గ్రామాలే ఖాళీ అవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ముసలివారు, పిల్లలు మాత్రమే కనిపిస్తున్నారు.