
‘నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్’ చట్టంలో ‘గిఫ్ట్ చెక్’ నిబంధనలు
విజయనగరంఅర్బన్: సొమ్ములు ఉచితంగా ఇస్తున్నారని... చెక్ అయితే ఏమిలే తీసుకుంటే పోలా.. అనుకుంటే బుక్కయినట్టే. ఉచితంగా ఇస్తే.. ఏదైనా తీసుకోవచ్చు... కానీ బ్యాంక్ చెక్ రూపంలో సొమ్ము తీసుకున్నపుడు జాగ్రత్తగా నిబంధనలు పరిశీలించాలి.. లేకపోతే ఆ ఉచితమే అప్పై కూర్చుంటుందని చెక్‌కు సంబంధించిన హక్కుల చట్టం చెబుతోంది. ‘నెగోషిబుల్ ఇన్‌స్ట్రుమెంట్’ చట్టంలో ఉన్న నిబంధనలు పరిశీలిస్తే పలు అంశాలు తెలుస్తాయి. చెక్ రూపంలో చేసిన లావాదేవీలకు చట్టపరంగా భద్రతతో పాటు మోసగాళ్లకు వెసులుబాట్లు ఉన్నాయని తెలుస్తోంది. ఎవరైనా ఉచితంగా సొమ్మును చెక్ రూపంలో ఇచ్చి అది చెల్లుబాటు కావాలంటే ‘గిఫ్ట్ చెక్’ అథారిటీగా ఇవ్వాలి. అలా ఇవ్వకుండా సాధారణ చెక్‌గా ఇస్తే ఎన్‌ఐ చట్టం ప్రకారం ఆ సొమ్ము ఉచితంగా పరిగణలోకి రాదు. చెక్ ఇచ్చే వారు ఎప్పుడైనా ఆ సొమ్మును తిరిగి ఇమ్మని చట్టబద్ధంగా క్‌లైమ్ చేసుకోవచ్చు.
అనుమానాలెన్నో..?
తాజాగా టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా సభ్యులకు చెక్‌లు మంజూరు చేసింది. చెక్ ఇష్యూయింగ్ ప్రక్రియ అంతా స్థానిక బ్యాంక్ అధికారులకు తెలియకుండా ఆయా బ్యాంకుల రాష్ట్రస్థాయి కార్యాలయాల్లో జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక బ్యాంకుల్లో ఇలాంటి ఉచిత సొమ్ముల చెక్‌లను మంజూరు చేసిపుడు సంబంధిత ప్రొసీడింగ్‌లో ‘గిఫ్ట్ చెక్’ అని తప్పనిసరిగా రాసుకుంటామని పట్టణానికి చెందిన ఒక బ్యాంక్ అధికారి తెలిపారు. ఈ పరిస్థితిలో పొదుపు సంఘాలకు పసుపు కుంకుమ పేరుతో ఇస్తున్న ఉచిత సొమ్ము చెక్‌లపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంక్‌ల ప్రధాన కార్యాలయాల్లో సామూహికంగా మంజూరు చేసిన ఆయా చెక్కులకు ‘గిఫ్ట్ చెక్’గా ప్రొసీడింగ్స్ చేశారో లేదోననే ఆందోళనలో పొదువు మహిళల్లో నెలకొంది.