JNTUA
-
‘గవర్నర్ గారూ.. మన్నించండి’
అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం ఇన్చార్జ్ వైస్ చాన్సలర్ హెచ్.సుదర్శనరావు స్వామిభక్తిని ప్రదర్శించారు. జేఎన్టీయూఏ నూతన పాలక భవనాన్ని జనవరి 6న రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ చాన్సలర్ హోదాలో ప్రారంభించారు. వర్సిటీలో స్నాతకోత్సవానికి హాజరైన సందర్భంగా ఆయన నూతన భవనాన్ని ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన శిలాఫలకాన్ని భవనం ముందు ఏర్పాటు చేశారు. కాగా.. 2017లో సీఎం చంద్రబాబు వర్చువల్‌గా పరిపాలన భవనం, లెక్చర్ హాల్ కాంప్లెక్స్, ఫార్మసీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇందుకు సంబంధించిన శిలాఫలకం వర్సిటీ క్యాంపస్‌లో అప్పట్లో ఏర్పాటు చేశారు. తాజాగా నూతన పాలక భవనాన్ని గవర్నర్ ప్రారంభించారు. వర్సిటీ చాన్సలర్ హోదాలో గవర్నర్ వచ్చి భవనాన్ని ప్రారంభిస్తే.. ఇన్చార్జ్ వైస్ చాన్సలర్ హెచ్.సుదర్శనరావు ఆ శిలాఫలకాన్ని తొలగించి, సీఎం చంద్రబాబు 2017లో వర్చువల్‌గా భూమి పూజ చేసిన శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఇదే విషయాన్ని మీడియాకు సైతం తెలిపారు. రాష్ట్రంలోనే అత్యున్నత హోదా కలిగిన గవర్నర్‌కు ఇచ్చే మర్యాద ఇదేనా? వర్సిటీ చాన్సలర్ అంటే ఇన్చార్జ్ వైస్ చాన్సలర్‌కు లెక్కలేదా? అని పలువురు విస్మయం వ్యక్తం చేశారు. -
జేఎన్టీయూఏకి ఈఏపీ సెట్ బాధ్యతలు
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఈఏపీ సెట్–2022 బాధ్యతలను అనంతపురం జేఎన్టీయూకి అప్పగించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల నిర్వహించేందుకు చైర్మన్లు, కన్వీనర్లను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి ప్రకటన విడుదల చేశారు. సెట్లు.. చైర్మన్, కన్వీనర్లు ఇలా ఈఏపీ సెట్‌కు చైర్మన్, కన్వీనర్లుగా అనంతపురం జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ జి.రంగజనార్దన , ప్రొఫెసర్ ఎమ్.విజయకుమార్, ఈసెట్‌కు కాకినాడ జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు, ప్రొఫెసర్ కృష్ణమోహన్, ఐసెట్‌కు ఏయూ వీసీ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి, ప్రొఫెసర్ ఎన్.కిశోర్‌బాబు, పీజీ ఈసెట్‌కు ఎస్వీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.రాజారెడ్డి, ప్రొఫెసర్ ఆర్వీఎస్ సత్యనారాయణ, రీసెర్చ్ సెట్‌కు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, ప్రొఫెసర్ డి.అప్పలనాయుడు (ఏయూ), ఎడ్‌సెట్‌కు పద్మావతీ మహిళా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి.జమున, ప్రొఫెసర్ టీజీ అమృతవల్లి, పీజీ సెట్‌కు యోగివేమన వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎమ్.సూర్యకళావతి, ప్రొఫెసర్ ఎన్.నజీర్ అహ్మద్, లాసెట్‌కు పద్మావతీ మహిళా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ డి.జమున, ప్రొఫెసర్ టి.సీతాకుమారిలను నియమించారు. -
జేఎన్టీయూఏలో ర్యాగింగ్ వికృతరూపం
అనంతపురం విద్య: జేఎన్టీయూ (అనంతపురం) ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ రక్కసి వికృతరూపం దాల్చింది. సీనియర్ విద్యార్థులు అర్ధరాత్రి దాకా వెకిలిచేష్టలు.. అలసిపోయేదాకా డ్యాన్సులు.. అడ్డూఅదుపూలేని అకృత్యాలకు పాల్పడటంతో జూనియర్ విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. వీరి ఆగడాలు మితిమీరుతుండటంతో భరించలేకపోయిన బాధితులు ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్‌కు పాల్పడిన 12 మంది కెమికల్, కంప్యూటర్ సైన్సెస్ గ్రూప్ సెకండియర్ విద్యార్థులను సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.సుజాత శనివారం ఉత్తర్వులిచ్చారు. జేఎన్టీయూ(ఏ) చరిత్రలో ఒకేసారి 12 మంది విద్యార్థులపై సస్పెన్షన్ వేటుపడటం ఇదే తొలిసారి. సీనియర్, జూనియర్ విద్యార్థుల హాస్టళ్లు వేర్వేరుగా ఉన్నప్పటికీ ర్యాగింగ్ పేరిట వికృత క్రీడ సాగిస్తున్నారు. జూనియర్లను సీనియర్ విద్యార్థుల హాస్టల్‌కు రప్పించి అర్ధరాత్రి దాకా అర్ధనగ్నంగా డ్యాన్సులు చేయించడంతో పాటు సిగరెట్లు, మద్యం తీసుకొచ్చి ఇవ్వాలని పురమాయిస్తున్నారు. గంటల తరబడి నిల్చునే ఉండాలని కోరడంతో పాటు సీనియర్లు చెప్పింది వినాలంటూ ఇబ్బంది పెడుతున్నారని బాధితులు ఆందోళన చెందుతున్నారు. చర్యలు తీసుకుంటున్నాం ర్యాగింగ్ జరిగినట్లు తెలియగానే శుక్రవారం రాత్రి హాస్టల్‌కు వెళ్లి ఆరా తీశాం. అర్ధరాత్రి ఒంటి గంట వరకు అక్కడే ఉండి విద్యార్థులతో మాట్లాడాం. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవు. ర్యాగింగ్‌కు పాల్పడితే తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. – ప్రొఫెసర్ పి.సుజాత, ప్రిన్సిపాల్, జేఎన్టీయూఏ ఇంజనీరింగ్ కళాశాల -
రబ్బరు రోడ్లు..
అనంతపురం విద్య: సహజ రబ్బరుతో రహదారుల నిర్మాణానికి సంబంధించి విస్తృత పరిశోధనలకు జేఎన్టీయూ(ఏ) వేదిక కానుంది. ఈ క్రమంలో వర్సిటీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో రహదారులు, రోడ్ల నిర్మాణాల్లో నూతన అంశాలపై పరిశోధనల ప్రక్రియ మొదలైంది. రబ్బరును వినియోగించే అంశంపై పరిశోధనలకు జేఎన్టీయూ(ఏ) క్యాంపస్ కళాశాలలో ప్రత్యేక ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు భారత రహదారుల మంత్రిత్వశాఖ అండగా నిలుస్తూ వచ్చే నాలుగేళ్ల కాలానికి రూ.1,75,23,000 మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులిచ్చింది. ఈ ప్రాజెక్ట్‌కు మెంటార్‌గా జేఎన్టీయూ(ఏ) క్యాంపస్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ పీఆర్ భానుమూర్తి వ్యవహరించనున్నారు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ దక్కడంపై వర్సిటీ వీసీ జింకా రంగజనార్దన, రిజిస్ట్రార్ సి.శశిధర్ హర్షం వ్యక్తం చేశారు. -
‘డిజీ’..పత్రాలు పొందడం ఈజీ!
అనంతపురం: డిజీ లాకర్‌ను జేఎన్టీయూ(ఏ) వినూత్న రీతిలో ఉపయోగిస్తోంది. వర్సిటీ జారీ చేసే ప్రతి సర్టిఫికెట్‌ను డిజీ లాకర్లో డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యాన్ని విద్యార్థులకు కల్పించింది. జేఎన్టీయూ(ఏ) అధికారులు పరీక్ష ఫలితాలు ప్రకటించిన తక్షణమే డిజీ లాకర్లోకి సర్టిఫికెట్లు వచ్చేలా ఏర్పాట్లు చేసింది. విద్యార్థి నేరుగా డిజీ లాకర్లో తమ సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించింది. దీంతో విద్యార్థులు ఎక్కడైనా, ఎప్పుడైనా తమ సర్టిఫికెట్లను కళాశాలకు వెళ్లకుండానే పరిశీలించుకోవచ్చు. జేఎన్టీయూ (ఏ) పరిధిలోని వైఎస్సార్ కడప, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన 110 ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ విద్యార్థులు లక్ష మందికి ఇది ఉపయోగకరంగా మారనుంది. తెలుగు రాష్ట్రాల్లో డిజీ లాకర్‌ను అమలు చేస్తోన్న తొలి వర్సిటీగా జేఎన్టీయూ (ఏ) నిలిచింది. నవంబర్ 1, 2021 నుంచి ఈ విధానాన్ని వర్సిటీ ప్రవేశపెట్టింది. లాగిన్ కావడం ఎలా? డిజిటల్ లాకర్లో ఖాతా తెరవడం చాలా సులువు. ఇది పూర్తిగా ఉచితం కూడా. ఆధార్‌కార్డు నంబర్‌తో ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి మనం ఎన్రోల్ అయిన తరువాత అందులో ఎన్ని డాక్యుమెంట్లు అయినా భద్రపరచుకోవచ్చు. అవసరమైనప్పుడు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ విధానంపై సరైన అవగాహన లేకపోవడంతో చాలా మంది సద్వినియోగం చేసుకోవడంలేదు. కేవలం మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకున్న తరహాలోనే డిజీ లాకర్లో ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే చాలు ఎన్ని డాక్యుమెంట్లు అయినా భద్రపరచుకోవచ్చు. ఏమిటీ డిజీ లాకర్? డిజీ లాకర్ అంటే డిజిటల్ లాకర్. ఒకసారి ఇందులో లాగిన్ అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఏ రకమైన డాక్యుమెంట్ అయినా ఇందులో పొందుపరచుకోవచ్చు. డిజీ లాకర్‌ను ఆధార్‌కార్డుతో అనుసంధానం చేస్తే ప్రభుత్వం జారీ చేసే అన్ని రకాల డాక్యుమెంట్లను ఇందులో భద్రపరచుకోవచ్చు. ప్రభుత్వ సంస్థలకు జారీ చేసే డాక్యుమెంట్లు నేరుగా డిజీ లాకర్లోకి వచ్చేస్తాయి. ఆటోమేటిక్‌గా డిజీ లాకర్లోకి వచ్చే డాక్యుమెంట్లు, డేటాతో పాటు మనం అదనంగా డేటా, డాక్యుమెంట్లను కూడా భద్రపరచుకోవచ్చు. ఎప్పుడైనా ఒరిజినల్ డాక్యుమెంట్ పోగొట్టుకున్నట్లయితే వెంటనే డిజీ లాకర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వర్సిటీకి తిరిగే పని ఉండదు ఇంతకాలం ఏదైనా సర్టిఫికెట్ కావాలంటే విద్యార్థి నేరుగా వర్సిటీకి రావాల్సి వచ్చేది. ఇప్పుడు డిజిటలైజేషన్ విధానంతో సర్టిఫికెట్లు అన్నీ అప్లోడ్ చేసే విధానాన్ని ప్రవేశపెట్టాం. దీంతో విద్యార్థి ఏ ప్రాంతంలో ఉంటే అక్కడే నేరుగా సరి్టఫికెట్ డౌన్లోడ్ చేసుకునేలా డిజీ లాకర్ విధానానికి అనుసంధానం చేశాం. – ప్రొఫెసర్ జింకా రంగజనార్దన, వీసీ, జేఎన్టీయూ(ఏ) సర్టిఫికెట్లకు భద్రత విద్యార్థికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని గోప్యంగా డిజీ లాకర్లో దాచుకోవచ్చు. సరి్టఫికెట్లే కాకుండా విలువైన సమాచారాన్ని భద్రపరచుకోవచ్చు. విద్యార్థి శ్రేయస్సు దృష్ట్యా సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టాం. – ప్రొఫెసర్ శశిధర్, రిజిస్ట్రార్, జేఎన్టీయూ(ఏ) మార్కుల జాబితాలన్నీ డిజీ లాకర్లోకి బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఆయా సెమిస్టర్ ఫలితాలు విడుదలైన తక్షణమే మార్క్స్‌కార్డులు డిజీ లాకర్లో అందుబాటులో ఉంటాయి. విద్యార్థి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కేవలం ఒరిజినల్ సర్టిఫికెట్స్ కోసమే కళాశాలకు వెళ్లాల్సి ఉంటుంది. జేఎన్టీయూ (ఏ) డిజీ లాకర్ విధానంలోకి లాగిన్ అయ్యింది. –ప్రొఫెసర్ కేశవ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ -
‘విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు’
సాక్షి, అనంతపురం: వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడుతున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. గురువారం అనంతపురంలోని జేఎన్టీయూలో వైస్ చాన్సలర్ల టెక్ సదస్సును మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల పేద విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డైనమిక్ లీడర్ అని, ఆయన ప్రవేశపెట్టిన అమ్మ ఒడి చారిత్రాత్మక పథకమన్నారు. ఇక విద్యావ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నామని తెలిపారు. రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ద్వారా అధిక ఫీజుల నియంత్రణ చేపడుతామని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో యూనివర్సిటీలు అస్తవ్యస్తం ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. దివంగత వైఎస్సార్, ఎన్టీఆర్ విద్యకు పెద్ద పీట వేశారన్నారు. కానీ చంద్రబాబు పాలనలో యూనివర్సిటీలు అస్తవ్యస్తంగా మారాయని పేర్కొన్నారు. సీఎం జగన్ విద్యాభివృద్ధికి నడుం బిగించారని, ఆయన విద్య వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం శుభపరిణామమని కొనియాడారు. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేందుకు ఇంగ్లిషు మీడియం దోహదపడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు, లక్ష్మీ పార్వతి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, వివిధ రాష్ట్రాలకు చెందిన సాంకేతిక విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లు పాల్గొన్నారు. -
‘టెక్విప్’ పేరుతో దోపిడీ..
సమాజానికే ఆదర్శంగా ఉండాల్సిన అధ్యాపకులు అడ్డదారులు తొక్కుతున్నారు. అధికార దుర్వినియోగంతో అందినకాడికి దోచుకునేందుకు సిద్ధమయ్యారు. ‘టెక్విప్’ కింద జేఎన్టీయూ(ఏ)లో మిగిలినపోయిన నిధులను ‘శిక్షణ’ పేరుతో కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో గత టీడీపీ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఓ వెలుగు వెలిగిన వ్యక్తి కీలక పాత్ర పోషిస్తుండగా.. ఆయనకు వర్సిటీ ఉన్నతాధికారులు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం మూడు వారాల కోర్సు శిక్షణకు ఇప్పటికే రూ.33 లక్షల నిధులు కేటాయించారు. మరో మూడు బ్యాచ్‌ల విద్యార్థులకు ఇలా శిక్షణ ఇచ్చేందుకు రూ.1.20 కోట్ల నిధులు ఖర్చుపెట్టి.. ఇందులో సగం పైగా నొక్కేందుకు సిద్ధమైనట్లు సమాచారం. జేఎన్టీయూ: విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్, కమ్యూనికేషన్స్ స్కిల్స్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌లు, సెమినార్లు, అధ్యాపకులకు డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లు నిర్వహించేందుకు ‘టెక్విప్’–3(టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్) పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జేఎన్టీయూ(ఏ)కు రూ.7 కోట్లు మంజూరు చేశాయి. 