మూడు వారాల్లో 45మంది లక్షాధికారులయ్యారు!
న్యూఢిల్లీ: నోట్ల రద్దు నేపథ్యంలో నగదురహిత చెల్లింపులను ప్రోత్సహించేందుకు రిజర్వ్ బ్యాంక్ ప్రవేశపెట్టిన లక్కీ గ్రాహక్ పథకం వినియోగదారులకు, డిజి ధన్ వ్యాపారి పథకం వ్యాపారులకు సిరులు కురిపిస్తోంది. ఈ పేమెంట్స్ చేయడం ద్వారా గడిచిన మూడు వారాల్లో దేశవ్యాప్తంగా 45 మంది వినియోగదారులు లక్షాధికారులయ్యారు! రిజర్వ్ బ్యాంక్ ప్రాయోజిత ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’(ఎన్‌పీసీఐ) పథకాల్లో.. ఆయా చెల్లింపులు చేసినప్పుడు వెలువడే లావాదేవీ ఐడీ (ట్రాన్సాక్షన ఐడీ) ఆధారంగా ఆటోమేటిక్ పద్ధతిలో లక్కీ వినియోగదారులు, వ్యాపారులను నజరానాలకు ఎంపిక చేస్తున్నట్లు ఎన్‌పీసీఐ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎస్.కె.గుప్తా తెలిపారు.
నవంబర్ 9 నుంచి ఏప్రిల్ 14 వరకూ డిజిటల్ లావాదేవీలు జరిపిన వినియోగదారులు, వ్యాపారులంతా లక్కీడ్రాకు అర్హులే. డిసెంబర్ 25న మొదటి డ్రా వెలువడిన సంగతి తెలిసిందే. ప్రతి రోజు 15 వేల మంది వినియోగదారులకు రూ.1000 చొప్పున నగదు ప్రోత్సహకం అందిస్తారు. వారానికోసారి రూ. లక్ష, రూ.10 వేలు, రూ. 5 వేల చొప్పున 7 వేల మందికి అవార్డులిస్తారు. అలా మూడు వారాల్లో 45మంది లక్షాధికారులయ్యారు. వీరిలో అత్యధికులు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారే కావడం గమనార్హం. ఇక మెగా అవార్డు కింద ఏప్రిల్ 14న రూ. కోటి, రూ. 50 లక్షలు, రూ. 25 లక్షలు ఇస్తారు.
అదే విధంగా వ్యాపారుల కోసం ఉద్దేశించిన డిజి ధన్ యోజన పథకం ద్వారా వారానికోసారి 7 వేల మంది వ్యాపారులకు రూ. 50,000, రూ. 5 వేలు, రూ. 2,500ల చొప్పున అవార్డులతో పాటు ఏప్రిల్ 14న వ్యాపారుల కోసం మెగా డ్రాలో రూ. 50 లక్షలు, రూ. 25 లక్షలు, రూ. 5 లక్షలు ఇస్తారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ), యూఎ్‌సఎ్‌సడీ, ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ (ఏఈపీఎస్), రూపే కార్డుల ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసే వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ప్రైవేటుకార్డులైన వీసా, మాస్టర్ కార్డులు, డిజిటల్ వాలెట్ల ద్వారా చెల్లింపులు చేసేవారికి ఈ పథకం వర్తించదు. కనీసం 50 రూపాయలు, గరిష్ఠంగా రూ.3 వేలు చెల్లింపులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.