యూనివర్సిటీ : త్వరలో డ్వాక్రా మహిళలు, వీఆర్వోలకు ఐపాడ్లు అందజేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. మంగళవారం జేఎన్‌టీయూఏలో ఎస్కేయూ, జేఎన్‌టీయూ ప్రొఫెసర్లతో స్కిల్ డెవలప్‌మెంట్ అంశంపై జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఏపీలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ ఎగుమతుల వల్ల రూ.65 వేల కోట్ల ఆదాయం వచ్చేదని, ఇప్పుడు రూ.1500 కోట్లకు పడిపోయిందన్నారు. వచ్చే ఐదేళ్లలో ఐటీ నుంచి రూ.30 వేల కోట్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం నుంచి రూ.12 వేల కోట్ల రాబడి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఎస్కేయూ, జేఎన్‌టీయూల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కేంద్రాల్లో ప్రతి విద్యార్థికి రూ.20 వేలు చొప్పున ఖర్చు చేసి వారికి పరిశ్రమల్లో ఉపాధి కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో నూతన పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామిక వేత్తలకు రాయితీలు ఇస్తామన్నారు. విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలకు తావివ్వొద్దని సూచించారు. నైతిక విలువలతో కూడిన కరికులంను రూపొందించాలన్నారు. అనంతరం వర్సిటీల్లో మౌలిక సదుపాయాలు పెంపొందించాలని, అకడమిక్ స్టాఫ్ కళాశాలను ఏర్పాటు చేయాలని, బోధన పోస్టులు భర్తీ చేయాలని ప్రొఫెసర్లు మంత్రిని కోరారు.
కార్యక్రమంలో జేఎన్‌టీయూ వీసీ ఆచార్య కే.లాల్‌కిశోర్, ఫిక్కీ కో-చెర్మైన్ జేఎచౌదరి, కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్, రిజిస్ట్రార్లు ఆచార్య కే.దశరథరామయ్య, ఆచార్య కృష్ణయ్య, ఐటీ శాఖ డెరైక్టర్ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా సమావేశంలో మంత్రిని విద్యార్థి సంఘాల నాయకులు సమస్యలపై నిలదీశారు. ఎస్కేయూలో 150 బోధన పోస్టులు భర్తీ చేయకుండా విద్యార్థుల్లో నైపుణ్యాలు ఎలా పెంపొదిస్తారని ప్రశ్నించారు. న్యాయ పరమైన చిక్కులను ఎదుర్కోవడానికి రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌తో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామన్న హామీ మేరకు వారు ఆందోళన విరమించారు.
డ్వాక్రా మహిళలు, వీఆర్వోలకు ఐపాడ్లు
Published Wed, Dec 3 2014 3:55 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM
Advertisement
Advertisement