డ్వాక్రాకూ టోకరా... | Dvakra tokara ... | Sakshi
Sakshi News home page

డ్వాక్రాకూ టోకరా...

Published Fri, Aug 22 2014 2:29 AM | Last Updated on Sat, Sep 29 2018 6:06 PM

Dvakra tokara ...

  •   బడ్జెట్‌లో స్పష్టత లేదు
  •   రూ.లక్ష మాఫీకి జీవో లేదు
  •   ఒత్తిడి పెంచుతున్న  బ్యాంకర్లు
  •   ఆందోళనలో మహిళలు
  • డ్వాక్రా, డ్వాక్వా మహిళలకు రుణమాఫీపై స్పష్టత ఇవ్వకుండా అంకెల గారడీతో బడ్జెట్‌లో బాబు బురిడీ కొట్టించారు. టీడీపీ అధికారంలోకి వస్తే తమ రుణాలు రద్దవుతాయని  రెండున్నర నెలలుగా ఎదురుచూస్తున్న మహిళల ఆశల్ని ఆవిరి చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో బకాయిల వసూళ్ల కోసం పొదుపు సంఘాలపై బ్యాంకర్లు ఒత్తిడి పెంచుతున్నారు.
     
    విజయవాడ : స్వయం సహాయక సంఘాల మహిళల్ని సర్కార్ ఊరించి ఉసూరుమనిపించింది. జిల్లాలోని ఎనిమిది మున్సిపాల్టీలతో పాటు  విజయవాడ నగరంలో సుమారు  రూ.250 కోట్ల  రుణాలు రద్దు కావాల్సి ఉంది. రుణమాఫీపై పూటకో మాట మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ప్రకటించిన రాష్ట్ర బడ్జెట్‌లో స్పష్టత ఇవ్వలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో రుణాల వసూళ్లకు గ్రూపులపై ఒత్తిడి పెంచాలనే యోచనలో బ్యాంకర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

    ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల నేపథ్యంలో 80 శాతం గ్రూపులు బ్యాంకులకు రుణాలు చెల్లించడం మానేశాయి. పాత రుణాలు చెల్లించకుండా కొత్త అప్పులు ఇవ్వబోమని బ్యాంకర్లు తెగేసి చెబుతున్నారు.  దీంతో డ్వాక్రా గ్రూపుల వ్యాపార లావాదేవీలు పూర్తిగా స్తంభించిపోయాయి.
     
    రుణాలు కట్టాల్సిందే...
     
    రుణమాఫీతో తమకు సంబంధం లేదని,  రుణాలు చెల్లించాల్సిందేనని బ్యాంకర్లు పొదుపు సంఘాల మహిళలపై ఒత్తిడి తెస్తున్నారు.  నెలవారీ రుణాలు చెల్లించని సంఘాల నుంచి పొదుపు సొమ్మును మినహాయించుకుంటున్నారు. పొదుపు మొత్తాలు జమ వేసినా ఇంకా బకాయిలు చెల్లించాల్సిన దుస్థితి మహిళల్ని వెంటాడుతోంది. డ్వాక్రా గ్రూపు మహిళలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పాత రుణం చెల్లిస్తే అంతే మొత్తంలో కొత్త రుణాలు ఇస్తామని బ్యాంకర్లు తాజాగా ఆఫర్లు ఇస్తున్నారు.
     
    కానరాని జీవో...

     
    స్వయం సహాయక మహిళలకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తానని నెల రోజుల క్రితం సీఎం ప్రకటించారు. ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి జీవో  విడుదల చేయలేదని అధికారులు చెబుతున్నారు. జీవో వస్తే కానీ రుణాల వివరాలతో కూడిన లబ్ధిదారుల జాబితాను తయారు చేయలేమని వారు పేర్కొంటున్నారు.
     
    జిల్లాలో రూ.87 కోట్లు
     
    జిల్లాలో 2,781 డ్వాక్రా సంఘాల్లోని 27,810 మంది సభ్యులకు 2013-14 సంవత్సరానికి రూ.87 కోట్లు మంజూరు చేశారు. మచిలీపట్నంలో రూ.29 కోట్లు, గుడివాడలో రూ.24 కోట్లు, పెడనలో రూ.5కోట్లు, నూజివీడులో రూ.9 కోట్లు, జగ్గయ్యపేటలో రూ.8కోట్లు, నందిగామలో రూ.3కోట్లు, ఉయ్యూరులో రూ.5.5కోట్లు, తిరువూరులో రూ.3.5 కోట్లు చొప్పున రుణాలందించారు.

    రుణమాఫీ ఆశతో 70 శాతం గ్రూపులు తీసుకున్న రుణాలు చెల్లించలేదు. దీంతో కొత్త రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు ససేమిరా అంటున్నారు. పొదుపు సొమ్ము నుంచి బ్యాంకర్లు నగదు మినహాయించుకోవడంతో మహిళల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.. రుణమాఫీ కోసం నిత్యం   మహిళలు  ఆందోళనకు దిగుతున్నారు.   కొందరు మహిళలు డ్వాక్రా సంఘాలను రద్దు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.
     
     రుణాలు  మాఫీ చేయాల్సిందే
     డ్వాక్రా రుణాలు మొత్తం మాఫీ చేస్తామని గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఒక్కొక్క గ్రూపునకు లక్ష రూపాయలు మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. రుణం మొత్తం మాఫీ చేయకుంటే మహిళలను మోసం చేసినట్లే.     
     - పి.సామ్రాజ్యం, బందరు
     
     ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి
     ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన మాటలు నమ్మిన డ్వాక్రా సంఘాల సభ్యులు బ్యాంకులో తీసుకున్న రుణాలు చెల్లించకుండా నిలిపివేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేయాలి.    
     - లక్ష్మీనాంచారమ్మ, బందరు
     
     మహిళలను మోసం చేస్తారా
     ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలన్నీ రద్దు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఒక్కొక్క డ్వాక్రా సంఘానికి లక్ష రూపాయలే మాఫీ చేస్తామని చెబుతున్నారు.  చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని నమ్మి రుణాలు చెల్లించటం నిలిపివేశాం. దీంతో మహిళల ఆర్థిక పరిస్థితి కుంటుపడింది.    
     - పోలగాని లక్ష్మి, బందరు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement