DSC -2014
-
డీఎస్సీ అభ్యర్థులకు ఓటీపీలొచ్చేశాయ్
నేడు, రేపు ఆన్లైన్ ఆప్షన్లకు అవకాశం జూన్ 1న విజయవాడలో ప్రతిజ్ఞ 3 నుంచి 11 వరకు శిక్షణ చిత్తూరు(గిరింపేట): జిల్లాలో డీఎస్సీ-2014 ద్వారా ఎంపికైన టీచర్ల సెల్ఫోన్లకు వన్‌టైం పాస్‌వర్డు(ఓటీపీ)ని రాష్ట్ర విద్యాశాఖ ఆదివారం సంబంధిత అభ్యర్థుల సెల్ఫోన్లకు మెసేజ్ పంపింది. డీఎస్సీలో ఎంపికైన ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, భాషా పండితులు, పీఈటీల్లో 20మందికి ఓటీపీ అందకపోవడంతో వారు డీఈవో కార్యాలయాన్ని సంప్రదించారు. డీఈవో నాగేశ్వరరావు రాష్ట్ర విద్యాశాఖతో సంప్రదించి మధ్యాహ్నం 3 గంటలకు వారందరికీ ఓటీపిని అందజేశారు. జూన్ 1 లోపు అభ్యర్థులకు ఎంపిక స్థలాలను తెలియజేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాలను జారీచేశారు. ఆ ప్రకారం ఎంపికైన అభ్యర్థులు వెబ్‌కౌన్సెలింగ్ కోసం జిల్లాకు ప్రత్యేకంగా సర్వర్లను ఏర్పాటుచేసినట్లు విద్యాశాఖ సిబ్బంది వెల్లడిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో అభ్యర్థులు వెబ్‌కౌన్సెలింగ్ ద్వారా తమకు కావాల్సిన స్కూళ్లను కోరుకోవడానికి అవకాశం వుంటుంది. ఆ తర్వాత మే 30 లేదా జూన్ 1న వారికి కేటాయించిన పాఠ శాల పేరును రాష్ట్ర విద్యాశాఖ నేరుగా అభ్యర్థుల సెల్ఫోన్లకు మెసేజ్ ద్వారా అందజేస్తుంది. ఈ ఏడాది సరికొత్త విధానంతో ఆన్లైన్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు డీఈవో డిజిటల్ సంతకంతో కూడిన నియామక పత్రాలను అందివ్వనున్నారు. అనంతరం నూతనంగా బాధ్యతలను స్వీకరించనున్న టీచర్లకు జిల్లాలో జూన్ 3 నుంచి 11 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఎంపికైన నూతన టీచర్ పోస్టుల వివరాలు జిల్లాలో ఖాళీగా ఉన్న 1421 పోస్టుల్లో డీఎస్సీ-2014 ద్వారా 1,335 పోస్టులను భర్తీ చేయనున్నారు. అందు లో ఎస్జీటీ తెలుగు -945 ఖాళీలకు-938 మందిని, తమిళం-3 ఖాళీలకు 2, ఉర్దూ-75 ఖాళీలకు 29 మందిని, భాషా పండితులకు గాను తెలుగులో 65 ఖాళీలకు గాను 64 మందిని, హిందీలో 80కి 80 మందిని, ఉర్దూలో 20కి 10 మందిని, సంస్కృతంలో 1 ఖాళీకి ఒకరిని, స్కూల్ అసిస్టెంట్ గణిత ం తెలుగు మీడియంలో 58 ఖాళీలకు 58 మందిని, ఉర్దూలో 8 ఖాళీలకు ముగ్గురిని నియమిస్తున్నారు. తమిళంలో 2 ఖాళీలకు, ఫిజికల్ సైన్స్ ఉర్దూలో- 2 ఖాళీలకు, బయాలజికల్ సైన్స్‌లో-2 పోస్టులకు ఎవరినీ ఎంపిక చెయ్యలేదు, సోషల్స్టడీస్ తెలుగు మీడియంలో 95 ఖాళీలకు 95 మందిని, ఉర్ధూలో 5 మందికి ఒకరిని, తమిళంలో 2 ఖాళీలకు ఒకరిని, స్కూల్ అసిస్టెంట్ తెలుగులో 23 ఖాళీలకు 23 మందిని, హిందీలో 5 ఖాళీలకు 5 మందిని, ఇంగ్లీషులో 18 ఖాళీలకు 17 మందిని, తమిళంలో 1 ఖాళీకి ఒకరిని, పీఈటీ తెలుగు మీడియంలో 7 ఖాళీలకు ఏడుగురిని ఎంపికచేస్తున్నారు. ఉర్దూ మీడియంలో 4 ఖా ళీలండగా ఎవరినీ నియమించలేదు. మొత్తం 1,421 ఖాళీలకు 1,335 మంది టీచర్లను నియమించనున్నారు. విజయవాడలో ప్రతిజ్ఞ డీఎస్సీ-2014 ద్వారా ఎంపికై బాధ్యతలు స్వీకరించనున్న ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేయిస్తారు. జూన్ 1వ తేదీ సాయంత్రం 3 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి అంతా తప్పకుండా హాజరుకావాలి. అదేరోజు ఉదయం జిల్లా అభ్యర్థులు విజయవాడలో ఎంజీ రోడ్డులో ఉన్న చిల్డ్రన్ మాంటెస్సోరీ స్కూల్ వద్దకు వెళ్లి తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఒకటో తేదీలోపు అంద రూ ఆన్లైన్లో apdsc.cgg.gov.in వెబ్సైట్లో నియమాకపత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
ఈ నెల చివరిలో డీఎస్సీ కౌన్సెలింగ్
చిత్తూరు (గిరింపేట): డీఎస్సీ-2014లో ఎంపికైన స్కూల్ అసిస్టెంట్, పీఈటీల ఎంపిక జాబితాలను జిల్లా విద్యాశాఖ అధికారులు బుధవారం రాష్ట్ర విద్యాశాఖకు పంపారు. ఆ జాబితాను రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పరిశీలించి రోస్టర్ ప్రకారం ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికయ్యే వారి వివరాలను రాష్ట్ర విద్యాశాఖ నుంచి అభ్యర్థుల మొబైల్స్‌కే సందేశం అందుతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈనెల చివరిలోపు ఎంపికైన వారికి కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగులు, నియామకపత్రాలు ఇవ్వనున్నారు. విద్యాశాఖ సిబ్బంది డీఎస్సీలో ఎంపికైన వారి దరఖాస్తులను పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు. -
జిల్లాకు చేరిన డీఎస్సీ జాబితాలు
ఎస్ఎ, పండిట్, పీఈటీ జాబితాలు శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎట్టకేలకు డీఎస్సీ-2014 పాఠశాల సహాయకులు, పండిట్లు, పీఈటీల మెరిట్ జాబితాలు జిల్లాకు చేరాయి. ఇప్పటికే ఎస్జీటీ మెరిట్ జాబితాలు రాగా, మిగిలినవి అనివార్య కారణాలతో రావడంలో జాప్యం జరిగింది. దీంతో అభ్యర్థులు అందోళన చెందారు. ఈ పరిస్థితిలో జాబితాలు జిల్లాకు రావడంతో ఉపాధ్యాయుల నియామకాలు త్వరలో చేపట్టే అవకశాలున్నాయి. విద్యాశాఖ అధికారులు మెరిట్ జాబితా, ఖాళీలతో కూడిన వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. -
డీఎస్సీ పేపర్ లీక్!
శ్రీకాకుళంలో అడ్డంగా దొరికిన అభ్యర్థి హైదరాబాద్/శ్రీకాకుళం: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ-2014 పరీక్షల చివరిరోజు ప్రశ్నపత్రం లీకైనట్టు సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలో శ్రీకాకుళం జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రంలో ఒక అభ్యర్థిని వద్ద దొరికిన స్లిప్పులు ఈ అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి. ఆమె వద్ద ఉన్న జవాబుల స్లిప్పుపై ‘ఏ’ కోడ్ అని రాసి ఉండడం, ఆమెకు వచ్చిన ప్రశ్న పత్రం కూడా ఆ కోడ్దే కావడం అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అధికారులు మాత్రం ప్రశ్నపత్రం లీకయ్యే అవకాశమే లేదని కొట్టిపారేస్తున్నారు. బయటపడింది ఇలా.. శ్రీకాకుళంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో అభ్యర్థిని వి. రజితసంపతిరావు(హాల్‌టికెట్ నంబర్ 14105100100029) పరీక్ష రాస్తోంది. తొలి 20 నిమిషాల పాటు జవాబులూ రాయని ఆమె.. టాయిలెట్‌కు వెళ్లి వచ్చాక రాయడం ప్రారంభించింది. గమనించిన చుట్టుపక్కల అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో కలెక్టర్ లక్ష్మీనరసింహం హుటాహుటిన కేంద్రానికి చేరుకున్నారు. అభ్యర్థిని మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన విషయాన్ని గుర్తించి కేంద్రం నుంచి బయటకు పంపారు. విచారణకు కమిటీ: అభ్యర్థిని మాల్‌ప్రాక్టీస్ వ్యవహారంపై రీజనల్ జాయింట్ డైరక్టర్, రెవెన్యూ అధికారి, శ్రీకాకుళం డీఈవోల ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె. సంధ్యారాణి ‘సాక్షి’కి తెలిపారు. మంగళవారం ఉదయమే ఈ కమిటీ విచారించి నివేదిక అందిస్తుందని, నివేదికను అనుసరించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు :‘శ్రీకాకుళం’ మాల్‌ప్రాక్టీస్ ఉదంతంపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
డీఎస్సీ రోస్టర్ పాయింట్లు విడుదల
గుంటూరు ఎడ్యుకేషన్ డీఎస్సీ-2014 ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి పాఠశాలల్లో భర్తీ చేయనున్న పోస్టుల వారీగా రోస్టర్ పాయింట్లను విద్యాశాఖ విడుదల చేసింది. వచ్చే ఏడాది మేలో జరగనున్న టెట్ కం టీఆర్టీ రాత పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో 951 పోస్టులను భర్తీ చేయనుండగా, కేటగిరీల వారీగా రిజర్వేషన్ ఖరారు చేస్తూ విడుదల చేసిన జాబితాను ‘ఏపీ.డీఎస్సీ.సీజీజీ.ఇన్’ వెబ్‌సైట్‌తో పాటు ఏపీడీఎస్సీ-2014 పేరుతో ఉన్న సైట్లోనూ పొందుపర్చింది. గుంటూరులోని జిల్లా పరీక్షా భవన్లో ఏర్పాటుచేసిన డీఎస్సీ ప్రత్యేక విభాగం వద్ద అభ్యర్థుల ప్రయోజనార్ధం రోస్టర్ల పాయింట్లను నోటీస్ బోర్డులో ప్రదర్శనకు ఉంచారు. తక్కువగానే దరఖాస్తులు.. డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైన వారం అయినా చాలా తక్కువ సంఖ్యలోనే దరఖాస్తులు అందాయి. ఆన్లైన్లో ప్రింటవుట్ తీసుకున్న దరఖాస్తుల్లో సోమవారానికి కేవలం 10 మంది అభ్యర్థులు మాత్రమే డీఎస్సీ విభాగంలో అందజేశారు. పూర్తిగా ఆన్లైన్ విధానం కావడం, దరఖాస్తుకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసేందుకు సరైన అవకాశం లేకపోవడంతో ఇప్పటివరకూ స్వల్ప సంఖ్యలోనే దరఖాస్తులు అందాయని తెలుస్తోంది. తాజాగా రోస్టర్ పాయింట్ల విడుదలతో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, భాషా పండిట్, పీఈటీ పోస్టుల వారీగా అభ్యర్థులు రిజర్వేషన్ అనుసరించి దరఖాస్తు చేసేందుకు ముందుకు వస్తారని తెలుస్తోంది. -
డీఎస్సీ-2014కు 718 పోస్టులు
ఒంగోలు వన్‌టౌన్: జిల్లాలో టెట్ కమ్ టీఆర్టీ -2014 (డీఎస్సీ-2014)కు మొత్తం 718 టీచరు పోస్టులు ప్రకటించారు. వీటిలో ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో 688 పోస్టులు, మున్సిపల్ యాజమాన్యాల్లోని పాఠశాలలకు 30 పోస్టులు ప్రకటించారు. స్కూలు అసిస్టెంట్ ఫిజికల్ సైన్సు, ఇంగ్లిష్, భాషా పండితులు గ్రేడ్-2 తెలుగు సబ్జెక్టుల్లో ప్రభుత్వ, జిల్లాపరిషత్ పాఠశాలలకు ఒక్క పోస్టు కూడా డీఎస్సీలో ప్రకటించలేదు. ప్రభుత్వ, జిల్లా పరిషత్ యాజమాన్యాల్లోని పాఠశాలలకు కేటాయించిన 688 పోస్టులకు సంబంధించి మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో ఏ రిజర్వేషన్ వర్గానికి ఎన్ని పోస్టులు వచ్చేది కూడా ప్రభుత్వం ప్రకటించింది. గత డీఎస్సీలో ఆగిపోయిన రోస్టర్ పాయింట్ నుంచి కొత్త రిజర్వేషన్లు కేటాయించారు. జిల్లాలో రిజర్వేషన్ కేటగిరీ వారీగా, పోస్టుల వారీగా ఎవరికి ఎన్ని పోస్టులు కేటాయించిందీ ఈ దిగువ ఇస్తున్నాం. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు మొత్తం 571 ఓసీ జనరల్ 167, ఓసీ మహిళ 90, బీసీ ఏ జనరల్ 28, బీసీ ఏ మహిళ 12, బీసీ బీ జనరల్ 34, బీసీ బీ మహిళ 24, బీసీ సీ జనరల్ 4, బీసీ సీ మహిళ 1, బీసీ డీ జనరల్ 29, బీసీ డీ మహిళ 11, బీసీ ఈ జనరల్ 18, బీసీ ఈ మహిళ 5, ఎస్సీ జనరల్ 57, ఎస్సీ మహిళ 28, ఎస్టీ జనరల్ 22, ఎస్టీ మహిళ 12, వీహెచ్ జనరల్ 4, వీహెచ్ మహిళ 2, హెచ్ఐ జనరల్ 3, హెచ్ఐ మహిళ 3, ఓహెచ్ జనరల్ 4, ఓహెచ్ మహిళ 2, ఎక్స్ సర్వీస్‌మెన్ జనరల్ 10 పోస్టులు కేటాయించారు. సెకండరీ గ్రేడ్ టీచర్లు ఉర్దూ మొత్తం 8 ఓసీ జనరల్ 2, ఓసీ మహిళ 2, బీసీ ఏ జనరల్ 1, బీసీ బీ మహిళ 1, ఎస్సీ జనరల్ 1, ఓహెచ్ జనరల్ 1 పోస్టును కేటాయించారు. స్కూలు అసిస్టెంట్ గణితం మొత్తం 14 ఓసీ జనరల్ 4, ఓసీ మహిళ 2, బీసీ ఏ మహిళ 2, బీసీబీ జనరల్ 1, బీసీబీ మహిళ 1, ఎస్సీ జనరల్ 2, ఎస్సీ మహిళ 1, ఎస్టీ మహిళ 1, వీహెచ్ జనరల్ 1 పోస్టు కేటాయించారు. స్కూలు అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ మొత్తం 14 ఓసీ జనరల్ 4, ఓసీ మహిళ 3, బీసీ ఏ జనరల్ 1, బీసీ బీ జనరల్ 1, బీసీ బీ మహిళ 1, ఎస్సీ జనరల్ 2, ఎస్టీ జనరల్ 2 పోస్టులు కేటాయించారు. స్కూలు అసిస్టెంట్ సోషల్ స్టడీస్ మొత్తం 43 ఓసీ జనరల్ 13, ఓసీ మహిళ 6, బీసీ ఏ జనరల్ 3, బీసీ ఏ మహిళ 1, బీసీ బీ జనరల్ 2, బీసీ బీ మహిళ 1, బీసీ డీ జనరల్ 3, బీసీ డీ మహిళ 1, బీసీ ఈ జనరల్ 1, ఎస్సీ జనరల్ 5, ఎస్సీ మహిళ 2, ఎస్టీ జనరల్ 1, ఎస్టీ మహిళ 1, హెచ్ఐ జనరల్ 1, ఓహెచ్ మహిళ 1 పోస్టులు కేటాయించారు. స్కూలు అసిస్టెంట్ తెలుగు ఒక పోస్టు ఉండగా..దీన్ని బీసీ డీ మహిళకు కేటాయించారు. స్కూలు అసిస్టెంట్ ఉర్దూ ఒక పోస్టు ఉండగా..దాన్ని ఓసీ మహిళకు కేటాయించారు. -స్కూలు అసిస్టెంట్ హిందీ మొత్తం 6 ఓసీ జనరల్ 2, బీసీ ఏ జనరల్ 1, బీసీ బీ జనరల్ 1, ఎస్సీ జనరల్ 1, ఎస్టీ జనరల్ 1 పోస్టులు కేటాయించారు. వ్యాయామోపాధ్యాయులు మొత్తం 17 ఓసీ జనరల్ 6, ఓసీ మహిళ 3, బీసీ ఏ మహిళ 1, బీసీ బీ జనరల్ 1, బీసీ డీ జనరల్ 2, బీసీ ఈ జనరల్ 1, ఎస్సీ జనరల్ 1, ఎస్టీ జనరల్ 1, ఎక్స్‌సర్వీస్‌మెన్ జనరల్ 1 పోస్టును కేటాయించారు. భాషా పండితులు గ్రేడ్-2 ఉర్దూ పోస్టు 1 ఉండగా..దాన్ని వీహెచ్ మహిళకు కేటాయించారు. భాషా పండితులు గ్రేడ్-2 హిందీ మొత్తం 12 - ఓసి జనరల్ 2, ఓసీ మహిళ 2, బీసీఎ జనరల్ 2, బీసీబీ జనరల్ 1, బీసీడీ జనరల్ 1, బీసీఈ జనరల్ 1, ఎస్సీ జనరల్ 2, ఎస్టీ జనరల్ 1 పోస్టులు కేటాయించారు. మున్సిపల్ పాఠశాలలకు 30 పోస్టులు: జిల్లాలోని ఒంగోలు, చీరాల, మార్కాపురం, కందుకూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలకు మొత్తం 30 పోస్టులు కేటాయించారు. వీటిలో సెకండరీ గ్రేడ్ టీచర్లు 18, స్కూలు అసిస్టెంట్లు 6, భాషా పండితులు 5, పీఈటీ 1 పోస్టులను కేటాయించారు. స్కూలు అసిస్టెంట్లు మొత్తం 6 గణితం 1, బయోలాజికల్ సైన్సు 2, సోషల్ స్టడీస్ 1, హిందీ 1, సంస్కృతం 1 పోస్టును ప్రకటించారు. భాషా పండితులు గ్రేడ్-2 మొత్తం 5 పోస్టుల్లో తెలుగు 2, హిందీ 2, సంస్కృతం 1 పోస్టులు కేటాయించారు. -
8 నుంచి డీఎస్సీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
విశాఖ రూరల్ : డీఎస్సీ-2014 ఉపాధ్యాయ నియామకానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను ఈ నెల 8 నుంచి జనవరి 31వ తేదీ చేపడుతున్నట్టు జిల్లా విద్యా శాఖాధికారి ఎం.వి.కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అర్బన్ తహశీల్దార్ కార్యాలయం వెనుక ఉన్న నెహ్రూ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ఇందుకోసం ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సమర్పించిన దరఖాస్తుతో పాటు అందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలన నిమిత్తం అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో వ్యక్తిగతంగా హాజరై నకలు కాపీలను దరఖాస్తుతో సమర్పించాలని సూచించారు. ఈ నెల 8 నుంచి జనవరి 31వ తేదీ వరకు ఆ దరఖాస్తులను అన్ని పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు స్వీకరిస్తారని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలకు, ఇతర సమాచారం కోసం ఠీఠీఠీ.్చఞఛీటఛి.ఛిజజ.జౌఠి.జీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. -
డీఎస్సీ దరఖాస్తులు తొలిరోజు నిల్
మచిలీపట్నం : డీఎస్సీ-2014 దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్లో బుధవారం నుంచి ప్రారంభమైంది. ఆన్లైన్లో దరఖాస్తులు పూర్తి చేసిన అభ్యర్థులు ప్రింట్అవుట్ తీసుకుని డీఈవో కార్యాలయంలో సమర్పించాల్సి ఉంది. దరఖాస్తులు స్వీకరించేందుకు డీఈవో కార్యాలయంలో గురువారం నుంచి ప్రత్యేక సెల్ పూర్తిస్థాయిలో పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. బుధవారం ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తులు చేసినా ఒక్క దరఖాస్తును కూడా డీఈవో కార్యాలయంలో సమర్పించలేదు. ఈ నెల 17వ తేదీ వరకు ఆన్లైన్లో డీఎస్సీ-2014 దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. ఈ నెల 17వ తేదీ లోపు అభ్యర్థులు తమ దరఖాస్తులను డీఈవో కార్యాలయంలో సమర్పించాల్సి ఉంది. డీఈవో కార్యాలయ అధికారులు వీటిని ఆథరైజేషన్ చేసి ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి పంపుతారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తును పూర్తి చేసిన అనంతరం దాని ప్రింట్ అవుట్‌ను స్వయంగా గానీ లేదా పోస్టు ద్వారా డీఈవో కార్యాలయానికి పంపే అవకాశం ఉంది. -
పాత ప్రతిపాదనలకు కొత్త రూపం
డీఎస్సీ-2014 పోస్టుల మంజూరులో లోపించిన పారదర్శకత ఉన్నత పాఠశాలలను వేధిస్తున్న స్కూల్ అసిస్టెంట్ల కొరత జిల్లాలో భర్తీ చేయనున్న పోస్టుల్లో ఎస్జీటీ పోస్టులే అధికం 8వ తరగతికి అప్ గ్రేడ్ చేసిన యూపీ స్కూళ్లకు పోస్టులు శూన్యం గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలకు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన డీఎస్సీ-2014 ప్రక్రియ పాత ప్రతిపాదనలకు కొత్త రూపం కల్పించినట్లు ఉంది. రాష్ట్రస్థాయిలో భర్తీ చేసేందుకు నిర్ణయించిన 9061 పోస్టుల్లో జిల్లాకు 907 పోస్టులు ఉన్న విషయం తెలిసిందే. గత సెప్టెంబర్ 5వ తేదీకి ముందుగానే జిల్లా విద్యాశాఖ నుంచి వెళ్లిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని ఆయా పోస్టులను ప్రభుత్వం ఖరారు చేసింది. డీఎస్సీ స్థానంలో ప్రవేశపెట్టిన టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ కం టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టెట్ కం టీఆర్టీ) నోటిఫికేషన్లో మూడు నెలల క్రితం ఖాళీల ఆధారంగా గుర్తించిన పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. జిల్లాలో భర్తీ చేయనున్న 907 పోస్టుల్లో ఎస్జీటీ పోస్టులు 682 ఉన్నాయి. మిగిలిన వాటిలో 159 స్కూల్ అసిస్టెంట్స్, 43 భాషా పండిట్, 23 పీఈటీ పోస్టులున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో విద్యాబోధనకు అనుగుణంగా ఎస్జీటీ పోస్టులను ప్రకటించినప్పటికీ ఉన్నత పాఠశాలల్లో విద్యాబోధనకు అవసరమైన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు నామ మాత్రంగా మంజూరయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 340 ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్, హిందీ పాఠ్యాంశాల బోధనకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేరు. విద్యాహక్కు చట్టం అమలు ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 240 ప్రాథమికోన్నత పాఠశాలలను 8వ తరగతికి అప్‌గ్రేడ్ చేసిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేయాల్సిన బాధ్యతను విస్మరించింది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతిని చేర్చిన ప్రభుత్వం పాఠ్యాంశాలను బోధించు ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహించింది. టెన్త పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు అన్ని సబ్జెక్టులను బోధించేందుకు ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో లేరనే విషయం జిల్లా విద్యాశాఖ లెక్కలే చెబుతున్నాయి. గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్చడం వలన తలెత్తే ఇబ్బందులను గమనిస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. రెండు నెలల కాలంలో జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకూ విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయి. 10వ తరగతి పరీక్షలకే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి దాదాపు 30 వేల మంది హాజరవుతుండటమే ఇందుకు నిదర్శనం. ఇవేవీ పట్టించుకోకుండా నాలుగు నెలల క్రితం సిద్ధం చేసిన ఖాళీల జాబితానే ప్రభుత్వం టెట్ కం టీఆర్టీ నోటిఫికేషన్లో పొందు పర్చింది. డిసెంబర్ 3వ తేదీన దరఖాస్తుల స్వీకరణతో మొదలు కానున్న ఉపాధ్యాయ నియామక ప్రక్రియ వచ్చే ఏడాది మే 28న వెలువడే ఫలితాల విడుదల వరకూ కొనసాగనుంది. ఈ క్రమంలో ప్రస్తుతం మంజూరు చేసిన పోస్టులు ద్వారా కొత్త ఉపాధ్యాయులు జూన్ నెలలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరిస్తారు. తదుపరి వచ్చే రెండేళ్ల వ్యవధిలో ప్రభుత్వం మళ్లీ ఉపాధ్యాయ నియామకాలు చేపట్టే అవకాశం లేదు. ఫలితంగా ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగానే కొనసాగే పరిస్థితులు కనిస్తున్నాయి. -
ఆనందం.. ఆందోళన
డీఎస్సీ-2104కు గ్రీన్సిగ్నల్పై నిరుద్యోగుల్లో భిన్నస్వరం జీఓ విడుదల చేసిన ప్రభుత్వం నేడు, రేపో జిల్లాకు ఖాళీల జాబితా అనంతపురం ఎడ్యుకేషన్ : డీఎస్సీ-2014 నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో నిరుద్యోగుల్లో ఓ వైపు ఆనందం, మరోవైపు ఆందోళన నెలకొంది. కేటగిరీ వారీగాఎన్నెన్ని ఖాళీలు ఉంటాయనే అంశంపై సందిగ్ధత నెలకొంది. డీఎస్సీ నోటిఫికేషన్ అదిగో.. ఇదిగో అంటూ ఏడాదిగా ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వం ఎట్టకేలకు గురువారం జీఓ 38 విడుదల చేసింది. జీవోలో విధివిధానాలకు సంబంధించిన అంశాలు తప్ప షెడ్యూలు వెల్లడించలేదు. ఏయే కేటగిరిలో ఎన్నెన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయనే సమాచారం, డీఎస్సీ పరీక్ష నిర్వహణ షెడ్యూలు రాష్ట్ర అధికారులు ఈరోజో...రేపో జిల్లాలకు పంపనున్నారు. అయితే ఇన్ని రోజులూ నిర్వహిస్తూ వచ్చిన డీఎస్సీని టీచర్ ఎలిజబులిటీ టెస్ట్ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టెట్ కమ్ టీఆర్టీ)గా మార్పు చేస్తూ జీఓలో పేర్కొన్నారు. దీనికితో 33 ఏళ్ల వయో పరిమితిని 40 ఏళ్లకు పెంచారు. ఇది నిరుద్యోగ అభ్యర్థులకు ఊరట కల్పించే అంశమైనా ఆశించిన పోస్టులు లేకపోవడం వారిని కలవరపెడుతోంది. కోర్సులు చేసి వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ కోచింగ్ తీసుకుంటున్నారు. అయితే పోస్టులు అంతంత మాత్రంగానే ఉంటుండటంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లవుతోంది. బీఈడీ అభ్యర్థులకు నిరాశ డీఎస్సీ-14 బీఈడీ అభ్యర్థులకు నిరాశ మిగల్చనుందనడంలో సందేహం లేదు. అన్ని సబ్జెక్టులకు కలిపి 57 మాత్రమే ఖాళీలు ఉన్నాయి. ఎస్జీటీ 1083, పీఈటీలు 15, లాంగ్వేజ్ పండిట్లు 106 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలనే జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీ, పండింట్లు అన్ని కేటగిరీలకు 1251 ఖాళీలు ఉన్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ఈ ఖాళీలనే చూపిస్తూ నివేదించారు. ఇక మునిసిపల్ పాఠశాలల ఖాళీలను ప్రస్తుత నోటిఫికేషన్లో చేర్చాలా...వద్దా అనేదానిపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మునిసిపల్ పోస్టుల చేరిక ఆధారపడి ఉంది. ప్రస్తుతం ఖాళీలుగా చూపించిన (1251)వాటిలో పెద్దగా మార్పులు జరగకపోవచ్చని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, ఎస్జీటీ పోస్టులు కొంతమేరకు తగ్గవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
తేనెసోకనోరు తీయనగురీతిలో...!
కవులూ - కావ్యాలు ఈ అధ్యాయంలో కవులూ - రచయితలూ - కావ్యాలూ - రచనలు - పాత్రలు - నేపథ్యం - పూర్వాపరాలు- ఇతివృత్తాలు- సందర్భ వాక్యాలూ, విశేషాంశాలు వంటి అంశాలు చాలా ముఖ్యమైనవి. గత డీఎస్సీలో పై అంశాల నుంచి 11 ప్రశ్నలు అడిగారు. శివకవి యుగం ఎంతో ముఖ్యమైంది. ‘పాల్కూరికి సోమన’పై నాలుగు ప్రశ్నలు అడిగారు. 1. కన్నడంలో జైన పురాణ శిల్ప ప్రభావంతో వెలసిన తెలుగు దేశీయ పురాణం? 1) మత్స్యపురాణం 2) మార్కండేయ పురాణం 3) బసవ పురాణం 4) వరాహ పురాణం సమాధానం: 3 2. సంస్కృతం, తెలుగులో ఉదాహరణ కావ్యాన్ని రచించిన మొదటి తెలుగు కవి? 1) పాల్కూరికి సోమన 2) పింగళి సూరన 3) పిడపర్తి సోమన 4) నాచన సోమన సమాధానం: 1 3. మకుటాన్నీ, సంఖ్యా నియమాన్ని పాటించిన మొదటి తెలుగు శతకం? 1) కాళహస్తీశ్వర శతకం 2) భాస్కర శతకం 3) శివతత్త్వసారం 4) వృషాధిపశతకం సమాధానం: 4 4. ‘అంగిట ముల్లొత్తు’ అనే ప్రయోగ సందర్భం? 1) పరమేశుని స్నానం చేయించే సందర్భం 2) పరమేశుని ఆటలాడించే సందర్భం 3) పరమేశుని నిద్ర పుచ్చే సందర్భం 4) దేవుడికి అన్నం తినిపించే సందర్భం సమాధానం: 1 వివరణ: ఈ సందర్భం బసవపురాణంలో బెజ్జమహాదేవి కథలోనిది. కవిత్రయం కవులకు సంబంధించి ఒకటి లేదా రెండు ప్రశ్నలు అడగవచ్చు. గత డీఎస్సీలో తిక్కన గురించి రెండు ప్రశ్నలు ఇచ్చారు. 5. రసాభ్యుచిత బంధానికి ఏ కవి పెట్టింది పేరు? 1) ఎర్రన 2) పోతన 3) నన్నయ 4) తిక్కన సమాధానం: 4 కవిత్రయం కవితాగుణాలపై సమగ్ర అవగాహన ఉండాలి. 6. తిక్కన భారతంలో ‘చివరి పర్వం’? 1) మహాప్రస్థాన పర్వం 2) మౌసల పర్వం 3) స్వర్గారోహణ పర్వం 4) అశ్వమేథ పర్వం సమాధానం: 3 భారతంలో పర్వాలు, రామాయణంలో కాండలు, భాగవతంలో స్కంధాలను వరస క్రమంలో గుర్తుంచుకోవాలి. శ్రీనాథుడిపై ప్రశ్న అడిగే అవకాశం ఉంది. గత డీఎస్సీలో అడిగిన ప్రశ్న: 7. ‘కాళీనందనకంఠేకాలుర శిరములకు విరులు కల్పించునొకో?’ ఇది ఎవరు ఎవరితో అన్నారు? 1) అగస్త్యుడు వ్యాసునితో 2) వ్యాసుడు అగస్త్యునితో 3) అగస్త్యుడు లోపాముద్రతో 4) వ్యాసుడు భీమేశ్వరునితో సమాధానం: 1 }నాథుడి కావ్యాల్లో పాత్రలు, సన్నివేశాలపై అవగాహన ఉండాలి. {పబంధ యుగం నుంచి ఒకటి లేదా రెండు ప్రశ్నలను అడిగే అవకాశం ఉంది. గత డీఎస్సీలో 3 ప్రశ్నలు ఇచ్చారు. వాటిలో అల్లసాని పెద్దనకు సంబంధించి రెండు ప్రశ్నలున్నాయి. 8. ‘శిరీష కుసుమ పేశల సుధామయోక్తులతో’ కవిత చెప్పినవారు? 1) తెనాలి రామకృష్ణుడు 2) మాదయగారి మల్లన 3) అల్లసాని పెద్దన 4) నంది తిమ్మన సమాధానం: 3 {పబంధ కవుల కవితా శైలి, రీతులపై అవగాహన ఉండాలి 9. {పవరుని పాత్ర ద్వారా తెలిసే అంశం? 1) ప్రవరుడు స్త్రీ ద్వేషి 2) ప్రవరుడు ఉత్తమ సంభాషణాశీలి 3) ప్రవరుడు ఉత్తమ గృహస్థుడు 4) ప్రవరుడు ఉత్తమ తైర్థికుడు సమాధానం: 3 {పబంధ కవుల పాత్రలపై సమగ్రమైన అవగాహన అవసరం 10. ‘చోళలింగపురం’ - స్థల పురాణాన్ని వర్ణించే కావ్యం? 1) ఘటికాచల మహాత్మ్యం 2) పల్నాటి వీరచరిత్ర 3) పాండురంగ మహాత్మ్యం 4) ఉద్భటారాధ్య చరిత్ర సమాధానం: 1 {పబంధాల్లో కావ్యాల్లో ఇతివృత్తాలను తెలుసుకోవటం అవసరం. పదకవులపై కూడా ప్రశ్నలు వస్తాయి. 11. ‘కన్నడ దాస పదావళి’ వంటివి తెలుగులో? 1) ఉదాహరణ 2) దండకం 3) అన్నమయ్య పదకవితలు 4) వేంకటేశ్వర వచనములు సమాధానం: 3 దక్షిణాంధ్ర యుగంలో రఘునాథ నాయకుడు, విజయ రాఘవ నాయకుడు, చేమకూర వెంకటకవి, రంగాజమ్మ, ముద్దు పళని వంటి వారిపై ప్రశ్నలు రావచ్చు. మాదిరి ప్రశ్నలు 1. నన్నయను భారతాంధ్రీకరణకు ప్రేరేపిం చిన రాజు? 1) మనుమసిద్ది 2) రాజరాజ నరేంద్రుడు 3) ప్రోలయ వేమారెడ్డి 4) పెదకోమటి వేమారెడ్డి 2. నన్నయ ఆంధ్ర మహాభారత రచనా కాలం? 1) క్రీ.శ. 1022-30 2) క్రీ.శ. 1050-60 3) క్రీ.శ. 1054-61 4) క్రీ.శ. 1040-50 3. నన్నయకు భారతాంధ్రీకరణలో సహకరిం చిన లేఖకుడు? 1) నారాయణ భట్టు 2) బేతన భట్టు 3) గణపతి 4) గురునాథుడు 4. నన్నయ భారతావతారక ఏ పురుషలో ఉంది? 1) ఉత్తమ 2) ప్రథమ 3) మధ్యమ 4) అన్య 5. నన్నయను వాగానుశాసనుడిగా ప్రశంసించిన కవి? 1) మారన 2) తిక్కన 3) ఎర్రన 4) రామరాజ భూషణుడు 6. {Oతెలోక్యమల్ల దేవర రాయబారాన్ని నిర్వహించిన కవి ఎవరు? 1) వేములవాడ భీమన 2) నన్నయ 3) తిక్కన 4) ఎర్రన 7. ‘సూనృత వాక్యము మేలు సూడగన్’ - ఏ ఉపాఖ్యానంలోనిది? 1) ఉదంక 2) నల 3) శకుంతల 4) సౌపర్ణ 8. మందపాలుని భార్య? 1) జరిత 2) కద్రువ 3) వినత 4) సావిత్రి 9. గరుత్మంతుని తల్లి? 1) కద్రువ 2) వినత 3) కుంతీ 4) గాంధారి 10. ‘అవ్విభునకు గట్టెద పట్టమ ప్రతిభ కావ్య కవిత్వ మహావిభూతికిన్’ - అనే తిక్కన వాక్యంలో ‘అవ్విభుండు’? 1) హరిహరనాథుడు 2) కొమ్మన దండనాథుడు 3) మనుమసిద్ధి 4) మంత్రి భాస్కరుడు 11. తిక్కనకు ‘ఉభయకవి మిత్రుడు అనే బిరుదు ప్రకటించిన కవి? 1) మారన 2) మంచన 3) బయ్యన 4) కేతన 12. కింది వాటిలో తిక్కన కవితా గుణాలు? 1) వర్ణనాశిల్పం - పాత్ర చిత్రణ 2) నాటకీయత - వ్యంగ్య వైభవం 3) అక్షర రమ్యత - ప్రసన్న కథనం 4) సూక్తి వైచిత్రి - అలంకారిక ప్రీతి 13. సరసిజనాభ! యిన్నిట ప్రశస్తికి నెక్కిన దాన నెంతయున్ - అని పలికిన పాత్ర? 1) ద్రౌపది 2) సుభద్ర 3) సత్యభామ 4) కుంతీ 14. ఆంధ్ర మహా భారతంలో ‘గీతోపదేశం’ ఉన్న పర్వం? 1) ద్రోణ పర్వం 2) భీష్మ పర్వం 3) కర్ణ పర్వం 4) అరణ్య పర్వం 15. {పథమాంధ్ర పురాణం? 1) విష్ణు పురాణం 2) బసవ పురాణం 3) మార్కండేయ పురాణం 4) గరుడ పురాణం 16. మార్కండేయ పురాణ కృతిపతి? 1) తిక్కన 2) కేతన 3) మంచన 4) నాగయగన్న మంత్రి 17. కేయూర బాహు చరిత్రకు మూలం? 1) విద్ధసాలభంజిక 2) నిర్వచనోత్తర రామాయణం 3) దశకుమార చరిత్ర 4) భోజ రాజీయం 18. ‘మృగాంకావళి’ ఏ కావ్యంలో నాయిక? 1) దశకుమార చరిత్ర 2) మనుచరిత్ర 3) కేయూర బాహు చరిత్ర 4) శృంగార నైషధం 19. తెలుగులో ‘వస్తుకవిత’ పదాన్ని తొలిసా రిగా ప్రయోగించిన కవి? 1) నన్నయ 2) నన్నెచోడుడు 3) పాల్కూరికి సోమనాథుడు 4) తిక్కన 20. తెలుగులో తొలి ఉదాహరణ కావ్యం? 1) గోపాలోదాహరణం 2) నాగేశ్వరోదాహరణం 3) బసవోదాహరణం 4) పరమేశ్వరోదాహరణం 21. కన్నడ జైన పురాణ శిల్ప ప్రభావంతో తెలుగులో వచ్చిన దేశీయ పురాణం? 1) మార్కండేయ పురాణం 2) బసవ పురాణం 3) వరాహ పురాణం 4) మత్స్యపురాణం 22. ‘సంవిధాన చక్రవర్తి’ బిరుదున్న కవి? 1) పాల్కూరికి సోమన 2) శ్రీనాథుడు 3) నాచన సోమన 4) అల్లసాని పెద్దన 23. తెలుగులో తొలి క్షేత్ర మాహాత్మ్య గ్రంథం? 1) కాశీఖండం 2) నృసింహపురాణం 3) భీమేశ్వర పురాణం 4) ఘటికాచల మహాత్మ్యం 24. కాశీక్షేత్ర మహిమను తెలిపే తెనాలి రామకృష్ణుని గ్రంథం? 1) ఉద్భటారాధ్య చరిత్ర 2) పాండురంగ మహాత్మ్యం 3) హరిలీలావిలాసం 4) ఘటికాచల మహాత్మ్యం 25. శృంగార నైషధ కృతిపతి? 1) బెండపూడి అన్నయ మంత్రి 2) మామిడి సింగన 3) అవచితిప్పయ్య శెట్టి 4) సింగభూపాలుడు 26. కింది వాటిలో హంస దౌత్యం ఉన్న కావ్యం? 1) హర విలాసం 2) వసు చరిత్ర 3) శృంగార నైషధం 4) కళాపూర్ణోదయం 27. కింది వాటిలో వీరగాథా కావ్యం? 1) బాలనాగమ్మ కథ 2) పండితారాధ్య చరిత్ర 3) పలనాటి వీర చరిత్ర 4) క్రీడాభిరామం 28. ‘పరమేశ! గంగ విడువుము పార్వతి చాలున్’ అని పలికిన చాటు కవి? 1) పోతన 2) శ్రీనాథుడు 3) పెద్దన 4) తెనాలి రామకృష్ణుడు 29. డిండిమభట్టు అసలు పేరు? 1) భీమకవి 2) ఉద్ధండకవి 3) వజ్రనాభకవి 4) అరుణగిరినాథుడు 30. ‘తేనెసోకనోరు తీయనగురీతి’లో పద్యరచన ఉండాలన్న కవయిత్రి? 1) తిమ్మక్క 2) మొల్ల 3) మధురవాణి 4) రంగాజమ్మ 31. ‘కీర్తింతురేద్దాని గంధర్వులు గాంధర్వమున యక్షగాన సరణి’ - ఏ కావ్యంలోది? 1) క్రీడాభిరామం 2) పల్నాటి వీరచరిత్ర 3) భీమేశ్వర పురాణం 4) కాశీఖండం 32. ‘వాణి నా రాణి’ అని సగర్వంగా పలికిన కవి? 1) శ్రీనాథుడు 2) పోతన 3) నాచన సోమన 4) పిల్లలమర్రి పిన వీరభద్రుడు 33. తెలుగు సాహిత్యంలో తొలి జంట కవులు? 1) తిరుపతి వెంకటకవులు 2) కొప్పరపు కవులు 3) నందిమల్లయ ఘంటసింగనలు 4) వెంకట పార్వతీశ్వర కవులు 34. కుమార భారతి బిరుదున్న కవి? 1) మంచన 2) మారన 3) నందితిమ్మన 4) తెనాలి రామకృష్ణుడు 35. ‘చందమామ రావే! జాబిల్లి రావే’! గేయ రచయిత? 1) త్యాగయ్య 2) అన్నమయ్య 3) క్షేత్రయ్య 4) కంచర్ల గోపన్న 36. భవ్య భారతి బిరుదున్న కవి? 1) బయ్యన 2) జక్కన 3) మారన 4) కేతన 37. నాసికేతోపాఖ్యాన గ్రంథకర్త? 1) ముక్కుతిమ్మన 2) దగ్గుపల్లి దుగ్గన 3) గౌరన 4) కేతన 38. ‘పదకవితా పితామహుడు’ బిరుదున్న కవి? 1) క్షేత్రయ్య 2) త్యాగయ్య 3) అన్నమయ్య 4) పురంధరదాసు 39. తెలుగులో ‘కొక్కోక శాస్త్ర’ పద్య గ్రంథకర్త? 1) శ్రీనాథుడు 2) మడికి సింగన 3) కూచిరాజు ఎర్రన 4) పోతన 40. కుమారగిరి రెడ్డి రాసిన ‘వసంత రాజీయం’ అనే గ్రంథం? 1) సంగీత శాస్త్రం 2) నాట్య శాస్త్రం 3) అలంకార శాస్త్రం 4) శిల్ప శాస్త్రం సమాధానాలు 1) 2; 2) 3; 3) 1; 4) 2; 5) 4; 6) 2; 7) 3; 8) 1; 9) 2; 10) 3; 11) 4; 12) 2; 13) 1; 14) 2; 15) 3; 16) 4; 17) 1; 18) 3; 19) 2; 20) 3; 21) 2; 22) 3; 23) 2; 24) 1; 25) 2; 26) 3; 27) 3; 28) 2; 29) 4; 30) 2; 31) 3; 32) 4; 33) 3; 34) 4; 35) 2; 36) 1; 37) 2; 38) 3; 39) 3; 40) 2. -
డీఎస్సీ-2014 విజేతగా నిలవాలంటే..
