ఎటూ తేలని డీఎస్సీ | DSC moved close | Sakshi
Sakshi News home page

ఎటూ తేలని డీఎస్సీ

Published Mon, Sep 21 2015 3:30 AM | Last Updated on Sun, Sep 3 2017 9:41 AM

ఎటూ తేలని డీఎస్సీ

ఎటూ తేలని డీఎస్సీ

సాక్షి,చిత్తూరు : డీఎస్సీ -2014పై ప్రభుత్వం ఎటూ తేల్చక పోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. ఒక వైపు మంత్రితో పాటు ముఖ్యమంత్రి రోజుకోమాట మాట్లాడుతూ అభ్యర్థులను గందరగోళంలోకి నెడుతున్నారు. సెప్టెంబ ర్ మొదటి వారంలో ఉపాధ్యాయ నియామక ప్రక్రి య పూర్తి చేయనున్నట్లు ఆగస్టు చివరి వారంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఆ తర్వాత విశాఖ పర్యటన సందర్భంగా ముఖ్యమం త్రి చంద్రబాబు సైతం వారంలో నియామకాలు ఉంటాయని చెప్పారు.

ఆగస్టు పోయి సెప్టెంబర్ చివరి వారం వచ్చినా డీఎస్సీ నియామకాలు జరిగే పరిస్థితి కానరావడంలేదు. ఎప్పటికి నియామకాలు  మొదలు పెడతారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదు. దీంతో అభ్యర్థుల్లో మరింత ఆందోళన నెలకొంది. మరో వైపు రేషన లైజేషన్ నేపథ్యంలో అసలు డీఎస్సీ నియామకాలు ఉంటాయో లేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేలాది మంది అభ్యర్థులు రేయింబవళ్లు  కష్టపడి చదివి డీఎస్సీ రాసినా ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాల సంగతి పట్టించుకోక పోవడంతో అభ్యర్థులు ఆగ్రహానికి లోనవుతున్నారు.

 గత ఏడాది నవంబర్ 20న డీఎస్సీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో 1,336 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి తొలుత 42 వేల మందికి పైగా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా 37,268 మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్షకు హాజరయ్యారు. మే 9, 10, 11 తేదీల్లో ప్రభుత్వం డీఎస్సీ పరీక్ష నిర్వహించింది. జూన్ 3న విద్యాశాఖ ఫలితాలను వెల్లడించింది. జూన్ 9 నాటికి మెరిట్ జాబితా జిల్లాలకు పంపి 15 నాటికే ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.

అయితే న్యాయపరమైన చిక్కులు తలెత్తడంతో విద్యాశాఖ మెరిట్ జాబితా విడుదలను వాయిదా వేసింది. డీఎస్సీ ప్రశ్నాపత్రాల కీ లోని తప్పులపై 1,836 కేసులు నమోదయ్యాయి. డీఎస్సీ ప్రాథమిక కీ పైనే 3 వేలకుపైగా అభ్యంతరాలు విద్యాశాఖకు అందినట్లు సమాచారం. ప్రాథమిక కీ పై అభ్యంతరాలు వచ్చినా విద్యాశాఖ ఫైనల్ కీ విడుదలలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదన్న విమర్శలు వచ్చాయి. దీంతో పాటుగా డీఎస్సీ -2014 నిర్వహణ పైనే మరో కేసు ఉంది. డీఎస్సీ 2014ను గతంలోకంటే భిన్నంగా నిర్వహించడం వివాదాస్పదంగా మారింది.

గతంలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్)ను నిర్వహించి అందులో క్వాలిఫై అయిన వారికి డీఎస్సీ (టీచర్ రిక్రూట్‌మెంట్ -టెస్ట్) నిర్వహించేవారు. ఈ సారి టెట్, టెర్ట్‌లను కలిపేసి డీఎస్సీ నిర్వహించారు. ఇది నిబంధనలకు విరుద్ధమని న్యాయస్థానంలో ఇప్పటికే కొందరు సవాలు చేస్తున్నారు. ఇక డీఎస్సీపై కోర్టు, ట్రిబ్యునల్‌లో 547 కేసులు నమోదయ్యాయి. వీటిపై కౌంటర్లు దాఖలు చేసి నియామకాలకు వీలుగా మార్గం సుగమం చేసుకోవాల్సి ఉంది. కానీ విద్యాశాఖ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తుండడం వల్లే డీఎస్సీ నియామక ప్రక్రియ ముందుకు సాగడంలేదన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement