
సీఎం ప్రసంగం మధ్యలోనే వెళ్లిపోతున్న మహిళలు, కంప్యూటర్ గదిలో ఆపరేటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు
తనకల్లు: పసుపు–కుంకుమ డబ్బులు ఇస్తామని చెప్పి పిలిపించి తీరా ఇక్కడికొచ్చాక టీవీలో చంద్రబాబు ప్రసంగం చూపిస్తారా? అంటూ మహిళా సంఘాల సభ్యులు వెలుగు అధికారులపై మండిపడ్డారు. పసుపు–కుంకుమ డబ్బులు ఎప్పుడిస్తారో చెప్పాలంటూ వాగ్వాదానికి దిగారు. సీఎం చంద్రబాబునాయుడు పసుపు–కుంకుమ రెండో విడతపై టీవీలో డ్వాక్రా సభ్యులనుద్దేశించి మాట్లాడే కార్యక్రమం ఉండటంతో శుక్రవారం స్థానిక వెలుగు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయం చెబితే డ్వాక్రా సభ్యులు రారని భావించిన వెలుగు అధికారులు పుసుపు–కుంకుమ డబ్బులు ఇస్తారని చెప్పి పిలిపించారు. తీరా ఇక్కడికి వచ్చాక టీవీలో చంద్రబాబు ప్రసంగం చూపించేందుకే పిలిపించారని తెలియడంతో మహిళలు వారిపై మండిపడ్డారు. ప్రభుత్వం పసుపు – కుంకుమ పథకాన్ని కేవలం ప్రచారానికే వాడుకుంటోందని, వాస్తవానికి చాలా గ్రూపులకు డబ్బులు జమ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎంతమందికి డబ్బులు వచ్చాయో చూపాలంటూ కంప్యూటర్ ఆపరేటర్ గదిలోకి దూసుకెళ్లారు. దీంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. మీరు కూర్చుంటే అన్ని వివరాలు చెబుతామని అధికారులు పదేపదే కోరినా మహిళలు ఏ మాత్రం పట్టించుకోకుండా సీఎం ప్రసంగం మధ్యలోనే ఇంటిదారి పట్టారు.
ఏపీఎంపై మండిపడ్డ సభ్యులు
ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు ఏపీఎం సూరిపై మండిపడ్డారు. పసుపు – కుంకుమ డబ్బులడిగితే వెలుగు అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదన్నారు. అకౌంట్లో జమ అయ్యిందని చెబితే బ్యాంకుకు వెళ్లి చూస్తే ఒక్క రుపాయి కూడా జమ కాలేదన్నారు. సమావేశానికి వస్తే పసుపు – కుంకుమ డబ్బులు ఇస్తామని చెబితే ఇక్కడికి వచ్చామని, కానీ చంద్రబాబు ప్రసంగం చూపించి ఇళ్లకు పొమ్మంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment