శ్రీకాకుళంలో అడ్డంగా దొరికిన అభ్యర్థి
హైదరాబాద్/శ్రీకాకుళం: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ-2014 పరీక్షల చివరిరోజు ప్రశ్నపత్రం లీకైనట్టు సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలో శ్రీకాకుళం జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రంలో ఒక అభ్యర్థిని వద్ద దొరికిన స్లిప్పులు ఈ అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి. ఆమె వద్ద ఉన్న జవాబుల స్లిప్పుపై ‘ఏ’ కోడ్ అని రాసి ఉండడం, ఆమెకు వచ్చిన ప్రశ్న పత్రం కూడా ఆ కోడ్‌దే కావడం అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అధికారులు మాత్రం ప్రశ్నపత్రం లీకయ్యే అవకాశమే లేదని కొట్టిపారేస్తున్నారు.
బయటపడింది ఇలా..
శ్రీకాకుళంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో అభ్యర్థిని వి. రజితసంపతిరావు(హాల్‌టికెట్ నంబర్ 14105100100029) పరీక్ష రాస్తోంది. తొలి 20 నిమిషాల పాటు జవాబులూ రాయని ఆమె.. టాయిలెట్‌కు వెళ్లి వచ్చాక రాయడం ప్రారంభించింది. గమనించిన చుట్టుపక్కల అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో కలెక్టర్ లక్ష్మీనరసింహం హుటాహుటిన కేంద్రానికి చేరుకున్నారు. అభ్యర్థిని మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన విషయాన్ని గుర్తించి కేంద్రం నుంచి బయటకు పంపారు.
విచారణకు కమిటీ: అభ్యర్థిని మాల్‌ప్రాక్టీస్ వ్యవహారంపై రీజనల్ జాయింట్ డైరక్టర్, రెవెన్యూ అధికారి, శ్రీకాకుళం డీఈవోల ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసినట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కె. సంధ్యారాణి ‘సాక్షి’కి తెలిపారు. మంగళవారం ఉదయమే ఈ కమిటీ విచారించి నివేదిక అందిస్తుందని, నివేదికను అనుసరించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పోలీసులకు ఫిర్యాదు :‘శ్రీకాకుళం’ మాల్‌ప్రాక్టీస్ ఉదంతంపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
డీఎస్సీ పేపర్ లీక్!
Published Tue, May 12 2015 4:17 AM | Last Updated on Sun, Sep 3 2017 1:51 AM
Advertisement
Advertisement