దుర్గమ్మ భక్తులకు సకల సౌకర్యాలు | Durgamma all facilities for devotees | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ భక్తులకు సకల సౌకర్యాలు

Published Thu, Oct 3 2013 2:23 AM | Last Updated on Sat, Sep 29 2018 5:52 PM

దుర్గమ్మ భక్తులకు సకల సౌకర్యాలు - Sakshi

దుర్గమ్మ భక్తులకు సకల సౌకర్యాలు

సాక్షి, విజయవాడ : దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులు క్యూల ద్వారా త్వరగా అమ్మవారిని దర్శించుకుని ప్రసాదం తీసుకుని తిరిగి వెళ్లేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని  శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.ప్రభాకర శ్రీనివాస్ ‘సాక్షి’కి తెలిపారు. మరో మూడు రోజుల్లో దసరా ఉత్సవాలు ప్రారంభమౌతున్న  నేపథ్యంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన వివరించారు. ఒకవైపు సమైక్య ఉద్యమం జరుగుతున్నప్పటికీ, దసరా ఉత్సవాలకు 15 లక్షల మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది 12 లక్షల మంది భక్తులు ఇంద్రకీలాద్రికి వచ్చారన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

విజయవాడ నుంచి అదనపు బస్సులు

 విజయవాడలో వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే నాలుగు బస్సులు నడుస్తున్నాయని, సిటీ బస్సులు లేనందున అదనంగా ప్రైవేటుబస్సుల్ని ఏర్పాటు చేసేందుకు డెప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ శివలింగయ్యతో  చర్చిస్తున్నామని చెప్పారు. భక్తుల అవసరాలకు తగినట్లుగా ఈ బస్సుల్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.  కొండ దిగువ వరకు బస్సుల్లో రావచ్చని, అక్కడ నుంచి వృద్ధులు, వికలాంగులు, ఉభయదాతలకు ప్రతి ఏడాదిలాగానే వ్యాన్‌లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

భోజన, ఉచిత ప్రసాదాల ఏర్పాటు

ఇంద్రకీల్రాది దిగువభాగంలో శృంగేరి పీఠంలో రోజుకు ఏడువేల మందికి, మూలానక్షత్రం, విజయదశమి రోజున 10వేల మందికి ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రోజుకు 15 బస్తాల పులిహోరను తయారు చేయించి భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. భక్తులు కోసం కనకదుర్గానగర్‌లో ఏడు, జమ్మిదొడ్డి, బస్‌స్టేషన్, రైల్వేస్టేషన్, కొండపైన వీఐపీల కోసం ఒక్కొక్క  ప్రసాదాల  కౌంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆయా కౌంటర్లలో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా ప్రసాదాన్ని అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
 
స్నానఘట్టాలు, కేశఖండన

దుర్గాష్టమి నుంచి భవానీ భక్తులు దుర్గమ్మ సన్నిధికి తరలి రావడం ప్రారంభిస్తారని తెలిపారు. వారంతా తలనీలాలను అమ్మవారికి సమర్పిస్తారని చెప్పారు. దుర్గాఘాట్‌తో పాటు పద్మావతిఘాట్, దోబీఘాట్, సీతమ్మవారిపాదాలు, పున్నమిఘాట్, భవానీఘాట్‌లలో స్నానఘట్టాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రమాదాలు జరగకుండా బ్యారికేడింగ్, జల్లుస్థానాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేవస్థానంలో ఉండే 80 క్షురకులకు అదనంగా, ఇతర దేవస్థానాల నుంచి 140 మంది క్షురకుల్ని రప్పించినట్లు వివరించారు.  దుర్గాష్టమి నుంచి రోజుకు 400 మంది ప్రైవేటు క్షురకుల్ని తీసుకుంటున్నట్లు తెలిపారు.
 
ఉచిత చెప్పుల స్టాండ్‌లు, క్లోక్‌రూమ్‌లు

భక్తుల సౌకర్యం కోసం 12 పాయింట్లలో ఉచిత చెప్పుల స్టాండ్‌లను ఏర్పాటుచేశామని ఈవో చెప్పారు. ముఖ్యంగా వినాయకుడు గుడి వద్ద నుంచి భక్తులు క్యూలైన్లో వెళతారు కాబట్టి అక్కడ, మున్సిపల్ కార్పొరేషన్, బొడ్డుబొమ్మ సెంటర్, బావాజీ మఠం తదితర ప్రాంతాల్లో ఈ స్టాండ్‌లున్నాయని తెలిపారు.

 రాజగోపురం నుంచి ముఖ్యులకు మాత్రమే అనుమతి

 రాజగోపురం నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు వంటి ముఖ్యులను మాత్రమే అనుమతిస్తామని ఈవో చెప్పారు. వారితో వచ్చేవారి కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. రూ.500, రూ.1000 టిక్కెట్లు కొన్నవారు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. లక్ష కుంకుమార్చన టిక్కెట్లు కొన్న భక్తులు వారికి కేటాయించిన సమయానికి భవానీ మండపానికి చేరుకోవాలని కోరారు.

భక్తులతో మర్యాదగా ప్రవర్తించేలా..

దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులతో పోలీసులు, సిబ్బంది దురుసుగా వ్యవహరించకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భక్తులకు అర్థమయ్యేందుకు సిబ్బంది డ్రస్సు కోడ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇతర దేవస్థానాలనుంచి వచ్చిన భక్తులు కూడా డ్రస్సు కోడ్ అమలు జరిగేలా చూస్తామని తెలిపారు. కీలకప్రదేశాల్లో పనిచేసే పోలీసులు భక్తులతో మర్యాదగా ప్రవర్తించమని ఆ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశించారని చెప్పారు. భక్తులు కూడా అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. మూలా నక్షత్రం రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి భక్తులు కూడా ఓపిగ్గా ఉండి దర్శనం చేసుకోవాలన్నారు.

 పారిశుధ్య సమస్యలు రానివ్వం

 మూలానక్షత్రం, విజయదశమి రోజున లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారని, అయినా పారిశుధ్య సమస్యలు రాకుండా అన్ని చర్యలు దేవస్థానం సిబ్బంది తీసుకుంటున్నారని చెప్పారు. తమ వద్ద ఉన్న 200 మంది శానిటేషన్ సిబ్బందికితోడు అదనంగా మరో 700 మంది మూడు షిప్టులలో పనిచేస్తారన్నారు. దుర్గాఘాట్‌లో భక్తులు వదిలివేసే దుస్తులు, చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తరలిస్తారని తెలిపారు.

 గిరిప్రదక్షిణ, తెప్పోత్సవానికి ఏర్పాట్లు

 దుర్గాష్టమి నుంచి భవానీ భక్తులు వచ్చి గిరిప్రదక్షణ చేస్తారని, అందువల్ల రోడ్డు మరమతులు, విద్యుత్, సెక్యూరిటీ తదితర ఏర్పాట్లు రెవెన్యూ, పోలీసు, నగరపాలకసంస్థ అధికారులు చూస్తున్నారని ఈవో తెలిపారు. భక్తులు త్వరగా దర్శనం చేసుకుని వెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లు దేవస్థానం చేస్తోందన్నారు. 13న సాయంత్రం జరిగే తెప్పోత్సవాన్ని భక్తులంతా తిలకించవచ్చన్నారు.

 సిబ్బంది సమస్య రానీయకుండా చర్యలు

 సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో వివిధ శాఖల ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పటికీ భక్తులకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రిటైరైన సిబ్బందితోపాటు వాలంటీర్లు, యువజన సంఘాలు, జిల్లా సంక్షేమశాఖ సిబ్బంది సేవలు వినియోగించుకుంటున్నామని తెలిపారు.

 సెల్‌ఫోన్లు తీసుకురావద్దు

 దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులు సాధ్యమైనంత తక్కువ లగేజ్ తీసుకురావాలని కోరారు. సెల్‌ఫోన్లు అసలు తేవొద్దని విజ్ఞప్తి చేశారు. దేవాలయంలోకి సెల్‌ఫోన్లను అనుమతించబోమని స్పష్టం చేశారు. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది భక్తుల లగేజ్‌ను ఎప్పుడైనా తనిఖీ చేసే అవకాశం ఉన్నందున సాధ్యమైనంత వరకు ఖాళీ చేతులతో వచ్చి అమ్మవార్ని మనస్ఫూర్తిగా దర్శించుకోవాలని ఈవో కోరారు. కొబ్బరికాయలు కొట్టే చోట, తలనీలాలు సమర్పించే చోట భక్తులు అదనంగా సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement