వైఎస్‌ఆర్ జిల్లా,చింతకొమ్మదిన్నె : మద్యం మత్తులో ఓ వ్యక్తి బావిలో గంగమ్మ తల్లిని చూపిస్తానంటూ ప్రయత్నించాడు. బావి గట్టున తన మిత్రునితో కలిసి మద్యం సేవించి మాటకుమాట పెంచుకున్నాడు. దేవతను చూపిస్తానంటూ బావిలోకి దిగుతుండగా.. బండరాయి విరగడంతో కింద పడ్డాడు. తీవ్ర గాయాల పాలయ్యాడు. సీకెదిన్నె పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మద్దిమడుగు సుగాలి బిడికికి చెందిన కిశోర్ నాయక్, రామాంజనేయపురానికి చెందిన అయోధ్యరామయ్య చింతకొమ్మదిన్నె సమీపంలోని బావి గట్టున మద్యం సేవించారు.
దేవుడు ఉన్నాడా.. లేడా అనే విషయంపై ఇద్దరు వాదనకు దిగారు. దేవుడు ఉన్నాడని కిశోర్ నాయక్, లేడని అయోధ్య రామయ్య వాదించారు. ఇరువురు చాలెంజ్ చేసుకున్నారు. కిశోర్ నాయక్ తాను బావిలోకి వెళ్లి గంగమ్మ తల్లిని చూపిస్తానని దిగబోయాడు. బావి పాతబడి ఉండటంతో తాపలుగా ఉన్న బండరాయి ఒక్కసారిగా బరువు తట్టుకోలేక విరిగి పోయింది. దీంతో అతను దాదాపు 75 అడుగుల లోతులో ఉన్న బావిలో పడిపోయాడు. అయోధ్య రామయ్య భయభ్రాంతులకు గురై రోడ్డు పైకి పరుగు తీశాడు. బావిలో పడిన వ్యక్తిని కాపాడాలని కేకలు వేశాడు. అక్కడున్న స్థానికులు ఫైర్ పోలీసులకు, సీకె దిన్నె పోలీసులకు సమాచారం అందించారు. బావిలో పడిన వ్యక్తిని మోకులు (తాళ్ల) సాయంతో బయటకు తీశారు. అతను తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు 108 సాయంతో చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment