
రైతులకే రూ.కోటి లీజు ఇవ్వాలి: ఎమ్మెల్యే ఆర్కే
సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణం కోసమని భూమిని సమీకరిస్తున్న ప్రభుత్వం అక్కడి రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.కోటి చొప్పున లీజు కింద 99 ఏళ్ల కాలవ్యవధికి చెల్లించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
ఆయన మంగళవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. మంగళగిరి ప్రాంతంలో ఎకరాకు ఏడాదికి రూ.కోటి చొప్పున 33 సంవత్సరాల లీజుకు అమెరికాకు చెందిన ‘పై డేటా సెంటర్’ అనే సంస్థకివ్వాలని ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్ణయించిందని వివరించారు. ఈ మేరకు పత్రికల్లో వచ్చిన వార్తలను చూపుతూ.. రైతుల అభీష్టానికి భిన్నంగా రాజధాని ప్రాంతంలో వారి భూములను లాక్కుంటున్న చంద్రబాబు విదేశీ సంస్థల మెప్పుకోసం, అడ్డదారిలో సంపాదించుకోవడంకోసం రైతుల భూములను లాక్కోవడం దారుణమన్నారు.
అక్కడి భూములను విదేశీ సంస్థలకు ఎకరాకు రూ.కోటి చొప్పున లీజుకు ఇస్తున్నపుడు.. అదే మొత్తాన్ని రైతులకిచ్చి ప్రతి ఏటా పెరిగే ధరల సూచీ ప్రకారం లీజును పెంచుతూ ఎందుకివ్వకూడదని ప్రశ్నించారు. మంగళగిరిలో స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులే లేరని, 90 శాతం మంది 9.2 ఫారాలు ఇస్తున్నపుడు స్పష్టత లేకుండా అమెరికా కంపెనీకి భూమిని లీజుకు ఎలా ఇస్తారని ఆర్కే ప్రశ్నించారు. చరిత్రలో ఏ రాజూ రైతుల భూములను లాక్కోలేదని, రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కొంటున్న చంద్రబాబు చరిత్రహీనుడుగా మిగిలిపోతారని దుయ్యబట్టారు.