మోసాన్ని మరిపించేందుకు విచిత్రమైన ఎత్తుగడ | Dwakra communities Womens shocked with government activities | Sakshi
Sakshi News home page

డ్వాక్రా అక్కచెల్లెళ్లమైన మేము..

Published Sat, Sep 22 2018 3:02 AM | Last Updated on Sat, Sep 29 2018 6:00 PM

Dwakra communities Womens shocked with government activities - Sakshi

ప్రభుత్వం డ్వాక్రా మహిళలచే సంతకాలు చేయించుకుంటున్న పత్రంలోని ఓ భాగం

మీ బలవంతాన రాయించి ఇచ్చు పత్రమేమనగా..హామీ ఇచ్చి రుణాలు మాఫీ చేయకున్ననూ,వడ్డీ రాయితీ చెల్లించకున్ననూ,మాట నిలబెట్టుకున్న మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు
– ఇట్లు సంఘ సభ్యులు

సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చి, ప్రజల ఓట్లు కొల్లగొట్టి గద్దెనెక్కాక వాటిని నెరవేర్చకుండా మాటలతో మభ్యపెడితే అంతకంటే దారుణం ఇంకేదైనా ఉంటుందా? హామీలను అమలు చేయకున్నా.. అన్నీ చేసేశా, మీరు చచ్చినట్లు ఒప్పుకో వాల్సిందేనంటూ జనంతో బలవంతంగా సంతకాలు చేయించుకుంటే దానికంటే అన్యాయం మరొకటి ఉంటుందా? రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అక్షరాలా ఇలాంటి పనే చేస్తోంది. తాను అధికా రంలోకి రాగానే డ్వాక్రా మహిళా సంఘాల రుణా లన్నీ బేషరతుగా మాఫీ చేస్తానంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గద్దెనెక్కాక ఆ సంగతే మర్చిపోయారు. బాబు అధికారంలోకి వచ్చే నాటికి బ్యాంకుల్లో డ్వాక్రా సంఘాల రుణాలు రూ.14,204 కోట్లు ఉండగా, ఈ నాలుగున్నరేళ్లలో ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. సాక్షాత్తూ రాష్ట్ర మంత్రే అసెంబ్లీలో ఈ నిజాన్ని అంగీకరించారు. రెండేళ్లుగా డ్వాక్రా సంఘాలకు వడ్డీ రాయితీని సైతం ప్రభుత్వం ఎగ్గొట్టింది. మహిళలను నమ్మించి, దగా చేసిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలు తరుముకొస్తుండడంతో మోసాన్ని మరిపించేందుకు కొత్త డ్రామాకు తెరతీశారు. 

శిక్షణ ముసుగులో సంతకాల తంతు 
రాష్ట్రంలో డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేశామని నమ్మబలుకుతున్న చంద్రబాబు ప్రభుత్వం ఇందుకు సాక్ష్యంగా డ్వాక్రా సంఘాల మహిళల నుంచి బలవంతంగా సంతకాలు సేకరిస్తోంది. ‘డ్వాక్రా సంఘాల్లో మహిళలకు ఆర్థిక అక్షరాస్యతపై శిక్షణ’ పేరుతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) వేర్వేరుగా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వం ద్వారా ముందుగా శిక్షణ పొందిన దాదాపు 2,000 మంది మహిళలు ప్రతిరోజూ పది డ్వాక్రా సంఘాలకు చెందిన 100 మంది సభ్యులతో సమావేశమై, రాష్ట్ర ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో ఎన్నో అద్భుతాలు సాధించిందంటూ వివరిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన పత్రాలపై ప్రతి మహిళతో సంతకాలు చేయిస్తున్నారు. మహిళలను సమీకరించి సంతకాలు చేయించాల్సిన బాధ్యతను ముందుగా శిక్షణ పొందిన వారికి కట్టబెట్టారు. ‘‘ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం– ఇట్లు సంఘ సభ్యులు’’ అని రాసి ఉన్న పత్రంపై డ్వాక్రా మహిళా సంఘాల్లోని సభ్యులందరి నుంచి సంతకాలు తీసుకుంటున్నారు. మహిళలందరూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే ప్రక్రియను వీడియోలో చిత్రీకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డ్వాక్రా సంఘాలకు ఈ శిక్షణా (సంతకాల సేకరణ) కార్యక్రమాలు రెండు రోజుల క్రితం మొదలయ్యాయి. రుణాలను మాఫీ చేయకుండా, కనీసం వడ్డీ రాయితీ కూడా ఇవ్వకుండా ఇన్నాళ్లూ మోసం చేసి, ఇప్పుడు తమను వంచించేందుకు కుట్ర పన్నుతున్న సర్కారు తీరును చూసి డ్వాక్రా మహిళలంతా విస్తుపోతున్నారు. 

‘జీరో వడ్డీ’పైనా మాయమాటలు 
డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు చెల్లించాల్సిన జీరో వడ్డీ డబ్బులను ప్రభుత్వం ఇప్పటికీ చెల్లించలేదు. అయినా తమకు జీరో వడ్డీ డబ్బులు ముట్టాయంటూ మహిళల నుంచి సంతకాలు సేకరించేలా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు అధికారులు కొన్ని పత్రాలను సిద్ధం చేశారు. జీరో వడ్డీ పథకంలో డ్వాక్రా సంఘాలకు 2016 సెప్టెంబరు నుంచి ఇప్పటివరకు రెండేళ్ల పాటు చంద్రబాబు ప్రభుత్వం వడ్డీ డబ్బులను బ్యాంకులకు చెల్లించలేదు. డ్వాక్రా మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణ మొత్తంలో 3 శాతం చొప్పున ప్రతినెలా చెల్లిస్తే, దానిపై అయ్యే వడ్డీ ఏ నెలకు ఆ నెల ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించడమే జీరో వడ్డీ పథకం. ప్రభుత్వం బ్యాంకులకు జీరో వడ్డీ డబ్బులు చెల్లించకపోవడంతో ఈ రెండేళ్ల కాలంలోనే డ్వాక్రా మహిళలు దాదాపు రూ.2,200 కోట్ల వడ్డీని బ్యాంకులకు చెల్లించాల్సి వచ్చింది. ఈ డబ్బులను ప్రభుత్వం చెల్లించినట్టు మహిళల నుంచి సంతకాల సేకరించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. 

సంతకాలతో ఏం చేస్తారు? 
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేయలేదని, వడ్డీ రాయితీ సొమ్ము కూడా ఇవ్వలేదని, తమను దగా చేశారని డ్వాక్రా మహిళలు దుమ్మెత్తిపోసే అవకాశం ఉండడంతో టీడీపీ ప్రభుత్వం ముందుగానే జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల ప్రచారంలో ఈ పత్రాలను, వీడియోలను వాడుకోవాలని అధికార పార్టీ పెద్దలు నిర్ణయానికొచ్చినట్లు సమాచారం. ‘‘ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం.. డ్వాక్రా మహిళలంతా సంతోషంగా ఉన్నారు. ఇవిగో.. చూడండి సాక్ష్యాలు. మహిళలే స్వయంగా సంతకాలు పెట్టి ఇచ్చారు’’ అంటూ ఈ పత్రాలను చూపిస్తూ జనం చెవుల్లో పువ్వులు పెడతారన్నమాట!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement