టెండ‘రింగ్’
సాక్షి, విజయవాడ : గతం గుణపాఠం నేర్పుతుందంటారు. దుర్గగుడి అధికారులు మాత్రం గత అనుభవాలను పక్కకు నెట్టేసి.. చేసిన తప్పునే పదేపదే చేస్తూ అవినీతి పాఠాలు వల్లెవేస్తున్నారు. దసరా ఉత్సవాల్లో విధులు నిర్వహించే సిబ్బందికి టిఫిన్లు, భోజనాలు అందించే అంశంపై గత ఏడాది కోర్టు మెుట్టికాయలు తిన్న అధికారులు ఈసారి కూడా అదే తప్పు చేస్తున్నారు. సిబ్బందికి టిఫిన్లు, భోజనాల టెండర్లు ఖరారు చేయడంలో తీవ్ర తాత్సారం ప్రదర్శిస్తున్నారు. గత ఏడాది కూడా ఇలాగే జరగడంతో కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లారు. దీంతో ఉత్సవాలకు ఒక రోజు ముందు హడావుడిగా టెండర్లు ఖరారు చేయాల్సి వచ్చింది. ఈ ఏడాది ఇంకా 10 రోజుల వ్యవధి మాత్రమే ఉన్నా అధికారులు ఈ విషయంపై దృష్టి సారించట్లేదు.
ఎందుకీ తాత్సారం?
గత ఏడాది ఒక్కొక్కరికీ రెండు పూటలా భోజనం, ఉదయం టిఫిన్ కోసం రూ.110 చొప్పున చెల్లించారు. ఈ సంవత్సరం కాంట్రాక్టర్లు రింగై రూ.150 చొప్పున డిమాండ్ చేస్తూ టెండర్లు దాఖలు చేసినట్లు తెలిసింది. అధికారులు కోరితే.. కొద్దోగోప్పో తగ్గించి దేవస్థానానికి ఎంతో మిగిల్చామని హడావుడి చేయాలని యోచిస్తున్నారు. గత ఏడాది రూ.110కు ఆహారం, అల్పాహారాలు అందజేసిన ఒంగోలుకు చెందిన కాంట్రాక్టర్ ప్రస్తుతం రూ.125కే రుచికరమైన భోజనం అందజేస్తానంటూ ముందుకొస్తున్నారు. అధికారులు ఇప్పటివరకు టెండర్లు ఖరారు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. చివర నిమిషంలో కాంట్రాక్టర్లు కోరిన రేటు చెల్లించి.. వారి నుంచి డబ్బు దండుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.
పోలీసులకు డబ్బు ఇస్తారట..!
ఉత్సవాల సందర్భంగా సుమారు 4వేల మంది పోలీసులు పనిచేయనున్నారు. వీరికి ఒక్కొక్కరికీ రోజుకు రూ.150 చెల్లిస్తామని, టిఫిన్లు, భోజన ఏర్పాట్లు వారే చూసుకోవాలని అధికారులు ప్రతిపాదన పెడుతున్నారు. అరుుతే, దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు. రూ.150 ఇవ్వడం వల్ల సిబ్బంది విధుల్ని పక్కనపెట్టి ఆహారం కోసం వెళ్లడం.. లేదా అర్ధాకలితో విధులు నిర్వహించడం వంటివి చేస్తారన్న సందేహం పోలీస్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
మాజీ ప్రజాప్రతినిధి వద్ద సెటిల్‌మెంట్
గతంలో దుర్గగుడి భోజన సరఫరా టెండర్ల విషయంలో కొద్దో గొప్పో పోటీ ఉండేది. ఈ ఏడాది టెండర్లు వేసే కాంట్రాక్టర్లందరినీ ఓ మాజీ ప్రజాప్రతినిధి ఒక తాటిపైకి తెచ్చినట్లు తెలిసింది. టెండర్లు విభజించి అందరూ పంచుకోవాలని సూచించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది అత్యధికంగా రూ.150 టెండర్లు దాఖలు చేశారని చెబుతున్నారు. కాంట్రాక్టర్ల మధ్య సఖ్యత కుదిర్చినందుకు గానూ, ఆ నేతకు ముడుపులు కూడా అందనున్నారుు. కాంట్రాక్టర్లు కోరిన రేటుకు టెండర్ ఇప్పించేందుకు దేవాదాయ శాఖ మంత్రి వద్ద తాను చక్రం తిప్పుతానని వన్‌టౌన్‌కు చెందిన మాజీ ప్రజాప్రతినిధి చెబుతున్నారని సమాచారం.