2017 ఏప్రిల్‌లో ఈ నిధులు విడుదల కాగా, 2020 మార్చి 31 లోపు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిధుల వినియోగం ఆశించినంత స్థాయిలో జరగలేదు. దీంతో ఎలాగైనా గడువులోగా మొత్తం రూ.7 కోట్ల నిధులను ఖర్చు చేయాలనే ఉద్దేశంతో వర్సిటీ ఉన్నతాధికారులు హడావుడిగా విద్యార్థులకు ‘పైథాన్’ పేరుతో మూడు వారాల శిక్షణ కార్యక్రమం ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం బీటెక్ ఫైనలియర్ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఆ తర్వాత మూడు, రెండు, మొదటి సంవత్సరాల విద్యార్థులకు మార్చి నెలాఖరులోగా శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇందుకోసం రూ.1.20 కోట్ల నిధులు ఖర్చు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. వాస్తవానికి సివిల్, కెమికల్ విభాగం విద్యార్థులకు అవసరం లేకపోయినా ‘పైథాన్’ శిక్షణ ఇస్తున్నారు. అధికార దుర్వినియోగం వాస్తవానికి ‘టెక్విప్’ నిధులను వినియోగించేందుకు గవర్నింగ్ బాడీ అనుమతి తీసుకోవాలి. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సలహాలు ప్రధానం. అయితే జేఎన్టీయూ(ఏ) ఇంజినీరింగ్‌కళాశాలలో నిర్వహిస్తున్న పైథాన్ శిక్షణకు సంబంధించి స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనుమతి తీసుకోలేదు. గత ప్రభుత్వం హయాంలో పెత్తనం చెలాయించిన వ్యక్తి అజమాయిషీలో ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారు. ఆయన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులే ఫ్యాకల్టీలుగా నియమించుకుని నిధులను దండుకుంటున్నారు. ♦ ఒక్కో ఫ్యాకల్టీ గంటన్నర తరగతిలో బోధిస్తే రూ. 3 వేలు ఇస్తున్నారు. ♦ రోజంతా నాలుగు సెషన్లు నిర్వహించాలి. అంటే ఒక్కో రోజుకు ఒక్కో ఫ్యాకల్టీకి రూ. 12 వేలు వేతనం చెల్లిస్తామని నిర్దేశించారు. ♦ ఒక్కో డిపార్ట్మెంట్లో ఒక ఫ్యాకల్టీకి రోజుకు రూ. 12 వేలు చొప్పున .. ఆరు విభాగాల్లో రోజూ రూ. 72 వేల చొప్పున వారంలో ఆరు రోజులకు కలిపి ఫ్యాక్టలీలకే మొత్తం రూ. 4.32 లక్షలు చెల్లించేలా ప్లాన్ సిద్ధం చేశారు. ♦ జనవరి 20న ప్రారంభమైన ‘పైథాన్’ తరగతులు మార్చి 9వతేదీ వరకు తరగతులు కొనసాగనున్నాయి. అప్పటి దాకా మొత్తం 8 వారాల శిక్షణకు కలిపి రూ. 33.12 లక్షల నిధులను ఖర్చు చేయనున్నారు. దొంగ చేతికి తాళాలు గతంలో జేఎన్టీయూ కలికిరి ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాక్టికల్స్ తరగతుల కోసం ప్రతి ఏటా రెండు దఫాలుగా అనంతపురం కళాశాలకు వచ్చేవారు. వీరందరి నుంచి మెస్‌బిల్లులు చలాన్ల రూపంలో కాకుండా నేరుగా నగదు కట్టించుకున్నారు. ఈ మొత్తాన్ని హాస్టల్ ఖాతాకు జమ చేయకుండా అప్పటి హాస్టల్ మేనేజర్ రూ.50 లక్షల మేర స్వాహా చేశారు. ఈ వ్యవహారం బట్టబయలైనా చర్యలు తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అయినా తాజాగా ఆయన్నే రూ.