ఉద్యోగుల సమ్మెతో విద్యార్థులకు తప్పని తిప్పలు
జేఎన్‌టీయూ అనంతపురం ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థుల నిర్వహణ హాస్టల్స్ ( స్టూడెంట్ మేనేజ్‌మెంట్ హాస్టల్) విద్యార్థులు విలవిల్లాడుతున్నారు. క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్ విద్యార్థుల నుంచి మెస్ బిల్లుల రూపంలో వసూలు చేసి, తాత్కాలిక ఉద్యోగుల వేతనాలకు సర్దుబాటు చేస్తున్నారు. స్టూడెంట్ మేనేజ్‌మెంట్‌హాస్టల్స్ కాబట్టి ఉద్యోగుల జీతాలను విద్యార్థులే భరించాలని జేఎన్‌టీయూ అనంతపురం అధికారులు అనాలోచిత నిర్ణయాలు అమలు చేస్తుండంతో విద్యార్థులపై పెనుభారం పడుతోంది. ఉద్యోగులకు కూడా చాలీచాలని జీతం అందుతుండడంతో అవస్థలు పడుతున్నారు.
అనంతపురం : జేఎన్‌టీయూ అనంతపురం క్యాంపస్‌లో శిల్ప,అజంతా, అమరావతి, ఎల్లోరా, లేపాక్షి, రత్నసాగర్, తక్షశిల, నలంద హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో 2 వేల మంది బీటెక్, ఎంటెక్ విద్యార్థులు ఉంటున్నారు. మొత్తం 26 మంది శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులు 116 మంది తాత్కాలిక ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ 116 మంది ఉద్యోగులు గత రెండు దశాబ్దాల నుంచి పని చేస్తున్నారు. అప్పటి నుంచి చాలీచాలని వేతనాలు చెల్లిస్తున్నారు. తాజాగా వీరు రూ.6 వేలు జీతాన్ని అందుకుంటున్నారు. ఈ మొత్తం కనీస అవసరాలకు సైతం సరిపోలేదని వాపోతున్నారు. దీంతో జీతాల పెంపుకు విధులు బహిష్కరించారు. తమకు జీతాలు పెంపుదల చేయాలని, గతంలో ఇస్తున్న విధంగా విద్యార్థుల నుంచి కాకుండా నేరుగా వర్సిటీనే జీతాలు చెల్లించాలనే ప్రధాన డిమాండ్‌లతో ఆందోళన బాట పట్టారు.
విద్యార్థులపై మోయలేని భారం : జేఎన్‌టీయూఏ విద్యార్థుల నిర్వహణ హాస్టల్ (స్టూడెంట్ మేనేజ్‌మెంట్ హాస్టల్) ఉద్యోగులకు చాలీచాలని జీతాలు చెల్లిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఒకొక్కరి నుంచి ఏడాదికి రూ.10 వేలు వసూలు చేస్తున్నారు. విద్యార్థులపై భారం పడుతోంది. ఈ మొత్తాన్ని మెస్ బిల్లుల్లో కలిపి కట్టించుకుంటున్నారు. అయితే హాస్టల్స్‌లో 74 పర్మినెంట్ ఉద్యోగాలను భర్తీ చేశామని ప్రభుత్వం నుంచి బ్లాక్‌గ్రాంట్ నిధులను మంజూరు చేయించుకుంటున్నారు. రూ.కోట్లు నిధులు ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు. ఫలితంగా విద్యార్థులపై మోయలేని భారం పడుతోంది.
నయ వంచన : హాస్టల్ ఉద్యోగులకు జీతా లు చెల్లిస్తున్నామని ప్రభుత్వం నుంచి బ్లాక్ గ్రాంట్ నిధులు మంజూరు చేసి ఓ వైపు ప్రభుత్వాన్ని , విద్యార్థుల నుంచి ఉద్యోగులకు జీతాలు వసూలు చేసి చెల్లించి విద్యార్థులను, ఏళ్ల తరబడి ఉద్యోగులను వెట్టిచాకిరి చేయించుకుంటూ ఉద్యోగులను ఇలా నయవంచన చేశారు. జేఎన్‌టీయూ అనంతపురం ఉన్నతాధికారులు నిర్ణయాలతో ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు.
విద్యార్థులకు తీరని వేదన
హాస్టల్ ఉద్యోగులు 116 మంది నిరవధిక సమ్మెలో పాల్గొనడంతో విద్యార్థులు అవస్థ పడుతున్నారు. విద్యార్థులే నేరుగా కూరగాయలు కొనుగోలు చేసి, భోజనం వండుకోవాల్సి వచ్చింది. 26 నుంచి బీటెక్ విద్యార్థులకు సెమిస్టర్ పరీ క్షలు ప్రారంభం కానుండడంతో విద్యార్థులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులు బయటకు వెళ్లి భోజనం చేసి పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.
శ్వేత పత్రం విడుదల చేయాలి
హాస్టల్ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నట్లు తపుడు సమచారం ఇచ్చి నిధులు తెప్పించుకున్నారు. ఈ నిధులను ఏఏ అవసరాలకు వినియోగించారు? ఎంత మొత్తం నిధులు విడుదలయ్యాయి? విద్యార్థుల నుంచి ఉద్యోగులకు చెల్లించిన జీతం మొత్తం? తదితర అంశాలపై జేఎన్‌టీయూ అనంతపురం అధికారులు శ్వేత పత్రం విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఏడాదికి ఒక్కో విద్యార్థి అదనంగా రూ.10 వేలకు పైగానే ఉద్యోగుల జీతాల రూపంలో చెల్లిస్తున్నామని ఆవేదన చెందుతున్నారు. రూ.కోట్లు నిధులకు జవాబుదారీతనం వహించి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment