సాక్షి, అనంతపురం : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సమయం రానే వచ్చింది. సుప్రీం కోర్టు జోక్యంతో వారం రోజుల క్రితం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం కానుంది. మేలో ఎంసెట్ రాసి.. ఇప్పటి వరకు కౌన్సెలింగ్ కోసం ఆత్రుతతో ఎదురు చూస్తున్న విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావడానికి ఉవ్విళ్లూరుతున్నారు.
అనంతపురం జేఎన్‌టీయూ పరిధిలో 122 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. గత ఏడాది అడ్మిషన్లు లేని కారణంగా ఐదు మూతపడ్డాయి. ప్రస్తుతం 117 నడుస్తున్నాయి. వీటిలో సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ తదితర బ్రాంచీలతో కలుపుకుని 50,600 సీట్లు ఉన్నాయి. జేఎన్‌టీయూ(ఏ) రీజియన్ పరిధిలో లక్ష మంది విద్యార్థుల వరకు ఎంసెట్ రాశారు. దాదాపు 75 వేల మంది అర్హత సాధించారు. అనంతపురం జిల్లాలో జేఎన్‌టీయూ, ఎస్కేయూ కళాశాలలతో కలుపుకుని 19 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 6,900 సీట్లు ఉన్నాయి. కన్వీనర్ కోటా కింద 4,830 (70 శాతం), మేనేజ్‌మెంటు కోటా కింద 2,070(30 శాతం) సీట్లు భర్తీ చేయనున్నారు. జిల్లాలో 10,800 మంది విద్యార్థులు ఎంసెట్ రాశారు.
7,500 మంది వరకు అర్హత సాధించారు. కన్వీనర్ కోటా సీట్లకు సంబంధించి విద్యార్థులకు నేటి (గురువారం) నుంచి ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. ఇందుకోసం జిల్లాలోని ఎస్కేయూ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లొచ్చు. మొదటిరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి నుంచి ఐదు వేల ర్యాంకు వరకు విద్యార్థులను పిలుస్తారు. ఇందులో భాగంగా జిల్లాలో 400 -500 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఎస్కేయూ హెల్ప్‌లైన్ కేంద్రానికి ప్రొఫెసర్ జే.శ్రీరాములు, పాలిటెక్నిక్ హెల్ప్‌లైన్ కేంద్రానికి ఆ కళాశాల ప్రిన్సిపాల్ సూర్యనారాయణరెడ్డి కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారు.
తరగతుల నిర్వహణ వేళ...
గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ప్రభుత్వం జూలై నాటికి ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియను ముగించి.. ఆగస్టు ఒకటి నుంచి తరగతులు ప్రారంభించాలి. అయితే.. అందుకు విరుద్ధంగా కౌన్సెలింగ్ చేపడుతున్నారు. తరగతులు జరగాల్సిన సమయంలో కౌన్సెలింగ్ చేపడుతుండడం గమనార్హం. ఆగస్టు 7 నుంచి 23 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, నెలాఖరుకు సీట్ల కేటాయింపు పూర్తవుతాయి. రాష్ట్రంలో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభం కానున్నాయి.
ప్రయివేటు యాజమాన్యాల్లో టెన్షన్
ఫీజు రీయింబర్స్‌మెంటుపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొనడంతో ఒకానొక సందర్భంలో ఎంసెట్ కౌన్సెలింగ్ ఇప్పట్లో ఉంటుందా అన్న సందిగ్ధత విద్యార్థుల్లో నెలకొని ఉండింది. ఈ క్రమంలో వందలాది మంది జిల్లాకు చెందిన విద్యార్థులు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరిపోయారు. అక్కడ తరగతులు కూడా ప్రారంభ మయ్యాయి.
ఈ నేపథ్యంలో జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఉన్న సీట్ల కన్నా.. తక్కువ సంఖ్యలో విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే అవకాశముంది. బయటి జిల్లాల నుంచైనా వస్తారా అంటే.. ఆ పరిస్థితి కూడా కన్పించడం లేదు. జిల్లాలో ఒకట్రెండు ప్రయివేటు కళాశాలల్లో మినహా ఏ కాలేజీలోనూ పెద్దగా మౌలిక వసతులు లేవు. అర్హత కల్గిన బోధన సిబ్బంది, ల్యాబ్‌లు సరిగా లేని కళాశాలలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో పొరుగు జిల్లాల విద్యార్థులు ఇక్కడ చేరే పరిస్థితులు తక్కువే. ఈ క్రమంలో కొన్ని కళాశాలల్లో సీట్లు మిగిలిపోయే అవకాశముంది. ఇదే జరిగితే ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న రెండు..మూడు కళాశాలలు మూత దిశగా పయనించవచ్చు.
కౌన్సెలింగ్‌కు వేళాయె!
Published Thu, Aug 7 2014 3:01 AM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM
Advertisement
Advertisement