సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలలో ఉండే మరుగుదొడ్లను శుభ్రం చేసే పనులు చేసిన డ్వాక్రా మహిళలకు వేతన బాకీలను చెల్లించడానికి రూ. 65 కోట్లు ఈ ఏడాది జనవరి నెలలోనే విడుదల అయ్యాయి.. కానీ ఆ డబ్బులు మాత్రం ఆ పనులు చేసిన మహిళలకు ఇప్పటి వరకు చేరలేదు. ఈ నిధులను ఎన్నికల ముందు చంద్రబాబు ప్రకటించిన కొన్ని హామీలకు విడుదల చేసిన నిధులను కూడా ప్రభుత్వ పెద్దలు మళ్లించేశారట. రాష్ట్రంలో 42 వేల దాకా ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, అందులో 27 వేల పాఠశాలలో మరుగుదొడ్లను రోజు వారీ శుభ్రం చేసే పనులను ఆయా గ్రామాల్లో డ్వాక్రా మహిళలకు అప్పగించారు. ప్రాధమిక పాఠశాలలో ఉన్న మరుగుదొడ్లు కడిగే వారికి నెలకు రూ. 2 వేల చొప్పున, ప్రాధమికోన్నత పాఠశాలలో పనిచేసిన వారికి నెలకు రూ. 2,500, హైస్కూల్‌లో పనిచేసే వారికి రూ. 4,000 చెల్లించే ఒప్పందంతో డ్వాక్రా మహిళలను ఆ బాధ్యతల్లో నియమించారు.
డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలనే ఆ బాధ్యతల్లో ఎక్కువగా నియమించారు. ప్రభుత్వ పాఠశాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సర్వశిక్షా అభియాన్ పథకం ద్వారా దేశంలో అన్ని రాష్ట్రాలకు ప్రత్యేకంగా నిధులు అందుతుంటాయి. మరుగుదొడ్లను శుభ్రం చేసినందుకు ఆ పనిచేసిన డ్వాక్రా మహిళలకు పాఠశాల విద్యా శాఖ కేంద్రం నుంచి అందే సర్వ‡శిక్షాఅభియాన్ నిధుల నుంచి డబ్బులు చెల్లిస్తూ ఉంటుంది. గత రెండు ఏళ్ల పాటు ఆ పనులు చేసినందుకు 27 వేల మంది డ్వాక్రా మహిళలకు దాదాపు రూ. 180 కోట్లు చెల్లించాల్సి ఉంది. మొత్తం బకాయిల్లో రూ. 65 కోట్లను సర్వశిక్షాఅభియాన్ పథకం ద్వారా అందిన నిధుల నుంచి చెల్లించడానికి రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ఈ ఏడాది జనవరిలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)కు విడుదల చేసింది.
అయితే, ఆ నిధులను సెర్ప్ చేరకుండానే ఆ నిధులను చంద్రబాబు ప్రకటించిన ఎన్నికల పథకాలకు ఆర్థికశాఖ మళ్లించిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మరోపక్క చేసిన పనికి రెండేళ్లుగా డబ్బులు అందక డ్వాక్రా మహిళలు మండల కమ్యూనిటీ కోఆర్డినేట్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అక్కడ ఉన్న అధికారులు రేపూ మాపూ అంటూ తిప్పుకుంటున్నారు గానీ, ఎప్పుడు ఆ డబ్బులు చెల్లిస్తారన్న విషయం ఆ అధికారులూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారని సంబంధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దారి మళ్లిన డ్వాక్రా మహిళల నిధులు
Published Sun, May 12 2019 4:22 AM | Last Updated on Sun, May 12 2019 4:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment