ఇక ఈ-పేమెంట్ ద్వారా ఉద్యోగుల వేతనాలు
ఇక ఈ-పేమెంట్ ద్వారా ఉద్యోగుల వేతనాలు
Published Fri, Mar 14 2014 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో జరుగుతున్న ఖజానా కార్యకలాపాలు ఇకపై ఆన్‌లైన్ ద్వారా జరగనున్నాయి. ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ విధానాన్ని ప్రవేశ పెట్టారు. అధికారులు ఉపయోగించే అద్దె వాహనాలకు, న్యూస్‌పేపర్లకు చెందినబిల్లులను ఆన్‌లైన్‌లోనే చెల్లించనున్నారు. రాష్ట్రంలో ఈ విధానాన్ని తొలిసారిగా రంగారెడ్డి జిల్లాలో అమలు చేశారు. అక్కడ విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నుంచి ఈ-పేమెంట్ విధానం అమల్లోకి రానుంది. లబ్ధిదారులకు నేరుగా నగదు చెల్లించడం ద్వారా మరింత పారదర్శకత పెరగనుంది. దీనిపై ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులకు ఖజనా శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతి శాఖకు సంబంధించిన డ్రాయింగ్ ఆఫీసర్లు తమ పరిధిలోని వేతనాలు పొందుతున్న ఉద్యోగులు, అద్దెవాహనాల యజమానుల వివరాలు సేకరిస్తున్నారు. ఇకపై వీరికి నేరుగా డబ్బులు అందుతాయి.
ప్రయోజనాలు
ఈ విధానం వల్ల ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. గతంలో ఒక్కసారిగా పెద్దమొత్తంలో
డ్రా చేసి తేవడం వల్ల దొంగల భయం ఉండేది. అలాగే పింఛనర్లు, ఉద్యోగుల వేతనాలు చెక్, డీడీల రూపంలో ఇవ్వడం వల్ల ఒకేసారి డ్రా చేసుకోవలసి వచ్చేది. నేరాలు పెరుగుతున్న రోజుల్లో వాటికి కొంత వరకూ చెక్ పెట్టడానికి నూతన విధానం దోహదపడుతుందని ఖజానా శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఔట్ సోర్సింగ్ సిబ్బందికీ...
జిల్లాలో ఉన్న 22,017 ఉద్యోగులతో పాటూ 15,580 మంది పింఛనర్లకు ఏప్రిల్ నుంచి ఈ-పేమెంట్ విధానం అమల్లోకి రానుంది. దీని కోసం పింఛన్‌దార్లు, ఇతర ఏజెన్సీలకు సంబంధించిన వారు తమ బ్యాంకు ఖాతా సేవింగ్స్ అకౌంట్ నంబరుతో పాటూ ఐఎఫ్‌సీ, ఎంఐసీఆర్ కోడ్ నంబర్లను డ్రాయింగ్ ఆఫీసర్ల ద్వారా ఖజానా కార్యాలయాలకు అందజేయాల్సి ఉంటుంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సదరు ఏజెన్సీలకు ఈ-పేమెంట్ ద్వారానే చెల్లింపులు జరగనున్నాయి.
అక్రమాలకు అడ్డుకట్ట..
ఇతర చెల్లింపుల్లో జరుగుతున్న అక్రమాలకు ఈ విధానం ద్వారా అడ్డుకట్టపడనుంది. వాహనాలకు ప్రభుత్వ కార్యాలయాల నుంచి జరుగుతున్న చెల్లింపులపై ఆరోపణలున్నాయి. కొంతమంది అధికారులు బినామీ పేర్లపై వాహనాలు కొనుగోలు చేసి అద్దె డబ్బులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ఇతర బిల్లులు డ్రా చేసే విషయంలో కూడా అవకతవకలకు చెక్ పడనుంది.
వివరాలు అందజేయాలి....
నిర్ణీత సమయంలో ఖజనా అధికారులకు వివరాలు అందజేయాలి. లేనిపక్షంలో ఎటువంటి బిల్లులు చెల్లించడం జరగదు. ఇప్పటికే ఈ-పేమెంట్ విధానంపై అన్నిశాఖల డ్రాయింగ్ అధికారులకు మార్గదర్శకాలు పంపించాం.
- భోగారావు, జిల్లా ఖజానాధికారి.
Advertisement