L.venugopal reddy
-
కౌన్సెలింగ్‌కు వేళాయె!
సాక్షి, అనంతపురం : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సమయం రానే వచ్చింది. సుప్రీం కోర్టు జోక్యంతో వారం రోజుల క్రితం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం కానుంది. మేలో ఎంసెట్ రాసి.. ఇప్పటి వరకు కౌన్సెలింగ్ కోసం ఆత్రుతతో ఎదురు చూస్తున్న విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అనంతపురం జేఎన్టీయూ పరిధిలో 122 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. గత ఏడాది అడ్మిషన్లు లేని కారణంగా ఐదు మూతపడ్డాయి. ప్రస్తుతం 117 నడుస్తున్నాయి. వీటిలో సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ తదితర బ్రాంచీలతో కలుపుకుని 50,600 సీట్లు ఉన్నాయి. జేఎన్టీయూ(ఏ) రీజియన్ పరిధిలో లక్ష మంది విద్యార్థుల వరకు ఎంసెట్ రాశారు. దాదాపు 75 వేల మంది అర్హత సాధించారు. అనంతపురం జిల్లాలో జేఎన్టీయూ, ఎస్కేయూ కళాశాలలతో కలుపుకుని 19 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 6,900 సీట్లు ఉన్నాయి. కన్వీనర్ కోటా కింద 4,830 (70 శాతం), మేనేజ్మెంటు కోటా కింద 2,070(30 శాతం) సీట్లు భర్తీ చేయనున్నారు. జిల్లాలో 10,800 మంది విద్యార్థులు ఎంసెట్ రాశారు. 7,500 మంది వరకు అర్హత సాధించారు. కన్వీనర్ కోటా సీట్లకు సంబంధించి విద్యార్థులకు నేటి (గురువారం) నుంచి ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు. ఇందుకోసం జిల్లాలోని ఎస్కేయూ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రెండు హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లొచ్చు. మొదటిరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి నుంచి ఐదు వేల ర్యాంకు వరకు విద్యార్థులను పిలుస్తారు. ఇందులో భాగంగా జిల్లాలో 400 -500 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఎస్కేయూ హెల్ప్‌లైన్ కేంద్రానికి ప్రొఫెసర్ జే.శ్రీరాములు, పాలిటెక్నిక్ హెల్ప్‌లైన్ కేంద్రానికి ఆ కళాశాల ప్రిన్సిపాల్ సూర్యనారాయణరెడ్డి కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారు. తరగతుల నిర్వహణ వేళ... గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ప్రభుత్వం జూలై నాటికి ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియను ముగించి.. ఆగస్టు ఒకటి నుంచి తరగతులు ప్రారంభించాలి. అయితే.. అందుకు విరుద్ధంగా కౌన్సెలింగ్ చేపడుతున్నారు. తరగతులు జరగాల్సిన సమయంలో కౌన్సెలింగ్ చేపడుతుండడం గమనార్హం. ఆగస్టు 7 నుంచి 23 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, నెలాఖరుకు సీట్ల కేటాయింపు పూర్తవుతాయి. రాష్ట్రంలో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రయివేటు యాజమాన్యాల్లో టెన్షన్ ఫీజు రీయింబర్స్‌మెంటుపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య వివాదం నెలకొనడంతో ఒకానొక సందర్భంలో ఎంసెట్ కౌన్సెలింగ్ ఇప్పట్లో ఉంటుందా అన్న సందిగ్ధత విద్యార్థుల్లో నెలకొని ఉండింది. ఈ క్రమంలో వందలాది మంది జిల్లాకు చెందిన విద్యార్థులు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరిపోయారు. అక్కడ తరగతులు కూడా ప్రారంభ మయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఉన్న సీట్ల కన్నా.. తక్కువ సంఖ్యలో విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే అవకాశముంది. బయటి జిల్లాల నుంచైనా వస్తారా అంటే.. ఆ పరిస్థితి కూడా కన్పించడం లేదు. జిల్లాలో ఒకట్రెండు ప్రయివేటు కళాశాలల్లో మినహా ఏ కాలేజీలోనూ పెద్దగా మౌలిక వసతులు లేవు. అర్హత కల్గిన బోధన సిబ్బంది, ల్యాబ్‌లు సరిగా లేని కళాశాలలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో పొరుగు జిల్లాల విద్యార్థులు ఇక్కడ చేరే పరిస్థితులు తక్కువే. ఈ క్రమంలో కొన్ని కళాశాలల్లో సీట్లు మిగిలిపోయే అవకాశముంది. ఇదే జరిగితే ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న రెండు..మూడు కళాశాలలు మూత దిశగా పయనించవచ్చు. -