కోట్లు ఖర్చు చేసే ‘టెక్విప్’ కార్యక్రమానికి కోఆర్డినేటర్‌గా నియమించారు. దీంతో ఆయన తన ఇష్టం వచ్చినట్లు నిధులను ఖర్చు చేయడానికి పథకాలు రూపొందిస్తున్నారు. పాలక మండలి అనుమతుల్లేకుండానే.. జేఎన్టీయూ(ఏ) ఇంజినీరింగ్ కళాశాల కీలకమైన ఉన్నతాధికారి సైతం ఓ ప్రింటర్స్ నుంచి రూ.లక్షలు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఆడియో టేపులు బహిర్గతమయ్యాయి. ఇలాంటి వ్యక్తులకు ‘టెక్విప్’ బాధ్యతలు అప్పగించడంతో.. వారంతా శిక్షణ పేరుతో ఈ నిధులను భోంచేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. వాస్తవానికి రూ.5 లక్షల నగదు దాటే ప్రతి పనికీ పాలకమండలి అనుమతి తప్పనిసరి. అయితే ఏకంగా రూ.33.12 లక్షలు ఖర్చు చేయనున్న పైథాన్ శిక్షణ తరగతులకు పాలకమండలి అనుమతి తీసుకోలేదు. కనీసం కళాశాల గవర్నింగ్ బాడీ అనుమతి లేకుండా నిధుల వినియోగానికి నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ‘టెక్విప్’ కోఆర్డినేటర్‌గా ఉన్న ఉన్నతాధికారిపై గతంలో అవినీతి ఆరోపణలు ఉండడం, గత టీడీపీ ప్రభుత్వం హయాంలో స్కిల్‌డెవలప్‌మెంట్ స్పెషల్ సెక్రెటరీగా పనిచేసిన వారి ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు నిర్వహించడంపై విద్యార్థులూ పెదవి విరుస్తున్నారు. పరిశీలిస్తాం ‘పైథాన్’ శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన పలు అంశాలపై ఆరా తీస్తున్నాం. అన్ని వివరాలను పరిశీలించి అధికార దుర్వినియోగం చేశారా... లేదా అనే కోణంలో విచారణ చేపడతాం. ఆ తర్వాత తగు చర్యలు తీసుకుంటాం.– ఎం.విజయకుమార్,రిజిస్ట్రార్, జేఎన్టీయూ(ఏ) -
విలవిల.. వేతన గోల
జేఎన్టీయూ అనంతపురం ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థుల నిర్వహణ హాస్టల్స్ ( స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్) విద్యార్థులు విలవిల్లాడుతున్నారు. క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్ విద్యార్థుల నుంచి మెస్ బిల్లుల రూపంలో వసూలు చేసి, తాత్కాలిక ఉద్యోగుల వేతనాలకు సర్దుబాటు చేస్తున్నారు. స్టూడెంట్ మేనేజ్మెంట్హాస్టల్స్ కాబట్టి ఉద్యోగుల జీతాలను విద్యార్థులే భరించాలని జేఎన్టీయూ అనంతపురం అధికారులు అనాలోచిత నిర్ణయాలు అమలు చేస్తుండంతో విద్యార్థులపై పెనుభారం పడుతోంది. ఉద్యోగులకు కూడా చాలీచాలని జీతం అందుతుండడంతో అవస్థలు పడుతున్నారు. అనంతపురం : జేఎన్టీయూ అనంతపురం క్యాంపస్‌లో శిల్ప,అజంతా, అమరావతి, ఎల్లోరా, లేపాక్షి, రత్నసాగర్, తక్షశిల, నలంద హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో 2 వేల మంది బీటెక్, ఎంటెక్ విద్యార్థులు ఉంటున్నారు. మొత్తం 26 మంది శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులు 116 మంది తాత్కాలిక ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ 116 మంది ఉద్యోగులు గత రెండు దశాబ్దాల నుంచి పని చేస్తున్నారు. అప్పటి నుంచి చాలీచాలని వేతనాలు చెల్లిస్తున్నారు. తాజాగా వీరు రూ.6 వేలు జీతాన్ని అందుకుంటున్నారు. ఈ మొత్తం కనీస అవసరాలకు సైతం సరిపోలేదని వాపోతున్నారు. దీంతో జీతాల పెంపుకు విధులు బహిష్కరించారు. తమకు జీతాలు పెంపుదల చేయాలని, గతంలో ఇస్తున్న విధంగా విద్యార్థుల నుంచి కాకుండా నేరుగా