ఇంద్రకీలాద్రి(విజయవాడ): దుర్గగుడి ట్రస్టు బోర్డు చైర్మన్, పాలకవర్గ సభ్యులు తమ పదవులకు శుక్రవారం రాజీనామాలు చేశారు. జూన్ నెలాఖరు వరకు ట్రస్టు బోర్డు పదవీ కాలం ఉన్నప్పటికీ, ఎన్నికలలో టీడీపీ ఘోర పరాభవాన్ని మూటకట్టుకోవడంతో ట్రస్టు బోర్డు సభ్యులు నెల రోజులు ముందుగానే రాజీనామాలు చేశారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలోని చైర్మన్ కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవం చెందడంతో ఇక పాలక మండలిలో కొనసాగలేమనే అభిప్రాయాన్ని సభ్యులు వ్యక్తం చేశారు. పదవీ కాలం కంటే ముందుగానే రాజీనామాలు చేస్తే కాస్త గౌరవంగా ఉంటుందని మెజారిటీ సభ్యులు చెప్పడంతో సభ్యులందరూ రాజీనామాలకు అంగీకరించారు. సభ్యులందరూ ఒకేసారి రాజీనామాలు చేసి చైర్మన్ గౌరంగబాబుకు అందచేశారు. చైర్మన్ తాను కూడా రాజీనామా చేసి సభ్యుల రాజీనామా పత్రాలతో కలిపి ప్రిన్సిపల్ సెక్రటరీకి సమర్పించేందుకు సిద్ధమయ్యారు.
ఎన్నికల ముందు మరో ఏడాది పొడిగింపునకు యత్నం...
వాస్తవానికి ఎన్నికల ముందు ట్రస్టు బోర్డును మరో ఏడాది పాటు పొడిగించేలా తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. జిల్లా మంత్రితో పాటు ఎంపీల సహకారంతో పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగించేలా పాలక మండలి సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించే క్రమంలోనే ఎన్నికల నోటిఫికేషన్ నగారా మోగింది. దీంతో ఆ ప్రయత్నాలకు గండి పడింది. తెలుగుదేశం ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తుందని, తమ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించే అవకాశాలున్నాయని సభ్యులు బహిరంగం గానే ప్రకటించేవారు. అయితే తమ ఊహలకు భిన్నంగా ఎన్నికల ఫలితాలు రావడం, వైఎస్సార్ సీపీ తిరుగులేని మెజారిటీ సాధించడంతో పాలక మండలి సభ్యుల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. చివరకు నెల రోజులు ముందుగానే పాలక మండలి సభ్యులు, చైర్మన్ తమ పదవులకు రాజీనామాలు చేసే పరిస్థితి ఏర్పడింది.
తొలి నుంచి వివాదాలే...
దుర్గగుడి ట్రస్టు బోర్డు సభ్యుల తీరు తొలి నుంచి వివాదాలే... కేశ ఖండన శాలలో క్షురకులతో వివాదం, అమ్మవారి చీర మాయం, ఆలయ అభివృద్ధి విషయంలో కాకుండా ఆలయ వ్యవహారాలు, పరిపాలనలో జోక్యం, దసరా ఉత్సవాలలో హడావుడి, ఎన్‌ఎంఆర్‌లకు హెచ్‌ఆర్‌ఏడీఏ అమలు చేసేశామని ముందే ప్రచారం చేసుకోవడం వంటి అంశాలతో పాటు ట్రస్టు బోర్డు సమావేశ విషయాలను ఆలయ ఈవోలకు చేరవేయడంతో ట్రస్టు బోర్డు తరుచూ వార్తల్లో నిలుస్తూ వచ్చింది. వాస్తవానికి ట్రస్టు బోర్డు సభ్యులు భక్తులకు ఎటువంటి సదుపాయాలు కల్పించాలనే విషయాలపై దృష్టి పెట్టింది లేదు.
దుర్గగుడి పాలకమండలి సభ్యుల రాజీనామా
Published Sat, May 25 2019 9:00 AM | Last Updated on Sat, May 25 2019 9:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment