* 1,210 పోస్టులకు 50 వేలమందికి పైగా అభ్యర్థులు
* ఎస్జీటీలకు తక్కువ పోటీ, ఎస్‌ఏలకు హోరాహోరీ
* జిల్లాలో కళకళలాడుతున్న శిక్షణా కేంద్రాలు
భానుగుడి (కాకినాడ) : ఉపాధ్యాయ ఎంపిక అర్హత పరీక్ష (టెట్ కమ్ టీఆర్‌టీ (డీఎస్సీ)కు సంబంధించిన నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కావడంతో ఆ ఉద్యోగార్థుల్లో ఆనందం, ఆత్రుత పెల్లుబుకుతున్నాయి. జిల్లాలో 884 సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), 326 స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టులకు 50 వేలమందికి పైగా అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా కోచింగ్ కేంద్రాలు కళకళలాడుతున్నాయి. కొన్ని కేంద్రాలు అభ్యర్థుల సంఖ్య విపరీతంగా ఉండడంతో చోటులేక తాత్కాలికంగా వేసిన పందిళ్లలో శిక్షణనిస్తున్నాయి.
ఎప్పటిలానే ఈ డీఎస్సీకి కూడా ఎస్జీటీ పోస్టులకు పోటీ తక్కువగానే ఉంది. 884 పోస్టులకు పోటీ పడుతున్న వారు (ప్రస్తుతం డీఎడ్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారితో కలిపి) 4,200 మంది ఉన్నారు. అంటే ఒక్కో పోస్టుకు 4.7 మంది పోటీపడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వోద్యోగాలకు సంబంధించి అతి తక్కువ పోటీ ఉన్నది ఎస్జీటీకి మాత్రమే కావడం విశేషం. ఈ ఏడాది ఉన్న ఖాళీలు వచ్చే డీఎస్సీకి ఉండవని, ప్రస్తుత రేషనలైజేషన్ ప్రక్రియ, డీఎస్సీ అనంతరం చాలా వరకు ఖాళీలు భర్తీ అవుతాయని అధికారులు అంటున్నారు. అలాగే అతి ఎక్కువ ఖాళీలు గల జిల్లా ప్రస్తుతం తూర్పుగోదావరేనంటున్నారు. ప్రభుత్వం ఎస్జీటీలుగా బీఎడ్ అభ్యర్థులకు అవకాశం ఇచ్చేది లేదని తేల్చింది.
ఇక జిల్లాలో ఉన్న ఎస్‌ఏ ఖాళీలను బట్టి పోటీ పడుతున్న అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. జిల్లాలో ‘టెట్’ క్వాలిఫై అయిన అభ్యర్థులు 19,921 మంది ఉండగా, ‘టెట్’ కు హాజరు కాకుండా బీఎడ్ పూర్తి చేసిన వారితో కలిపితే మొత్తం 50 వేల మందికిపైగా బీఎడ్ అభ్యర్థులుంటారని అంచనా. జిల్లాలోని 326 ఎస్‌ఏ ఖాళీల్లో గణితం-25, బయాలజీ-26, సోషల్- 79, ఇంగ్లిష్-15, తెలుగు-27, హిందీ-14, స్కూల్ అసిస్టెంట్ సంస్కృతం- 2, ఉర్దూ-1, ఫిజికల్ డెరైక్టర్-1, లాంగ్వేజ్ పండిట్ తెలుగు-83, ఉర్దూ -1, హిందీ -29, సంస్కృతం-5 ఉన్నాయి. ఇవి కాక స్పెషల్ పాఠశాలల్లో గణితం -1, ఇంగ్లిష్-1, ఫిజిక్స్-1, ఎల్‌పీ తెలుగు-1, ఎల్‌పీ హిందీ-1 ఖాళీలున్నాయి. మొత్తం మీద వీటికి 50 వేలమందికి పైగా అభ్యర్థులు పోటీపడుతుండడం గమనార్హం.
మంత్రి గారూ! వాటినీ కలపండి!
2000, 2008, 2012 డీఎస్సీలకు సంబంధించి మున్సిపల్ ఖాళీలను సైతం కలిపి నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఈసారి వాటిని పరిగణనలోకి తీసుకోకుండా నోటిఫికేషన్ జారీ పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు వెంటనే స్పందించి ఎప్పటిలానే మున్సిపల్ ఖాళీలను సైతం ప్రస్తుతం నోటిఫికేషన్‌లో పొందుపరిచాలని ఎస్‌టీయూ నాయకులు తోటకూర సాయిరామకృష్ణ, పీవీ సత్యనారాయణరాజు డిమాండ్ చేశారు. ఈ మున్సిపల్ ఖాళీలకు ప్రత్యేకంగానోటిఫికేషన్ జారీ చేస్తామనడం సమంజసం కాదన్నారు. సిలబస్‌కు సంబంధించి ఇంకా స్పష్టత ఇవ్వకపోవడాన్ని వారు తప్పబట్టారు. కేవలం జీఓను జారీచేసి సిలబస్, సబ్జెక్టుల వారీ మార్కుల వివరాలను వెల్లడించకపోవడం శోచనీయమన్నారు. వీటిపై పూర్తి స్పష్టతనిచ్చి అభ్యర్థుల్లో గందరగోళాన్ని తొలగించాలన్నారు.
‘గురువు’ల కొలువుకు నోటిఫికేషన్
Published Sat, Nov 22 2014 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM
Advertisement
Advertisement