వర్సిటీనే జీతాలు చెల్లించాలనే ప్రధాన డిమాండ్లతో ఆందోళన బాట పట్టారు. విద్యార్థులపై మోయలేని భారం : జేఎన్టీయూఏ విద్యార్థుల నిర్వహణ హాస్టల్ (స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్) ఉద్యోగులకు చాలీచాలని జీతాలు చెల్లిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఒకొక్కరి నుంచి ఏడాదికి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. విద్యార్థులపై భారం పడుతోంది. ఈ మొత్తాన్ని మెస్ బిల్లుల్లో కలిపి కట్టించుకుంటున్నారు. అయితే హాస్టల్స్‌లో 74 పర్మినెంట్ ఉద్యోగాలను భర్తీ చేశామని ప్రభుత్వం నుంచి బ్లాక్‌గ్రాంట్ నిధులను మంజూరు చేయించుకుంటున్నారు. రూ.కోట్లు నిధులు ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఫలితంగా విద్యార్థులపై మోయలేని భారం పడుతోంది. నయ వంచన : హాస్టల్ ఉద్యోగులకు జీతా లు చెల్లిస్తున్నామని ప్రభుత్వం నుంచి బ్లాక్ గ్రాంట్ నిధులు మంజూరు చేసి ఓ వైపు ప్రభుత్వాన్ని , విద్యార్థుల నుంచి ఉద్యోగులకు జీతాలు వసూలు చేసి చెల్లించి విద్యార్థులను, ఏళ్ల తరబడి ఉద్యోగులను వెట్టిచాకిరి చేయించుకుంటూ ఉద్యోగులను ఇలా నయవంచన చేశారు. జేఎన్టీయూ అనంతపురం ఉన్నతాధికారులు నిర్ణయాలతో ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థులకు తీరని వేదన హాస్టల్ ఉద్యోగులు 116 మంది నిరవధిక సమ్మెలో పాల్గొనడంతో విద్యార్థులు అవస్థ పడుతున్నారు. విద్యార్థులే నేరుగా కూరగాయలు కొనుగోలు చేసి, భోజనం వండుకోవాల్సి వచ్చింది. 26 నుంచి బీటెక్ విద్యార్థులకు సెమిస్టర్ పరీ క్షలు ప్రారంభం కానుండడంతో విద్యార్థులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులు బయటకు వెళ్లి భోజనం చేసి పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. శ్వేత పత్రం విడుదల చేయాలి హాస్టల్ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నట్లు తపుడు సమచారం ఇచ్చి నిధులు తెప్పించుకున్నారు. ఈ నిధులను ఏఏ అవసరాలకు వినియోగించారు? ఎంత మొత్తం నిధులు విడుదలయ్యాయి? విద్యార్థుల నుంచి ఉద్యోగులకు చెల్లించిన జీతం మొత్తం? తదితర అంశాలపై జేఎన్టీయూ అనంతపురం అధికారులు శ్వేత పత్రం విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఏడాదికి ఒక్కో విద్యార్థి అదనంగా రూ.10 వేలకు పైగానే ఉద్యోగుల జీతాల రూపంలో చెల్లిస్తున్నామని ఆవేదన చెందుతున్నారు. రూ.కోట్లు నిధులకు జవాబుదారీతనం వహించి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. -
21న ఎంటెక్ స్పాన్సర్డ్ సీట్లకు కౌన్సెలింగ్
జేఎన్టీయూ: జేఎన్టీయూ అనంతపురం పరిధిలోని జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల, ఓటీఆర్‌ఐలో ఎంటెక్ ,ఎంఫార్మసీ స్పాన్సర్డ్ సీట్లకు సంబంధించి ఈనెల 21న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్ తెలిపారు. ఎంటెక్‌లో రిఫ్రిజిరేషన్స్ అండ్ ఎయిర్ కండీషనింగ్, ఎనర్జీ సిస్టమ్స్, ప్రొడక్షన్ డిజైన్, అడ్వాన్స్డ్ ఇంటర్నల్ కంబ్యూజన్ ఇంజిన్స్, క్యాడ్, క్వాలిటీ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చురింగ్ సిస్టమ్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ సిస్టమ్స్, వీఎస్ఎల్ఐ డిజైన్స్, ఎంబీడెడ్ సిస్టమ్స్, పవర్ అండ్ ఇండస్ట్రియల్ డ్రైవ్స్, కంట్రోల్ పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్, నానో టెక్నాలజీ (జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల), ఫార్మాసూటికల్ అనాలసిస్ (ఓటీఆర్‌ఐ)లో సీట్లు భర్తీ చేస్తారు. జేఎన్టీయూ అనంతపురం పాలకభవనంలో కౌన్సెలింగ్ జరగనుంది. -
