అందమైన లోకాన్ని చూసేందుకు కళ్లు ఇచ్చిన దేవుడు.. కదల్లేని దేహంతో బయటి ప్రపంచానికి దూరం చేశాడు. నవరత్నాలు రాల్చే నవ్వునిచ్చినా.. జీవితంలో సంతోషం లేకుండా చేశాడు. కడుపులో పెట్టుకుని చూసుకునే తల్లిదండ్రలను ఇచ్చినా.. వారికి మనశ్శాంతి లేకుండా చేశాడు. ఆకలేస్తే అడగలేదు.. ఎవరైనా నవ్వితే ఆ సంతోషాన్ని పంచుకోవడం.. ఏడిస్తే తనూ కన్నీళ్లు రాల్చడమే తెలుసు. అమ్మా.. నాన్నా.. ఇరువురు తమ్ముళ్లే ఆ బాలిక లోకం. నవ మాసాలు మోసి కన్న తల్లి ప్రేమను.. తొమ్మిదేళ్లయినా పొందకనే ఆమె ఈ లోకం వీడింది. వెళ్తూ.. ఇరువురి జీవితాల్లో వెలుగు నింపింది.
ఎమ్మిగనూరు టౌన్, న్యూస్‌లైన్: పట్టణంలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన డ్రైవర్ టి.వెంకటేష్, లక్ష్మీ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిది మేనరికం వివాహం. పెద్ద కుమార్తె లిఖిత(9) పుట్టుకతోనే మానసిక, శారీరక వికలాంగురాలు. మరో ఇరువురు కుమారులు గురుసాయి, శీను ఆరోగ్యంగానే ఉన్నారు. లిఖితను చిన్నప్పటి నుంచే అనారోగ్యం చుట్టుముట్టింది. మొదటి సంతానం కావడం.. అందునా ఆడపిల్ల కావడంతో ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్లుగానే భావించారు ఆ దంపతులు. కదల్లేకపోయినా.. కంటికి రెప్పలా చూసుకున్నారు. ఇంట్లో అందరినీ చూసుకోవడం ఒక ఎత్తయితే.. ఈమె బాగోగులు మరో ఎత్తు. కదల్లేని బొమ్మే అయినా.. వారు భారమనుకోలేదు. ఆమె నవ్వుతో కష్టమంతా మర్చిపోయేవారు. తమ ఇంటి దీపం కళ్ల ముందుంటే చాలనుకుని అహర్నిశలు ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసుకోసాగారు.
విధి ఆ సంతోషాన్ని కూడా దూరం చేసింది.. బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో లిఖిత అనారోగ్యంతో లోకం విడిచింది. తమ పాప చూడలేకపోయిన ఈ లోకాన్ని.. ఆమె కళ్లతో మరో ఇరువురు వీక్షించేలా ఆ తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో స్థానిక శ్రీవివేకానంద ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ వ్యవస్థాపకుడు తిరుమల ఉపదేశం చేశారు. కూతురు భౌతికంగా దూరమైనా.. నేత్రదానంతో ఆమె రెండు దేహాల్లో జీవించే ఉంటుందని భావించారు.
పొంగుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ.. కన్నీటి ధారను కట్టడి చేస్తూ లిఖిత జీవితానికి ఆ దంపతులు సార్థకత చేకూర్చారు. తమ నిర్ణయాన్ని కర్నూలు ప్రభుత్వ ప్రాంతీయ కంటి వైద్యశాల ఇన్‌చార్జి, జిల్లా అంధత్వ నివారణ శాఖ అధికారి డాక్టర్ ఆంజనేయులుకు ఫోన్ ద్వారా తెలియజేశారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కంటి వైద్యశాల టెక్నిషియన్ శంకర్ ఎమ్మిగనూరుకు చేరుకుని లిఖిత కళ్లను సేకరించారు. మానసిక, శారీరక ఎదుగుదల లేని కూతురిని అన్నీ తామై చూసుకున్న ఆ దంపతులు.. మరణానంతరం కూడా ఆ పాప మరో ఇద్దరి జీవితాలు వెలుగు నింపేలా తీసుకున్న నిర్ణయం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
విధి ‘లిఖితం.. ‘వెలుగు’పుష్పం
Published Thu, Dec 26 2013 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM
Advertisement
Advertisement