జీతాల ‘ఈ–చెల్లింపు’ కోసం ఆర్డినెన్స్
• కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన దత్తాత్రేయ
• చెక్కులు, ఎలక్ట్రానిక్ విధానంలో వేతనాలు
జీతాల చెల్లింపునకు కేంద్రం నగదు రహిత మార్గం ఎంచుకుంది. వేతన చెల్లింపుల చట్టం పరిధిలోకి వచ్చే పరిశ్రమల ఉద్యోగులకు జీతాలను చెక్కులు, ఎలక్ట్రానిక్ పద్ధతితో చెల్లించేందుకు ఆ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
న్యూఢిల్లీ: తక్కువ నగదు ఆర్థిక వ్యవస్థ కోసం జీతాల చెల్లింపునకు ప్రభుత్వం నగదు రహిత మార్గం ఎంచుకుంది. వేతన చెల్లింపుల చట్టం పరిధిలోకి వచ్చే పరిశ్రమల ఉద్యోగులకు జీతాలను చెక్కులు, ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించేందుకు ఆ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వేతన చెల్లింపు చట్టం–1936లోని 6వ భాగాన్ని సవరించేందుకు ఇటీవల సవరణ బిల్లు–2016ను పార్లమెంటులో ప్రవేశపెట్టడం తెలిసిందే. కేబినెట్ భేటీ తర్వాత కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ విలేకర్లతో మాట్లాడుతూ.. ‘దీనికి సంబంధించి కేంద్రం, రాష్ట్రాలు పరిశ్రమలను నోటిఫై చేశాక యాజమాన్యాలు జీతాలను నగదుగా చెల్లించే అవకాశం కూడా ఉంటుంది’ అని చెప్పారు.
అయితే బిల్లులో మాత్రం.. ఉద్యోగులకు జీతాలను చెక్కు లేదా వారి బ్యాంకు ఖాతాల్లో మాత్రమే జమ చేయాల్సిన పరిశ్రమలేమిటో వివరిస్తూ సంబంధిత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేయొచ్చనడం గమనార్హం. నెల జీతం రూ. 18 వేలకు మించని కొన్ని సంస్థల ఉద్యోగులు ప్రస్తుతం వేతన చెల్లింపుల చట్టపరిధిలో ఉన్నారు. రైల్వే, విమానయాన రవాణ సంస్థలు, గను లు, చమురు క్షేత్రాలు తదితర సంస్థలకు సంబంధించి వేతనాల చెల్లింపు నిబంధనలను కేంద్రం, మిగతా సంస్థల విషయంలో రాష్ట్రాలు మార్చొచ్చు.
⇔ 20కిపైగా సామాజిక, ఆర్థిక సంస్థలకు రద్దు చేసిన భూకేటాయింపులను పునరుద్ధరించాలన్న ప్రతిపాదన కేబినెట్ అజెండాలో చోటుచేసుకుంది. ఈ సంస్థల్లో అత్యధికం ఆరెస్సెస్ అనుబంధ సంస్థలని తెలుస్తోంది.