దుర్గగుడి ఫ్లై ఓవర్ సర్వే ప్రారంభం
కార్పొరేషన్‌కు చేరిన డిజైన్
క్షేత్రస్థాయిలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్
విగ్రహాలు, కట్టడాల తొలగింపుపై దృష్టి
విజయవాడ సెంట్రల్ : దుర్గగుడి వద్ద నిర్మించనున్న ఫ్లై ఓవర్ సర్వే ప్రారంభమైంది. వంతెన నిర్మాణానికి అనుసంధానంగా ట్రాఫిక్ జంక్షన్ల అభివృద్ధిపై నగరపాలక సంస్థ అధికారులు దృష్టిసారించారు. ఆర్‌అండ్‌బీ అధికారులు రెండు రోజుల కిందటే ఫ్లైఓవర్ డిజైన్‌ను కార్పొరేషన్‌కు అందించారు. ఈ నేపథ్యంలో కమిషనర్ జి.వీరపాండియన్ గురువారం ఇంజినీంగ్, టౌన్‌ప్లానింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి అడ్డుగా ఉన్న కట్టడాలు, విగ్రహాలను పరిశీలించారు. అధికారులకు సూచనలు ఇచ్చారు.
అడ్డొచ్చేవన్నీ తొలగించండి
భవానీపురం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు 1.8 కిలోమీటర్ల మేర ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. విద్యాధరపురంలోని కేఎల్‌రావు హెడ్‌వాటర్ వర్క్స్, దుర్గగుడి సమీపంలోని అశోక్ స్థూపం, పొట్టిశ్రీరాములు విగ్రహం, నగరపాలక సంస్థ ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం, స్వాతంత్య్ర సమరయోధుల స్మారక భవనంలో కొంతభాగం ఫ్లై ఓవర్ నిర్మాణానికి అడ్డు వస్తాయని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. వీటిని ఆయా ప్రాంతాల నుంచి తొలగించాల్సిందిగా కమిషనర్ ఆదేశాలిచ్చారు. వేరే ప్రాంతాల్లో ఏర్పాటుచేసే విధంగా ప్రణాళిక రూపొందించాలన్నారు.
ట్రాఫిక్ జంక్షన్లపై దృష్టి
ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరిగే సమయంలో ట్రాఫిక్‌ను మళ్లించనున్న దృష్ట్యా ట్రాఫిక్ జంక్షన్ల అభివృద్ధిపై అధికారులు దృష్టిసారిస్తున్నారు. గొల్లపూడి వై జంక్షన్ నుంచి బైపాస్‌రోడ్డు, నైనవరం ఫ్లైఓవర్ మీదుగా ఇన్నర్‌రింగ్ రోడ్డు నుంచి ఏలూరు రోడ్డుకు ట్రాఫిక్ మళ్లించే విధంగా ప్రణాళిక రూపొందించారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జంక్షన్లను విస్తరించడంతో పాటు పైప్‌లైన్లను మార్పు చేయాల్సిందిగా కమిషనర్ సూచించారు. వీటిపై త్వరలోనే నివేదిక ఇవ్వాలన్నారు. చీఫ్ ఇంజినీర్ ఎంఏ షుకూర్, సిటీప్లానర్ ఎస్.చక్రపాణి, ఏసీపీ వి.సునీత, ఈఈ కేఆర్‌కే సత్యనారాయణ, డీఈఈలు నారాయణమూర్తి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.