సంక్షోభ పరిస్థితుల కారణంగా చాలా నెలలుగా ప్రభుత్వ కొలువుల ప్రకటనలు లేకపోవడంతో నిరుద్యోగ యువత మనో వేదనకు గురైంది. ఇప్పుడు రాష్ట్ర విభజన అనంతరం కొత్త రూపు సంతరించుకున్న నవ్యాంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందన్న వార్తలు యువతలో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం రోజున గురువుల నియామకాలకు ప్రకటన వెలువరించనున్నట్లు ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకటించడంతో ఔత్సాహికులు గెలుపే లక్ష్యంగా సన్నద్ధతను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో డీఎస్సీ పరీక్ష విధానం ఎలా ఉంటుంది? విజయానికి వ్యూహాలేమిటి? తదితరాలపై ఫోకస్.. సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నోటిఫికేషన్ గురించి ఆలోచించకుండా, ఇప్పటి నుంచి అందుబాటులో ఉన్న ప్రతి నిమిషాన్నీ టీచర్ ఉద్యోగాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. తొలుత సిలబస్‌పై అవగాహన పెంపొందించుకొని, సరైన ప్రణాళికతో సన్నద్ధం కావాలి. ఎస్జీటీ పరీక్ష విధానం: సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు జీకే, కరెంట్ అఫైర్స్ 20 10 విద్యా దృక్పథాలు 20 10 లాంగ్వేజ్-1 (తెలుగు) 18 9 లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 18 9 మ్యాథ్స్ కంటెంట్ 18 9 సైన్స్ కంటెంట్ 18 9 సోషల్ కంటెంట్ 18 9 టీచింగ్ మెథడాలజీ 30 15 మొత్తం 160 80 మెథడ్స్‌కు సంబంధించి తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్‌లో ఒక్కో దాన్నుంచి ఆరు ప్రశ్నలు చొప్పున మొత్తం 30 ప్రశ్నలు వస్తాయి. వీటికి 15 మార్కులుంటాయి. డీఎస్సీలో టెట్ స్కోర్‌కు వెయిటేజ్ 20 మార్కులకు ఉంటుంది. టెట్‌లో సాధించిన ప్రతి 7 1/2 మార్కులకు 1 మార్కు చొప్పున వెయిటేజీ ఉంటుంది. జీకే, కరెంట్ అఫైర్స్: ఈ విభాగంలో స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. భౌగోళిక నామాలు; నదీ తీర నగరాలు; ప్రపంచ దేశాలు-రాజధానులు; ప్రపంచంలో మొట్టమొదట చోటుచేసుకున్న సంఘటనలు; సర్వోత్తమమైనవి; సైన్స్ అండ్ టెక్నాలజీ; అవార్డులు; సదస్సులు; వార్తల్లో వ్యక్తులు; క్రీడారంగ విశేషాలు; కేంద్ర, రాష్ర్ట వార్షిక బడ్జెట్లు; అంతర్జాతీయ రాజకీయ అంశాలు; భారతదేశంలో రాష్ట్రాల విభజన తదితర అంశాలపై దృష్టిసారించాలి. పరీక్షకు ముందు 8 నెలల కాలంలో చోటుచేసుకున్న పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవాలి. వర్తమాన వ్యవహారాల కు దినపత్రికలు చదవాలి. విద్యా దృక్పథాలు: భారతదేశంలో విద్యా చరిత్ర- కమిటీలు; వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధిత అంశాలు; ఉపాధ్యాయ సాధికారత; చట్టాలు-హక్కులు; జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం (2005), విద్యా హక్కు చట్టం వంటి అంశాలను చదవాలి. గత డీఎస్సీలో అన్ని అంశాలకూ సమాన ప్రాధాన్యమిచ్చారు. ప్రిపరేషన్ కోసం డీఎడ్ స్థాయి విద్యా దృక్పథాలు ప్రభుత్వ పాఠ్యపుస్తకాన్ని అభ్యసనం చేయాలి. కంటెంట్: కంటెంట్ కోసం పదో తరగతి వరకు రాష్ట్ర ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేయాలి. సోషల్‌లో భూగోళశాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం; మ్యాథ్స్‌లో సంఖ్యామానం, అంకగణితం, బీజగణితం, సమితులు- సంబంధాలు, క్షేత్రగణితం, రేఖాగణితం; తెలుగులో కవులు-కావ్యాలు, భాషా రూపాలు, పరుషాలు-సరళాలు; ఇంగ్లిష్‌లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, వొకాబ్యులరీ, ఆర్టికల్స్-ప్రిపొజిషన్స్ తదితర అంశాలపై దృష్టిసారించాలి. మెథడాలజీ: బోధనా లక్ష్యాలు, భాషా నైపుణ్యాలు, బోధనా ప్రణాళిక, మూల్యాంకనం తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటిని కంటెంట్‌లోని అంశాలకు అన్వయించుకుని అధ్యయనం చేయాలి. గత డీఎస్సీలో ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, తెలుగు మెథడాలజీ నుంచి క్లిష్టమైన ప్రశ్నలు వచ్చాయి. సన్నద్ధత కోసం డీఎడ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను చదవాలి. సక్సెస్ మంత్రఓ విజేత సూచనలు..కంటెంట్ చదివేటప్పుడు క్రమపద్ధతిని అనుసరించాలి. ఉదాహరణకు మూడో తరగతిలో విశ్వానికి సంబంధించిన అంశాలుంటే మొదట వాటిని చదివి, సంబంధిత అంశాలు ఏ తరగతుల్లో ఉన్నాయో గుర్తించి వాటన్నింటినీ ఒకేసారి అధ్యయనం చేయాలి. ఏదైనా ఒక అంశం ఎనిమిదో తరగతి వరకు ఉండి, 9, 10 తరగతి పుస్తకాల్లో పునరావృతమవుతుందో వాటి మీద అధిక దృష్టి పెట్టాలి. టీచింగ్ మెథడాలజీ అంశాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. అప్పుడే చదివిన అంశాలు గుర్తుంటాయి. ఉదాహరణకు సైన్స్ మెథడాలజీలో ‘ప్రాజెక్టు పద్ధతి’ అనే అంశాన్ని చదివిన వెంటనే మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్‌ల మెథడాలజీలోని ప్రాజెక్టు పద్ధతిని కూడా అధ్యయనం చేయాలి. అప్పుడే ప్రాజెక్టు అంటే ఏమిటి? దాని లక్ష్యాలు ఏమిటి? వంటి అంశాలపై పూర్తిస్థాయి అవగాహన వస్తుంది. అప్పుడు ‘ప్రాజెక్టు’ నుంచి ప్రశ్న ఎలా ఇచ్చినా తేలిగ్గా సమాధానం గుర్తించగలం. సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నప్పుడూ ఇదే క్రమాన్ని అనుసరించాలి. రోజూ దినపత్రికలను తప్పనిసరిగా చదవాలి. ముఖ్యమైన అంశాలతో నోట్స్ తయారు చేసుకోవాలి. ఏదైనా అంశంపై వార్త వస్తే వాటి అనుబంధ విషయాలను కూడా అధ్యయనం చేయాలి. ప్రశ్న నేరుగా రాని సందర్భాల్లో ఇలాంటి ప్రిపరేషన్‌తో లాభపడతాం. కొందరు మొదటే శిక్షణ సంస్థల మెటీరియల్‌ను చదవడం ప్రారంభిస్తారు. ఇది సరికాదు. తొలుత పాఠ్యపుస్తకాలను బాగా చదివిన తర్వాతే మెటీరియల్‌ను చదవాలి. శిక్షణ సంస్థలు నిర్వహించే మాక్ టెస్ట్‌లకు హాజరుకావాలి. అప్పుడే ప్రిపరేషన్లో లోటుపాట్లు తెలుస్తాయి. ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నామో తెలుస్తుంది. వాటికనుగుణంగా ప్రణాళికను మార్చుకునేందుకు వీలవుతుంది. ప్రశ్నను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని, వేగాన్ని, కచ్చితత్వాన్ని పెంపొందించుకునేందుకు నమూనా పరీక్షలు ఉపయోగపడతాయి. క్లిష్టంగా ఉన్న అంశాలను పేపర్‌పై రాసుకొని, గదిలో గోడకు అతికించుకొని, వీలున్నప్పుడల్లా చదివితే వాటిపై వారం రోజుల్లో పట్టు సాధించవచ్చు. ఒక వారం దేశాలు-రాజధానులు; మరో వారం ప్రముఖ యుద్ధాలు-జరిగిన తేదీలు.. ఇలా వివిధ అంశాలను తేలిగ్గా గుర్తుంచుకోవచ్చు. సెల్‌ఫోన్ వాయిస్ రికార్డర్‌తో క్లిష్టమైన అంశాలను రికార్డు చేసుకొని, నిద్రపోయే ముందు వినొచ్చు. ఇలా ఎవరికివారు ఏ అవకాశాన్నీ వదిలిపెట్టకుండా ప్రిపరేషన్ కొనసాగించాలి. అప్పుడే తీవ్ర పోటీ ఉన్న డీఎస్సీలో విజయం సాధించగలం. ఏ అంశాన్నీ నిర్లక్ష్యం చేయకూడదు. రకరకాల కారణాల వల్ల ఒకశాతం అంశాల్ని నిర్లక్ష్యం చేస్తే, ఆ ఒక్కశాతమే విజయావకాశాలను దెబ్బతీస్తుందని గుర్తించాలి.