ఏపీ పీజీ ఈసెట్ కౌన్సెలింగ్ తేదీలు ఖరారు
జేఎన్టీయూ: ఏపీ పీజీ ఈసెట్–2017కి సంబంధించి కౌన్సెలింగ్ తేదీలు ఖరారు చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ విజయకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. జేఎన్టీయూ అనంతపురంలోని పాలక భవనంలో ఈనెల 27, 28 తేదీల్లో జీ–ప్యాట్, గేట్ అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. సెప్టెంబర్ 1 నుంచి 7 వరకూ ఏపీ పీజీ ఈసెట్ అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన చేస్తామన్నారు. ప్రత్యేక కేటగిరి వారు కూడా జేఎన్టీయూ అనంతపురంలోనే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలన్నారు. -
డ్వాక్రా మహిళలు, వీఆర్వోలకు ఐపాడ్లు
యూనివర్సిటీ : త్వరలో డ్వాక్రా మహిళలు, వీఆర్వోలకు ఐపాడ్లు అందజేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. మంగళవారం జేఎన్టీయూఏలో ఎస్కేయూ, జేఎన్టీయూ ప్రొఫెసర్లతో స్కిల్ డెవలప్మెంట్ అంశంపై జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఏపీలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ ఎగుమతుల వల్ల రూ.65 వేల కోట్ల ఆదాయం వచ్చేదని, ఇప్పుడు రూ.1500 కోట్లకు పడిపోయిందన్నారు. వచ్చే ఐదేళ్లలో ఐటీ నుంచి రూ.30 వేల కోట్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం నుంచి రూ.12 వేల కోట్ల రాబడి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఎస్కేయూ, జేఎన్టీయూల్లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కేంద్రాల్లో ప్రతి విద్యార్థికి రూ.20 వేలు చొప్పున ఖర్చు చేసి వారికి పరిశ్రమల్లో ఉపాధి కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో నూతన పరిశ్రమలు స్థాపించేందుకు పారిశ్రామిక వేత్తలకు రాయితీలు ఇస్తామన్నారు. విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలకు తావివ్వొద్దని సూచించారు. నైతిక విలువలతో కూడిన కరికులంను రూపొందించాలన్నారు. అనంతరం వర్సిటీల్లో మౌలిక సదుపాయాలు పెంపొందించాలని, అకడమిక్ స్టాఫ్ కళాశాలను ఏర్పాటు చేయాలని, బోధన పోస్టులు భర్తీ చేయాలని ప్రొఫెసర్లు మంత్రిని కోరారు. కార్యక్రమంలో జేఎన్టీయూ వీసీ ఆచార్య కే.లాల్‌కిశోర్, ఫిక్కీ కో-చెర్మైన్ జేఎచౌదరి, కలెక్టర్ సొలమన్ ఆరోగ్యరాజ్, రిజిస్ట్రార్లు ఆచార్య కే.దశరథరామయ్య, ఆచార్య కృష్ణయ్య, ఐటీ శాఖ డెరైక్టర్ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా సమావేశంలో మంత్రిని విద్యార్థి సంఘాల నాయకులు సమస్యలపై నిలదీశారు. ఎస్కేయూలో 150 బోధన పోస్టులు భర్తీ చేయకుండా విద్యార్థుల్లో నైపుణ్యాలు ఎలా పెంపొదిస్తారని ప్రశ్నించారు. న్యాయ పరమైన చిక్కులను ఎదుర్కోవడానికి రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌తో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామన్న హామీ మేరకు వారు ఆందోళన విరమించారు.