- ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు
- కరువుతో కటకటపడుతున్న పల్లెసీమలు
కదిరి: ఓవైపు కరువు, మరోవైపు ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు ఫలితంగా కరువు జిల్లాలో పండుగలు కళ తప్పుతున్నాయి. కిలో బియ్యం రూపాయికి అందజేస్తున్న ప్రభుత్వం నిత్యావసర ధరలను అదుపు చేయలేకపోతోంది. సామాన్యులు, మధ్య తరగతివారు ఎందుకొచ్చిన పండుగలురా.. బాబూ అని నిట్టూరుస్తున్నారు. వినాయక చవితి అనగానే కొత్త అల్లుళ్లు పండుగకు అత్తగారిల్లు చేరతారు. నూతన వస్త్రాలతో పిండి వంటలతో ఏ ఇళ్లు చూసినా పండుగ కళతో నిండిపోయేది. ప్రస్తుతం ఈ పరిస్థితి కనిపించడం లేదు.
కాగుతున్న నూనెలు: వంట నూనె లేనిదే పండుగ లేదు. కిలో వేరుశనగ నూనె రూ.110 నుంచి 120, సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.90, వనస్పతి రూ.60, పామాయిల్ రూ.60 ఇలా వంటనూనె ధరలు స్టౌ మీద పెట్టకనే కాగిపోతున్నాయి. బెల్లం ధర చక్కెరను మించిపోయింది. కిలో చక్కెర రూ. 40 కాగా, బెల్లం రూ. 50 పలుకుతోంది.
పప్పులు..నిప్పులు: కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఇలా ఏ పప్పు ధర చూసినా సరాసరి రూ. 80 పలుకుతోంది. వేరుశనగ పప్పు ఎన్నడూ లేనివిధంగా ఈసారి కిలో రూ. 90కి చేరింది. కంది, పెసరపప్పుతో పోలిస్తే కాస్త తక్కువగా వుండే శనగపప్పు కూడా రూ.80కి అమ్ముతున్నారు. మార్కెట్‌లో సన్నబియ్యం ధ రలు అందరికీ అందుబాటులోకి తెస్తామని చెప్పిన ప్రభుత్వం వాటి సంగతే మరచినట్టుంది. ఇప్పుడు బియ్యం కిలో రూ 36 నుంచి రూ. 40 ధర పలుకుతోం ది.
కిలో మైదా రూ 25 నుంచి 30, గోధుమపిండి రూ. 30, చింతపండు రూ. 60 నుంచి 80, ఎండుమిర్చి రూ. 80కి అమ్ముతున్నారు. ధరల కారణంగా వ్యాపారా లు కూడా అంతంతమాత్రమే ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
బోసిపోయిన పల్లెలు: పండుగల సమయంలో పల్లెలు కళకళలాడేవి. కానీ ఏ గ్రామం చూసినా జనంలేక బోయిపోయింది. ప్రతి ఇంటికీ తాళాలే కన్పిస్తున్నాయి. ముసళోల్లు, చిన్నపిల్లలు మాత్రం గ్రామాల్లో కనిపిస్తున్నారు. మిగిలిన వారి సంగతి అడిగితే బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లారని చెబుతున్నారు.
పండుగ కళ ఏదీ?
Published Thu, Aug 28 2014 3:48 AM | Last Updated on Sat, Sep 2 2017 12:32 PM
Advertisement