ప్రారంభంలోనే దాదాపు రూ.22 వేల వేతనం; ఆహ్లాదకరమైన పని వాతావరణం; ఎందరో విద్యార్థుల్ని తీర్చిదిద్దే సదవకాశం.. ఇవన్నీ టీచర్ ఉద్యోగంతో ఖాయం చేసుకోవచ్చు. ఓ ఐదు నెలల పాటు పటిష్ట ప్రణాళికతో సాధన చేస్తే విజయం మీదే! - డి.అజయ్ కుమార్; ఎస్జీటీ విజేత; పశ్చిమగోదావరి. స్కూల్ అసిస్టెంట్ పరీక్ష విధానం సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు జీకే, కరెంట్ అఫైర్స్ 20 10 విద్యా దృక్పథాలు 20 10 కంటెంట్ (సంబంధిత సబ్జెక్ట్) 88 44 మెథడాలజీ 32 16 మొత్తం 160 80 ప్రతి ప్రశ్నకు 0.5 (అర) మార్కు. మొత్తం 160 ప్రశ్నలకు 80 మార్కులు కేటాయించారు. టెట్ స్కోర్‌కు వెయిటేజ్ 20 మార్కులకు ఉంటుంది. ఎస్జీటీలోని జీకే, కరెంట్ అఫైర్స్; విద్యా దృక్పథాలు; టీచింగ్ మెథడాలజీ, కంటెంట్ అంశాలు స్కూల్ అసిస్టెంట్‌లోనూ ఉంటాయి. కంటెంట్‌కు ఆరు నుంచి ఇంటర్ వరకు పాఠ్య పుస్తకాలు చదవాలి. స్కూల్ అసిస్టెంట్- సోషల్ స్టడీస్ కంటెంట్: భూగోళశాస్త్రం: సౌర కుటుంబం-భూమి; భూ ఉపరితల స్వరూపాలు-వర్గీకరణ; ప్రపంచ ప్రకృతి సిద్ధ మండలాలు; ఖండాలు; భారతదేశ ఉనికి-భౌతిక అమరిక; వాతావరణం; సముద్రాలు; ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రం నుంచి ప్రశ్నలు వస్తాయి. 15 మార్కులకుగాను 30 ప్రశ్నలు వస్తాయి. 2012 డీఎస్సీలో ప్రపంచ భూగోళశాస్త్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. చరిత్ర: మధ్యయుగ ప్రపంచం; ప్రాచీన భారతీయ నాగరికతలు; ఢిల్లీ సుల్తానులు; మొఘలుల సామ్రాజ్యం; భారతదేశంలో స్వాతంత్య్ర ఉద్యమం; ఆధునిక ప్రపంచం; ఆర్థిక, సామాజిక రంగాల్లో మార్పులు; సమకాలీన ప్రపంచం అంశాల నుంచి 15 మార్కులకుగాను 30 ప్రశ్నలు వస్తాయి. పౌరశాస్త్రం: భారత రాజ్యాంగం; లౌకికత్వం-భారతదేశం; ప్రపంచ శాంతి-భారతదేశం పాత్ర; ఐక్యరాజ్య సమితి వంటి పాఠ్యాంశాల నుంచి 7 మార్కులకుగాను 14 ప్రశ్నలు వస్తాయి. అర్థశాస్త్రం: ద్రవ్యోల్బణం; ఆర్థికాభివృద్ధి; భారతదేశ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు; జాతీయ ఆదాయం; ద్రవ్యం వంటి పాఠ్యాంశాల నుంచి 7 మార్కులకుగాను 14 ప్రశ్నలు వస్తాయి. 2012 డీఎస్సీలో 9, 10 తరగతుల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. మెథడాలజీ: ఈ విభాగంలో ప్రధానంగా సాంఘిక అధ్యయన బోధనా ఉద్దేశాలు; విలువలు; విద్యా ప్రణాళిక; ఉపాధ్యాయుడు; బోధనోపకరణాలు; మూల్యాంకనం తదితర పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. గత డీఎస్సీలో బోధనోపకరణాలు నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. మెథడాలజీకి డీఎడ్, బీఎడ్ స్థాయి పాఠ్యపుస్తకాలను చదవాలి. ఎస్ఏ- గణిత శాస్త్రం కంటెంట్: ప్రధానంగా బీజ గణితం, వ్యాపార గణితం, క్షేత్ర గణితం, రేఖా గణితం, త్రికోణమితి, శ్రేఢులు, సమితులు-సంబంధాలు వంటి అంశాల నుంచి 44 మార్కులకు 88 ప్రశ్నలు వస్తాయి. గత డీఎస్సీలో వైశ్లేషిక రేఖాగణితం, బహుపదులు, త్రికోణమితి నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. మెథడాలజీ: ఈ విభాగంలో ప్రధానంగా గణితశాస్త్ర బోధనా లక్ష్యాలు, బోధనా విలువలు, బోధనా ప్రణాళిక, బోధనా పద్ధతులు, మూల్యాంకనం వంటి పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. గత డీఎస్సీలో బోధనా పద్ధతులు నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఎస్ఏ-బయాలజీ కంటెంట్: ప్రధానంగా జీవ ప్రపంచం, సూక్ష్మ జీవుల ప్రపంచం, జీవశాస్త్రం-ఆధునిక పోకడలు; జంతు ప్రపంచం వంటి పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలుంటాయి. 2012 డీఎస్సీలో జువాలజీ కంటే బోటనీ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. మెథడాలజీ: ప్రధానంగా జీవశాస్త్ర బోధనా లక్ష్యాలు, విజ్ఞానశాస్త్ర పాఠ్యప్రణాళిక, జీవశాస్త్ర ఉపగమాలు-పద్ధతులు తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. గత డీఎస్సీలో అన్ని అంశాలకు సమ ప్రాధాన్యమిచ్చారు. -
డీఎస్సీ-2014లో అవకాశమివ్వాలని ఆందోళన
కడప సెవెన్‌రోడ్స్ : డీఎస్సీ-2014లో తమకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం డీఎడ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కలెక్టరేట్ వద్ద బైఠాయించారు. అంతకుముందు నగరంలో వారు ర్యాలీ నిర్వహించారు. బైఠాయింపులో విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవీంద్ర, గంగా సురేష్ మాట్లాడుతూ డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడకముందే టెట్ నిర్వహించాలని, లేదంటే టెట్‌ను రద్దు చేసి డీఎడ్ విద్యార్థులకు డీఎస్సీలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఆందోళనల కారణంగా ఈ సంవత్సరం కౌన్సెలింగ్ ఆరు నెలలు ఆలస్యంగా నిర్వహించారని పేర్కొన్నారు. తమకు తరగతుల నిర్వహణ కూడా ఆలస్యమైందన్నారు. ఈ పరిస్థితులను అర్థం చేసుకుని ప్రభుత్వం డీఎడ్ విద్యార్థులకు డీఎస్సీలో అవకాశం కల్పించాలని కోరా రు. విద్యార్థులు కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చు కు వెళ్లేందుకు ప్రయత్నించగా, ఏఐఎస్ఎఫ్ అధ్య క్ష, కార్యదర్శులతోపాటు ఏఐవైఎఫ్ ఉపాధ్యక్షుడు ఈశ్వరయ్య తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని వన్‌టౌన్ పోలీస్స్టేషన్కుకు తరలించారు. తమ కోర్కెలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళన నిర్వహిస్తున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం అన్యాయమని విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. పోలీసులు, విద్యార్థి నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు విద్యార్థి నాయకులను విడుదల చేశారు. ఆందోళనలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు మద్దిలేటి, జగన్ నాయక్, సునీల్, ఖాదర్‌వలీ, శ్యాం, నాగేంద్ర, నాగరాజు పాల్గొన్నారు.