విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
సాక్షి, అనంతపురం: వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెడుతున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. గురువారం అనంతపురంలోని జేఎన్టీయూలో వైస్ చాన్సలర్ల టెక్ సదస్సును మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ వల్ల పేద విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డైనమిక్ లీడర్ అని, ఆయన ప్రవేశపెట్టిన అమ్మ ఒడి చారిత్రాత్మక పథకమన్నారు. ఇక విద్యావ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నామని తెలిపారు. రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ద్వారా అధిక ఫీజుల నియంత్రణ చేపడుతామని పేర్కొన్నారు.
చంద్రబాబు పాలనలో యూనివర్సిటీలు అస్తవ్యస్తం
ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. దివంగత వైఎస్సార్, ఎన్టీఆర్ విద్యకు పెద్ద పీట వేశారన్నారు. కానీ చంద్రబాబు పాలనలో యూనివర్సిటీలు అస్తవ్యస్తంగా మారాయని పేర్కొన్నారు. సీఎం జగన్ విద్యాభివృద్ధికి నడుం బిగించారని, ఆయన విద్య వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం శుభపరిణామమని కొనియాడారు. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేందుకు ఇంగ్లిషు మీడియం దోహదపడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు, లక్ష్మీ పార్వతి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, వివిధ రాష్ట్రాలకు చెందిన సాంకేతిక విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment