E-payment
-
మూడు వారాల్లో 45మంది లక్షాధికారులయ్యారు!
న్యూఢిల్లీ: నోట్ల రద్దు నేపథ్యంలో నగదురహిత చెల్లింపులను ప్రోత్సహించేందుకు రిజర్వ్ బ్యాంక్ ప్రవేశపెట్టిన లక్కీ గ్రాహక్ పథకం వినియోగదారులకు, డిజి ధన్ వ్యాపారి పథకం వ్యాపారులకు సిరులు కురిపిస్తోంది. ఈ పేమెంట్స్ చేయడం ద్వారా గడిచిన మూడు వారాల్లో దేశవ్యాప్తంగా 45 మంది వినియోగదారులు లక్షాధికారులయ్యారు! రిజర్వ్ బ్యాంక్ ప్రాయోజిత ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’(ఎన్పీసీఐ) పథకాల్లో.. ఆయా చెల్లింపులు చేసినప్పుడు వెలువడే లావాదేవీ ఐడీ (ట్రాన్సాక్షన ఐడీ) ఆధారంగా ఆటోమేటిక్ పద్ధతిలో లక్కీ వినియోగదారులు, వ్యాపారులను నజరానాలకు ఎంపిక చేస్తున్నట్లు ఎన్పీసీఐ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎస్.కె.గుప్తా తెలిపారు. నవంబర్ 9 నుంచి ఏప్రిల్ 14 వరకూ డిజిటల్ లావాదేవీలు జరిపిన వినియోగదారులు, వ్యాపారులంతా లక్కీడ్రాకు అర్హులే. డిసెంబర్ 25న మొదటి డ్రా వెలువడిన సంగతి తెలిసిందే. ప్రతి రోజు 15 వేల మంది వినియోగదారులకు రూ.1000 చొప్పున నగదు ప్రోత్సహకం అందిస్తారు. వారానికోసారి రూ. లక్ష, రూ.10 వేలు, రూ. 5 వేల చొప్పున 7 వేల మందికి అవార్డులిస్తారు. అలా మూడు వారాల్లో 45మంది లక్షాధికారులయ్యారు. వీరిలో అత్యధికులు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారే కావడం గమనార్హం. ఇక మెగా అవార్డు కింద ఏప్రిల్ 14న రూ. కోటి, రూ. 50 లక్షలు, రూ. 25 లక్షలు ఇస్తారు. అదే విధంగా వ్యాపారుల కోసం ఉద్దేశించిన డిజి ధన్ యోజన పథకం ద్వారా వారానికోసారి 7 వేల మంది వ్యాపారులకు రూ. 50,000, రూ. 5 వేలు, రూ. 2,500ల చొప్పున అవార్డులతో పాటు ఏప్రిల్ 14న వ్యాపారుల కోసం మెగా డ్రాలో రూ. 50 లక్షలు, రూ. 25 లక్షలు, రూ. 5 లక్షలు ఇస్తారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ), యూఎ్‌సఎ్‌సడీ, ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ (ఏఈపీఎస్), రూపే కార్డుల ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసే వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ప్రైవేటుకార్డులైన వీసా, మాస్టర్ కార్డులు, డిజిటల్ వాలెట్ల ద్వారా చెల్లింపులు చేసేవారికి ఈ పథకం వర్తించదు. కనీసం 50 రూపాయలు, గరిష్ఠంగా రూ.3 వేలు చెల్లింపులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. -
జీతాల ‘ఈ–చెల్లింపు’ కోసం ఆర్డినెన్స్
• కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన దత్తాత్రేయ • చెక్కులు, ఎలక్ట్రానిక్ విధానంలో వేతనాలు జీతాల చెల్లింపునకు కేంద్రం నగదు రహిత మార్గం ఎంచుకుంది. వేతన చెల్లింపుల చట్టం పరిధిలోకి వచ్చే పరిశ్రమల ఉద్యోగులకు జీతాలను చెక్కులు, ఎలక్ట్రానిక్ పద్ధతితో చెల్లించేందుకు ఆ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. న్యూఢిల్లీ: తక్కువ నగదు ఆర్థిక వ్యవస్థ కోసం జీతాల చెల్లింపునకు ప్రభుత్వం నగదు రహిత మార్గం ఎంచుకుంది. వేతన చెల్లింపుల చట్టం పరిధిలోకి వచ్చే పరిశ్రమల ఉద్యోగులకు జీతాలను చెక్కులు, ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించేందుకు ఆ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వేతన చెల్లింపు చట్టం–1936లోని 6వ భాగాన్ని సవరించేందుకు ఇటీవల సవరణ బిల్లు–2016ను పార్లమెంటులో ప్రవేశపెట్టడం తెలిసిందే. కేబినెట్ భేటీ తర్వాత కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ విలేకర్లతో మాట్లాడుతూ.. ‘దీనికి సంబంధించి కేంద్రం, రాష్ట్రాలు పరిశ్రమలను నోటిఫై చేశాక యాజమాన్యాలు జీతాలను నగదుగా చెల్లించే అవకాశం కూడా ఉంటుంది’ అని చెప్పారు. అయితే బిల్లులో మాత్రం.. ఉద్యోగులకు జీతాలను చెక్కు లేదా వారి బ్యాంకు ఖాతాల్లో మాత్రమే జమ చేయాల్సిన పరిశ్రమలేమిటో వివరిస్తూ సంబంధిత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేయొచ్చనడం గమనార్హం. నెల జీతం రూ. 18 వేలకు మించని కొన్ని సంస్థల ఉద్యోగులు ప్రస్తుతం వేతన చెల్లింపుల చట్టపరిధిలో ఉన్నారు. రైల్వే, విమానయాన రవాణ సంస్థలు, గను లు, చమురు క్షేత్రాలు తదితర సంస్థలకు సంబంధించి వేతనాల చెల్లింపు నిబంధనలను కేంద్రం, మిగతా సంస్థల విషయంలో రాష్ట్రాలు మార్చొచ్చు. ⇔ 20కిపైగా సామాజిక, ఆర్థిక సంస్థలకు రద్దు చేసిన భూకేటాయింపులను పునరుద్ధరించాలన్న ప్రతిపాదన కేబినెట్ అజెండాలో చోటుచేసుకుంది. ఈ సంస్థల్లో అత్యధికం ఆరెస్సెస్ అనుబంధ సంస్థలని తెలుస్తోంది. -
జీతాల ‘ఈ–చెల్లింపు’ కోసం ఆర్డినెన్స్!
న్యూఢిల్లీ: నగదు కొరత నేపథ్యంలో కేంద్రం జీతాలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించేందుకు కసరత్తు చేస్తోంది. పరిశ్రమలు, వ్యాపారాల్లో పనిచేసే వారికి జీతాలను చెక్కులు లేదా, ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించడానికి వీలుగా ఆర్డినెన్స్ తీసుకొచ్చే వీలుంది. ‘ఈమేరకు 1936 నాటి వేతన చెల్లింపుల చట్టానికి సవరణ చేసేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చే వీలుంది. ఆ బిల్లును 15న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ఆమోదించడానికి యత్నిస్తారు. మరో రెండు నెలలు వేచి ఉండేందుకు బదులు ఆర్డినెన్స్ తెచ్చి, ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదింపజేసుకోవచ్చు.’ అని అధికార వర్గాలు వెల్లడించాయి. -
ఇక ఈ-పేమెంట్ ద్వారా ఉద్యోగుల వేతనాలు
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో జరుగుతున్న ఖజానా కార్యకలాపాలు ఇకపై ఆన్లైన్ ద్వారా జరగనున్నాయి. ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ విధానాన్ని ప్రవేశ పెట్టారు. అధికారులు ఉపయోగించే అద్దె వాహనాలకు, న్యూస్‌పేపర్లకు చెందినబిల్లులను ఆన్లైన్లోనే చెల్లించనున్నారు. రాష్ట్రంలో ఈ విధానాన్ని తొలిసారిగా రంగారెడ్డి జిల్లాలో అమలు చేశారు. అక్కడ విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నుంచి ఈ-పేమెంట్ విధానం అమల్లోకి రానుంది. లబ్ధిదారులకు నేరుగా నగదు చెల్లించడం ద్వారా మరింత పారదర్శకత పెరగనుంది. దీనిపై ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులకు ఖజనా శాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రతి శాఖకు సంబంధించిన డ్రాయింగ్ ఆఫీసర్లు తమ పరిధిలోని వేతనాలు పొందుతున్న ఉద్యోగులు, అద్దెవాహనాల యజమానుల వివరాలు సేకరిస్తున్నారు. ఇకపై వీరికి నేరుగా డబ్బులు అందుతాయి. ప్రయోజనాలు ఈ విధానం వల్ల ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. గతంలో ఒక్కసారిగా పెద్దమొత్తంలో డ్రా చేసి తేవడం వల్ల దొంగల భయం ఉండేది. అలాగే పింఛనర్లు, ఉద్యోగుల వేతనాలు చెక్, డీడీల రూపంలో ఇవ్వడం వల్ల ఒకేసారి డ్రా చేసుకోవలసి వచ్చేది. నేరాలు పెరుగుతున్న రోజుల్లో వాటికి కొంత వరకూ చెక్ పెట్టడానికి నూతన విధానం దోహదపడుతుందని ఖజానా శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికీ... జిల్లాలో ఉన్న 22,017 ఉద్యోగులతో పాటూ 15,580 మంది పింఛనర్లకు ఏప్రిల్ నుంచి ఈ-పేమెంట్ విధానం అమల్లోకి రానుంది. దీని కోసం పింఛన్‌దార్లు, ఇతర ఏజెన్సీలకు సంబంధించిన వారు తమ బ్యాంకు ఖాతా సేవింగ్స్ అకౌంట్ నంబరుతో పాటూ ఐఎఫ్‌సీ, ఎంఐసీఆర్ కోడ్ నంబర్లను డ్రాయింగ్ ఆఫీసర్ల ద్వారా ఖజానా కార్యాలయాలకు అందజేయాల్సి ఉంటుంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సదరు ఏజెన్సీలకు ఈ-పేమెంట్ ద్వారానే చెల్లింపులు జరగనున్నాయి. అక్రమాలకు అడ్డుకట్ట.. ఇతర చెల్లింపుల్లో జరుగుతున్న అక్రమాలకు ఈ విధానం ద్వారా అడ్డుకట్టపడనుంది. వాహనాలకు ప్రభుత్వ కార్యాలయాల నుంచి జరుగుతున్న చెల్లింపులపై ఆరోపణలున్నాయి. కొంతమంది అధికారులు బినామీ పేర్లపై వాహనాలు కొనుగోలు చేసి అద్దె డబ్బులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ఇతర బిల్లులు డ్రా చేసే విషయంలో కూడా అవకతవకలకు చెక్ పడనుంది. వివరాలు అందజేయాలి.... నిర్ణీత సమయంలో ఖజనా అధికారులకు వివరాలు అందజేయాలి. లేనిపక్షంలో ఎటువంటి బిల్లులు చెల్లించడం జరగదు. ఇప్పటికే ఈ-పేమెంట్ విధానంపై అన్నిశాఖల డ్రాయింగ్ అధికారులకు మార్గదర్శకాలు పంపించాం. - భోగారావు, జిల్లా ఖజానాధికారి.