- మహిళా సంఘాలకు క్వారీల కేటాయింపులో జాప్యం
- టీడీపీ నేతల కనుసన్నల్లో కొనసాగుతున్న వ్యవహారం
- క్వారీలను దక్కించుకునేందుకు అధికారులపై ఒత్తిళ్లు
సాక్షి, చిత్తూరు: భూగర్భ జలమట్టం గణనీయంగా తగ్గిపోతోందనే కారణంతో ఇసుక తవ్వకాలపై హైకోర్టు నిషేధం విధించింది. చిత్తూరు జిల్లాలో 1996 నుంచి ఇసుకరీచ్‌లకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. దీంతో అప్పటి నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. తవ్వకాలపై నిషేధంతో ఇసుక ధరను వ్యాపారులు భారీగా పెంచేశారు. ఒక లోడు *500 నుంచి ఇప్పుడు *5వేల వరకూ చేరిందంటే ఏ స్థాయిలో అక్రమ రవాణా సాగుతుందో అర్థమవుతుంది.
ఓ మాఫియా ఏర్పడి అధికారులను గుప్పిట్లో పెట్టుకుని ఇసుకదందాను అడ్డూ అదుపు లేకుండా కొనసాగించే స్థాయికి చేరింది. ఎలాంటి శ్రమ, పెట్టుబడి లేకుండా కోట్ల రూపాయలు కురిపిస్తున్న వ్యాపారంగా అధికారపార్టీ నేతలు దీన్ని గుర్తించారు. దీంతో అధికారులను దారికి తెచ్చుకుని తమ కనుసన్నల్లో దందాను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఇసుక అక్రమ తవ్వకాలు ఉన్న ప్రాంతాల్లో పోస్టింగుల కోసం అధికారులు తీవ్రంగా ప్రయత్నించే స్థాయికి వచ్చారంటే ‘అధికార’పార్టీ దందా ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుస్తుంది.
ఇప్పటికీ ఖరారుకాని క్వారీల గుర్తింపు:
అక్టోబర్ 2నుంచి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే క్వారీలను కూడా ఇంకా గుర్తించలేదు. ఆయా గ్రామాల్లోని వంకలు, వాగుల్లోని ఇసుకను మాత్రమే మహిళా సంఘాలకు ఇచ్చి, నదుల తవ్వకాలకు టెండర్లు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో ఇసుక ఉన్న ప్రాంతాలపై ఇప్పటికే అధికారపార్టీ నేతలు కన్నేశారు. శ్రీకాళహస్తి, నగరి, సత్యవేడు, గంగాధరనెల్లూరులో, పలమనేరు, కుప్పంలో తవ్వకాలు జరుగుతున్నాయి.
సత్యవేడు, నగరి, కుప్పం నుంచి తమిళనాడుకు పలమనేరు నుంచి కర్ణాటకకు ఇసుక తరలుతోంది. ఒక్కో టిప్పర్‌కు 35వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. రోజూ వందలాదిగా ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. లక్షల రూపాయలు దండుకుంటున్నారు. వీరంతా క్వారీలను గుర్తించి, అవి చేదాటిపోకుండా స్థానిక ప్రజాప్రతినిధులతో సిఫార్సు చేయించుకుంటున్నారు.
ఆయా గ్రామాల్లోని మహిళా సంఘాలతో చర్చించి వారికి నెలకు ఇంత డబ్బులు ఇస్తామని ఒప్పందం చేసుకుని రీచ్‌లు దక్కించుకునేలా వ్యూహం రచిస్తున్నారు. అధికారులపై కూడా ఒత్తిళ్లు తెస్తున్నారు. అయితే ఇప్పటివరకూ జిల్లాలో ఇసుక రీచ్‌ల గుర్తింపే జరగలేదు. క్వారీల కేటాయింపు, ఒప్పందాలు పూర్తయిన తర్వాత క్వారీలను కేటాయించాలి, అప్పటివరకూ దానికి జోలికి వెళ్లొద్దని అధికారపార్టీ నేతల నుంచి మౌఖిక ఆదేశాలు జిల్లా యంత్రాంగానికి జారీ అయినట్లు తెలుస్తోంది. దీంతోనే క్వారీల కేటాయింపులో ఆలస్యం జరుగుతోంది. ఇదే జరిగితే మహిళల పేరుతో మళ్లీ అధికారపార్టీ నేతలే దోపిడీని కొనసాగించడం తథ్యం!