డీఎస్సీ రోస్టర్ పాయింట్లు విడుదల
గుంటూరు ఎడ్యుకేషన్ డీఎస్సీ-2014 ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి పాఠశాలల్లో భర్తీ చేయనున్న పోస్టుల వారీగా రోస్టర్ పాయింట్లను విద్యాశాఖ విడుదల చేసింది. వచ్చే ఏడాది మేలో జరగనున్న టెట్ కం టీఆర్టీ రాత పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో 951 పోస్టులను భర్తీ చేయనుండగా, కేటగిరీల వారీగా రిజర్వేషన్ ఖరారు చేస్తూ విడుదల చేసిన జాబితాను ‘ఏపీ.డీఎస్‌సీ.సీజీజీ.ఇన్’ వెబ్‌సైట్‌తో పాటు ఏపీడీఎస్సీ-2014 పేరుతో ఉన్న సైట్‌లోనూ పొందుపర్చింది. గుంటూరులోని జిల్లా పరీక్షా భవన్‌లో ఏర్పాటుచేసిన డీఎస్సీ ప్రత్యేక విభాగం వద్ద అభ్యర్థుల ప్రయోజనార్ధం రోస్టర్ల పాయింట్లను నోటీస్ బోర్డులో ప్రదర్శనకు ఉంచారు.
తక్కువగానే దరఖాస్తులు.. డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైన వారం అయినా చాలా తక్కువ సంఖ్యలోనే దరఖాస్తులు అందాయి. ఆన్‌లైన్‌లో ప్రింటవుట్ తీసుకున్న దరఖాస్తుల్లో సోమవారానికి కేవలం 10 మంది అభ్యర్థులు మాత్రమే డీఎస్సీ విభాగంలో అందజేశారు. పూర్తిగా ఆన్‌లైన్ విధానం కావడం, దరఖాస్తుకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసేందుకు సరైన అవకాశం లేకపోవడంతో ఇప్పటివరకూ స్వల్ప సంఖ్యలోనే దరఖాస్తులు అందాయని తెలుస్తోంది. తాజాగా రోస్టర్ పాయింట్ల విడుదలతో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, భాషా పండిట్, పీఈటీ పోస్టుల వారీగా అభ్యర్థులు రిజర్వేషన్ అనుసరించి దరఖాస్తు చేసేందుకు ముందుకు వస్తారని తెలుస్తోంది.