జిల్లా పోలీసు కార్యాలయం
అనంతపురం సెంట్రల్: పోలీసుశాఖలో కీలకమైన డీఎస్పీల పోస్టింగుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. నెలలు గడుస్తున్నా ఖాళీ స్థానాలకు ఖాళీగా ఉన్న డీఎస్పీ స్థానాలకు పోస్టింగ్ ఇవ్వడం లేదు. ఓవైపు ఎన్నికలు సమీపిస్తుండటంతో దీని ప్రభావం శాంతి భద్రతలపై పడనుంది.
జిల్లాలో పోలీసుశాఖ శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు డీఎస్పీ స్థానాలు ఉన్నాయి. అనంతపురం, తాడిపత్రి, ధర్మవరం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, పెనుకొండ, పుట్టపర్తి, కదిరి డీఎస్పీ స్థానాలు ఉన్నాయి. పోలీసుశాఖలో శాంతిభద్రతలు పర్యవేక్షించడంలో జిల్లా ఎస్పీ తర్వాత డీఎస్పీలే కీలకం. సబ్‌డివిజనల్ స్థాయిలో శాంతిభద్రతలు సజావుగా సాగాలన్నా.. సిబ్బంది సక్రమంగా పనిచేయాలన్నా డీఎస్పీల పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది. అంతటి కీలకమైన స్థానాలు వెనువెంటనే భర్తీకి నోచుకోవడం లేదు. కీలకమైన స్థానాలకు కూడా డీఎస్పీలు ఉండటం లేదు. ప్రస్తుతం జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ –1 డీఎస్పీ, తాడిపత్రి డీఎస్పీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మొన్నటి వరకూ కీలకమైన తాడిపత్రి, ధర్మవరం డీఎస్పీ స్థానాలు ఖాళీగా ఉండేవి. ధర్మవరం డీఎస్పీ పోస్టు దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు ఇన్‌చార్జ్‌లతో నెట్టుకొచ్చారు. డీఎస్పీ వేణుగోపాల్ ఉద్యోగవిరమణ తర్వాత పుట్టపర్తి డీఎస్పీ రమావర్మ ఇన్‌చార్జ్ బాధ్యతలు నెట్టుకొచ్చారు.
ఇటీవల స్పెషల్ డీఎస్పీ శ్రీనివాసులు కళ్యాణదుర్గం డీఎస్పీగా బదిలీ కావడంతో అక్కడున్న వెంకటరమణను ధర్మవరానికి నియమించారు. దీంతో అత్యంత కీలకమైన స్పెషల్‌బ్రాంచ్ డీఎస్పీ పోస్టు ఖాళీగా ఏర్పడింది. అలాగే తాడిపత్రి డీఎస్పీ స్థానం కూడా ఖాళీగా ఉండి దాదాపు ఏడాది కావస్తోంది. ప్రస్తుతం సూపర్ న్యూమొరీ డీఎస్పీ అయిన ఎస్సీ, ఎస్టీ సెల్–2 డీఎస్పీ విజయ్‌కుమార్ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా సూపర్ న్యూమొరీ డీఎస్పీలకు లా అండ్ ఆర్డర్ పోస్టింగులు ఇవ్వడం లేదు. కానీ జిల్లాలో మరో గత్యంతరం లేక సూపర్ న్యూమొరీ డీఎస్పీలకు బాధ్యతలు అప్పగించాల్సి వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొన్నటి వరకూ ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ మహబూబ్‌బాషాకు అప్పగించారు. అనివార్య కారణాల వల్ల తప్పించి మరో డీఎస్పీ విజయ్‌కుమార్‌కు ఇన్‌చార్జ్ బాధ్యతలు ఇచ్చారు.
త్వరలో మరో రెండు స్థానాలు ఖాళీ : ప్రస్తుతం ఈ పరిస్థితి ఉంటే త్వరలో మరో రెండు డీఎస్పీ స్థానాలు ఖాళీ ఏర్పడనున్నాయి. ఇటీవల పెనుకొండ డీఎస్పీ ఖరీముల్లాషరీఫ్, గుంతకల్లు డీఎస్పీ శ్రీధర్‌కు అడిషనల్ ఏఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో వీరికి పోస్టింగ్ కల్పించే అవకాశముంది. దీంతో ఈ రెండు స్థానాలు కూడా ఖాళీ ఏర్పడనున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు కొత్త డీఎస్పీలు నియమించే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. డీఎస్పీల కొరత ప్రభావం శాంతిభద్రతలపై పడుతోంది. పోలీస్‌బాస్ అయిన ఎస్పీపై అదనపు భారం పడుతోంది. డీఎస్పీలేని ప్రాంతాలపై నిరంతరం నిఘా పెడుతున్నారు. అయినప్పటికీ అక్కడక్కడా శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తాడిపత్రి సబ్ డివిజన్ పరిధిలో నేటికీ మట్కా, పేకాట, బెట్టింగ్ తగ్గుముఖం పట్టలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల అనంతపురం పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఎక్కువ తాడిపత్రి ప్రాంత వాసులు కావడం గమనార్హం. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మాజీ పీఏ కొండసాని సురేష్‌రెడ్డితో సహా పదుల సంఖ్యలో తాడిపత్రి ప్రాంతానికి చెందిన వారిని జిల్లా పోలీసులు పలు సందర్భాల్లో అరెస్ట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. దీనికంతటికీ కారణం స్థానికంగా రెగ్యులర్ డీఎస్పీ లేకపోవడమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ధర్మవరంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అనేక సందర్భాల్లో శాంతి భధ్రతలకు విఘాతం ఏర్పడేలా అక్కడి పోలీసులు వ్యవహరించిన దాఖలాలు ఉన్నాయి. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పలు సందర్భాల్లో ప్రతిపక్షపార్టీ నాయకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డీఎస్పీ కొరత ప్రభావం శాంతిభద్రతలపై పడే అవకాశముంది. కనుక కీలకమైన స్థానాలకు డీఎస్పీలు భర్తీ చేయడం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
త్వరలో నూతన డీఎస్పీలు : జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ
పోలీసుశాఖలో త్వరలో నూతన డీఎస్పీలుగా పలువురికి పదోన్నతులు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం పనిచేస్తున్న సూపర్‌న్యూమొరీ డీఎస్పీలకు రెగ్యులర్ డీఎస్పీలు పోస్టింగ్‌లు రానున్నాయి. వీరితో పాటు మరికొందరికీ డీఎస్పీలుగా పదోన్నతులు రానున్నాయి. అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతులు పొందిన వారు వెళ్లిపోతే రంగంలోకి నూతన డీఎస్పీలు రానున్నారు. కనుక త్వరలోఅన్ని స్థానాలకు రెగ్యులర్ డీఎస్పీలు నియమితులవుతారు. కావున ఇబ్బందులు ఉండవు
Comments
Please login to add a commentAdd a comment