ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు శనివారం డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను కలిశారు.
హైదరాబాద్ : ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు శనివారం డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహను కలిశారు. ఈ సందర్భంగా వారు ఎంసెట్ కౌన్సిలింగ్ను యథావిధిగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎంసెట్ కౌన్సిలింగ్ జరపాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. కాగా ఎంసెట్ కౌన్సిలింగ్కు హాజరు కామంటూ సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహణపై సందిగ్ధత తొలగలేదు.
వాస్తవానికి హైకోర్టు ఆదేశాలు జారీచేయడంతో ఈనెల 19వ తేదీన ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఉంటుందని ఉన్నత విద్యామండలి తేదీలు ప్రకటించిన విషయం తెలిసిందే. సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్ల నమోదు, వాటి సవరణ తదితరాలకు సంబంధించిన తేదీలను కూడా వెల్లడించారు. అయితే, ఈలోపు మళ్లీ సీమాంధ్ర ప్రాంతంలో సమ్మె ఉధృతంగా సాగుతుండటం వల్ల కౌన్సెలింగ్ వాయిదా పడిందంటూ కొన్ని వార్తలు వినవచ్చాయి. కానీ.. అవి సరికాదని, ప్రస్తుతానికి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ యథాతథంగా ఉంటుందని ఉన్నత విద్యామండలి వర్గాలు తెలిపాయి. సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యోగులు సమ్మె చేస్తున్నందువల్ల కౌన్సెలింగ్ ఏమాత్రం సజావుగా సాగుతుందన్న విషయం అనుమానంగానే కనపడుతోంది.