
‘కొండ’పై కోల్డ్‌వార్
- ఫుడ్ టెండర్ల విషయంలో కుమ్ములాట
- కాంట్రాక్టర్ల మధ్య నలుగుతున్న అధికారులు
- కోర్టులకు వెళ్లడానికీ వెనుకాడని వైనం
- సబ్ కలెక్టర్ దృష్టికి వివాదం
సాక్షి, విజయవాడ : దుర్గగుడిపై కాంట్రాక్టర్ల మధ్య కోల్ట్‌వార్ ముదిరింది. ఇది అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. అంగ, అర్థబలం పుష్కలంగా ఉన్న కాంట్రాక్టర్లు అధికారుల్ని శాసించే స్థాయికి వెళ్లడమే కాకుండా దేవస్థానం ప్రతిష్టను రోడ్డున పడేయడానికీ వెనుకాడటం లేదు. అమ్మవారికి సేవచేస్తున్నామంటూ హడావుడి చేస్తూ లక్షల రూపాయలను వెనుకేసుకుంటున్నారు.
ఒక్కొక్క కాంట్రాక్టులోనూ లక్షలు రూపాయలు మిగులుతూ ఉండటంతో వాటిలో కొంత అధికారులకు ముట్టచెప్పి వారిని తమ చెప్పు చేతల్లో ఉంచుకోవడమో లేక ప్రజాప్రతినిధుల చేత ఫోన్లు చేయించి ఆదేశాలు ఇప్పించడమో చేస్తున్నారు. ఇవేమీ సాధ్యపడకపోతే చివరకు కోర్టులకు వెళ్లి అధికారుల్ని ఇబ్బందులకు గురిచేయడం, వారిపై కేసులు పెట్టడానికీ కాంట్రాక్టర్లు వెనుకాడం లేదు.
కాంట్రాక్ట‘రింగ్’
దుర్గగుడిలో దుకాణాలు, కొబ్బరిచిప్పలు ఏరుకోవడం, తలనీలాలు సేకరణ, టోల్‌గేట్, క్లోక్‌రూమ్ తదితర వాటికి టెండర్లు పిలుస్తారు. దసరా ఉత్సవాల్లో క్యూలైన్ల ఏర్పాటు, ఫుడ్ ప్యాకింగ్ సప్లయి, శానిటేషన్ తదితర పనులకు టెండర్లు పిలిచి కాంట్రాక్టు ఇస్తారు. కొన్నేళ్లుగా ఈ టెండర్లు కేవలం 10 మంది కాంట్రాక్టర్ల చేతిలోనే ఉంటున్నాయి. ఈ టెండర్లు ద్వారా వచ్చే ఆదాయం లక్షలకు చేరుకుంది. దీంతో రాజకీయ నాయకులు ఈ రంగంలోకి దిగారు. పాత కాంట్రాక్టులు గ్రూపులుగా విడిపోయి ఒక్కొక్క టెండర్‌లో ఒక్కొక్కరు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు.
అదికాస్తా కోల్డ్‌వార్‌గా మారి ఒకరినొకరు నిరోధించుకునే వరకు వచ్చింది. అలాగే రింగైపోయి ఎదుటివార్ని దెబ్బతీసేందుకూ యత్నిస్తున్నారు. తమకు టెండరు దక్కకపోతే ఎదుటివారికి దక్కకూడదనే సూత్రాన్ని వీరు తూ.చ. తప్పకుండా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరు అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. గతేడాది ఫుడ్ టెండర్లు, చీరల కాంట్రాక్టు, దుకాణాలు కేటాయింపులో కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకువచ్చారు.
అందరి దృష్టి ‘ఫుడ్’పైనే
దసరా ఉత్సవాలు సందర్భంగా ఇతర శాఖల నుంచి వచ్చే అధికారులకు ఫుడ్ ప్యాకెట్లు అందజేయాల్సి ఉంటుంది. వీటి సంఖ్య దాదాపు ఆరువేల వరకూ ఉంటుంది. ఇందుకోసం దేవస్థానం టెండర్లు పిలించింది. దీంతో కొండపై ఉన్న కాంట్రాక్టర్లు రింగై టెండర్లు దాఖలు చేశారు. ఇంకో వర్గం ఈ టెండర్లలో తలదూర్చకుండా ఉండేందుకు అధికారులతో కుమ్మక్కై నిబంధనలు విధించారనే ఆరోపణలు వినవస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఒకసారి ఫుడ్ టెండర్లు రద్దు చేశారు. సోమవారం రెండో దఫా పిలవనున్నారు. ఇప్పటి వరకూ ఆరుగురు టెండర్లు దాఖలు చేశారు. అన్ని అర్హతలు ఉన్నా.. తమకు టెండరు ఫారాలు విక్రయించలేదని సాయితేజ ఫుడ్ అండ్ బ్రేవరీస్ అధినేత సీహెచ్. వెంకటరత్నం ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో సబ్ కలెక్టర్ నాగలక్ష్మి దృష్టికి తీసుకొచ్చారు.
తొలి విడత టెండర్లలో రోజుకు ఒక్కొక్కరికి రూ.150 చొప్పున చెల్లించేందుకు అధికారులు ముందుకు వచ్చారని తాను రూ.110కే భోజనం అందిస్తానని ఆయన చెబుతున్నారు. అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై తమకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్సవాల ప్రారంభానికి మూడు రోజుల వ్యవధే ఉండటంతో ప్రస్తుతం ఫుడ్ టెండర్ల బాగోతం అధికారులకు తలనొప్పిగా మారింది. అయితే రాబోయే రోజుల్లో దేవస్థానమే తమ సొంత సిబ్బందితో పనులు చేయించి కాంట్రాక్టర్ల వ్యవస్థకు చెక్ పెట్టాలని, అధికారులు కూడా కాసుల వేటలో పడకుండా వారిని కట్టడి చేయాలని పలువురు భక్తులు కోరుతున్నారు.
ఫుడ్ టెండర్లు రద్దు..?
కాంట్రాక్టర్ల మధ్య వివాదం చిలికి చిలికి గాలి వానగా మారి వివాదం అధికార పార్టీ అగ్రనేతల వద్దకు చేరింది. సాయి తేజ పుడ్ అండ్ బ్రేవరీస్‌కు టెండర్ ఇవ్వకపోవడంతో అధికారుల్ని ఒక ముఖ్య ప్రజాప్రతినిధి నిలదీసినట్లు సమాచారం. దీంతో మొత్తం ఫుడ్ టెండర్లను రద్దు చేసి సిబ్బందికి ఒకొక్కరికి రోజుకు రూ.150 చొప్పున ఇవ్వాలని ఈవో త్రినాథరావు నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పోలీసులకు రూ.150 చొప్పున ఇస్తే వారే టిఫిన్లు, భోజన ఏర్పాట్లు చేసుకుంటారని సీపీ ఏబీ వెంకటేశ్వరరావు ఈవో త్రినాథరావుకు హామీ ఇచ్చినట్లు తెలిసింది.