వార్డెన్ల అవినీతికి ఈ-చెక్ | E-check to warden's corruption | Sakshi
Sakshi News home page

వార్డెన్ల అవినీతికి ఈ-చెక్

Published Sat, Feb 8 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM

E-check to warden's corruption

బాన్సువాడ, న్యూస్‌లైన్ : వసతిగృహాల్లో ఉంటూ చదువుతున్న విద్యార్థుల సంక్షేమాన్ని పట్టించుకోకుండా అక్రమాలకు పాల్పడుతున్న వార్డెన్లకు ప్రభుత్వం ‘ఈ-చెక్’ పెట్టింది. ఎ లాంటి అవకతవకలకు పాల్పడే అవకాశం లేకుండా ‘అన్‌లైన్’ అస్త్రాన్ని ప్రయోగిం చింది. ఇకపై ఈ-హాస్టల్స్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారానే బిల్లు లు సమర్పించిన వారికి చెల్లింపులు జరపాలని, మ్యానువల్‌గా ఇచ్చిన వాటికి నిలిపివేయాలంటూ ట్రెజరీ శాఖను ఉన్నతాధికారులు ఆదేశించారు. హాస్టల్స్ వెబ్‌సైట్‌లో కాకుండా, ట్రెజరీ శాఖ వెబ్‌సైట్‌లో బిల్లులు సమర్పిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 అంతా ఆన్‌లైన్‌లో
 రెండేళ్ళ క్రితమే ఈ-హాస్టల్స్ విధానం ప్రవేశపెట్టినా, పకడ్బందీగా అమలు కాకపోవడంతో ప్రస్తుతం దీన్ని పక్కాగా అమలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లు కొందరు పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టేందుకు కేటాయిస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు రావడంతో వాటికి చెక్ పెట్టాలని అధికారులు నిర్ణయించారు.

వసతి గృహాల్లో ఎంతమంది విద్యార్థులున్నారు.. వారి ఫొటోలు ఇతర వివరాలన్నింటిని ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వసతి గృహానికి సంబంధించిన ముఖ్యమైన విభాగాలను కూడా ఫొటోలను తీసి ఆన్‌లైన్‌లో ఉంచా రు. దీన్ని బట్టి పిల్లలు ఎంతమంది ఉన్నా రు..? ఆ మేరకు సరకులు తెస్తున్నారా..? ఎక్కువగా తెస్తున్నారా..? అనేది కూడా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

 నేరుగా వ్యాపారుల ఖాతాలోకి
 వార్డెన్లు పిల్లలకు భోజనం పెట్టేందుకు కూరగాయల నుంచి ఇతర నిత్యావసర వస్తువులను ఎక్కడ కొనుగోలు చేస్తున్నా రో ఆయా వ్యాపారి వివరాలు, బ్యాంకు ఖాతాలు, ఆధార్‌కార్డు నెంబర్లు ఆన్‌లైన్ లో అధికారులకు తెలపాలి. నెలనెలా తాము కొనుగోలు చేసిన బిల్లులను వెబ్‌సైట్‌లోనే నమోదు చేయాలి. నేరుగా ఆయా వ్యాపారుల ఖాతాలో జమ చేస్తా రు. ఇప్పటికీ కొంత మంది వార్డెన్లు ఆన్‌లైన్‌లో కాకుండా మ్యానువల్‌గా సమర్పిస్తున్నారు.

 ట్రెజరీ శాఖ అధికారులు కూడా ఇలాంటి వారికి చెల్లింపులు జరుపుతూ వస్తున్నారు. మరికొంత మంది వార్డెన్లు తమ బ్యాంకు ఖాతాలను వినియోగించకపోవడంతో అవి రద్దయ్యాయి. ఈ విషయం అధికారులకు చెప్పకుండా ట్రెజరీ శాఖ వెబ్‌సైట్‌కు వెళ్లి అందులో బిల్లులు నమోదు చేస్తున్నారు. ఇలా చేయ డం త ప్పని, ఇలాంటి వాటికి చెల్లింపులు నిలిపివేయాలని, ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆ దేశించారు. బ్యాంకు ఖాతాలు రద్దయిన వార్డెన్ల ఖాతాలను తిరిగి పునరుద్ధరించేలా చర్యలు తీసుకోనున్నారు.

 విద్యార్థులకు తప్పని ‘కడుపు కోత’
 ప్రభుత్వం గత ఏడాది మెనూ ధరలను పెంచగా, ఆకాశన్నంటిన నిత్యావసరాలతో విద్యార్థులు ఒంటిపూట భోజనంతో సరిపెట్టుకొంటున్నారు. మూడు నుంచి ఏడో తరగతి విద్యార్థులకు ప్రతీ ఒక్కరికి నెలకు 750,  ఎనిమిదోతరగతి నుంచి పదోతరగతి వరకు విద్యార్థికి 850 చొప్పున మెస్ చార్జీలను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ లెక్కన ఏడో తరగతి వరకు ఒక్కో విద్యార్థిపై రోజుకు 25, ఆ పై తరగతి విద్యార్థులకు 27 వెచ్చిస్తున్నారు.

ఈ మొత్తంలో రెండు పూటలా ఆహారం, మధ్యలో అల్పాహారం, వారానికి ఆరు సార్లు గుడ్లు, సాయంత్రం స్నాక్స్, ఆదివారం పండ్లు, ఫ్రైడ్ రైస్ ఖచ్చితంగా అందించాలి. వార్డెన్ల అక్రమాల కారణంగా ఇవి అందడం లేదు. బడ్జెట్ పెరిగిపోతుండటంతో ప్రతిరోజూ పాలు, అల్పాహారం, వారానికి ఆరుసార్లు గుడ్లు, ఆదివారం పండ్లు అందించలేమని వార్డెన్లు చేతులెత్తేస్తున్నారు. దీంతో మెనూ నిబంధనలను పక్కన పెట్టేస్తున్నారు. ఆన్‌లైన్ విధానం పక్కగా అమలైతే హాస్టల్ విద్యార్థులకు మేలు జరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement