హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఈనెల 9, 10, 11 తేదీల్లో నిర్వహించిన డిఎస్సీ-2014 (టెట్ కమ్ టీఆర్‌టీ) పరీక్షలకు సంబంధించిన ఫైనల్ కీని పాఠశాల విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. పోస్టుల వారీగా ఈ ఫైనల్ కీని http//apdsc.cgg.gov.in అనే వెబ్‌సైట్లో పొందుపరిచారు. శుక్రవారం నుంచి ఈ ఫైనల్ కీని అభ్యర్ధులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె.సంధ్యారాణి ఒక ప్రకటనలో వివరించారు. పోస్టుల వారీగా ఇచ్చిన ఈ కీలో కొన్ని ప్రశ్నలకు 'యాడెడ్ స్కోర్' అని ఇచ్చారు. ప్రశ్న తప్పు అయినప్పుడు ఆ ప్రశ్నకు సమాధానంగా దేన్ని పేర్కొన్నా మార్కులు కలపనున్నారని అధికారవర్గాలు వివరించాయి. మరికొన్ని ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాల ఆప్షన్లలో ఒకటికన్నా ఎక్కువ సరైన జవాబు అయినప్పుడు ఆ రెండింటినీ సూచిస్తూ కీలో పేర్కొన్నారు. అభ్యర్ధులు వాటిలో దేన్ని సమాధానంగా పేర్కొన్నా మార్కులు పడనున్నాయి.