'రేపే ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల'
హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్‌కు రేపు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొ. ఎల్.వేణుగోపాల్‌రెడ్డి వెలడించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆగస్టు 7వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని చెప్పారు. ఈలోగా విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించిన అంశాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు దృష్టి పెట్టాలని తెలిపారు. ఆప్షన్ల ఎంపిక తర్వాత చేపడతామన్నారు. ఇప్పటికే ఈ ఇరురాష్ట్రాల విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపడుతున్నట్లు ప్రొ.ఎల్. వేణుగోపాల్ రెడ్డి వివరించారు. -
ఐసెట్ ప్రశాంతం
కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి శుక్రవారం నిర్వహించిన ఐసెట్ వరంగల్ రీజియన్‌లో ప్రశాంతంగా జరిగింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్న నిబంధనతో సరైన సమయానికే ఎక్కు వ శాతం మంది విద్యార్థులకు పరీక్ష కేంద్రాలకు చేరుకోగా, కొందరు మాత్రం ఉరుకులు, పరుగుల మీద కేంద్రాలకు చేరుకోవడం కనిపించింది. అయితే, ఆలస్యంగా వచ్చిన కొందరు విద్యార్థులు కేంద్రాల గేట్లు వేసి ఉండడంతో నిరాశగా వెనుతిరిగారు. జిల్లాకేంద్రం లో ఏర్పాటు చేసిన 16 పరీక్ష కేంద్రాల్లో 8,742 మందికి 8,210మంది అభ్యర్థులు(94శాతం) హాజరయ్యారు. తొలుత రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి ఐసెట్ ప్రశ్నాపత్రం సెట్‌ను ఎంపిక చేశారు. కార్యక్రమంలో కేయూ ఇన్చార్జ్ వీసీ, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి డోబ్రియల్, కన్వీనర్ ప్రొఫెసర్ ఓంప్రకాష్ పాల్గొన్నారు. కాగా, జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సాయిలు, ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఓంప్రకాష్, క్యాంపస్ ప్రిన్సిపాల్ ఎన్.రామస్వామి, ఆర్ట్స్ కళాశాల ప్రొఫెసర్ జి.భద్రునాయక్, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామానుజరావుతో పాటు కె.దామోదర్‌రావు, యూజీసీ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు తదితరులు పరిశీలించారు. ఐసెట్ రాసిన జెడ్పీటీసీ సభ్యురాలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో జఫర్‌గఢ్ జెడ్పీటీసీగా ఎన్నికైన బానోతు అరుణశ్రీ కాకతీయ యూనివర్సిటీలోని పరీక్షా కేంద్రంలో ఐసెట్ రాశారు. హన్మకొండలోని భద్రుక కళాశాలలో గత ఏడాది బీకాం పూర్తి చేసిన ఆమెను ‘న్యూస్‌లైన్’ పలకరించగా, ఎంబీఏ చదవాలన్న లక్ష్యంతోనే ఐసెట్ రాసినట్లు తెలిపారు. -
ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి(ఏపీఎస్సీహెచ్ఈ) చైర్మన్‌గా ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన గతంలో ఆంధ్ర(ఏయూ), ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఏఎన్‌యూ)లకు వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశారు. ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు పదవీకాలం మంగళవారంతో ముగియడంతో వేణుగోపాల్ రెడ్డిని నియమించారు. అయితే, ప్రొ. జయప్రకాశ్‌రావునే కొనసాగిస్తారని, అందుకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా సుముఖంగా ఉన్నారని ప్రచారం జరిగింది. అలా కాని పక్షంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన రెండు యూనివర్శిటీల ఉపకులపతుల్లో ఒకరిని నియమించవచ్చనే వాదన కూడా వినిపించింది. అయితే అనూహ్యంగా సీఎం జిల్లా చిత్తూరుకు చెందిన వేణుగోపాల్‌రెడ్డి తెరపైకి వచ్చారు. మంగళవారం రాత్రి జీవో వచ్చే వరకూ ఈ పేరు బయటకు పొక్కకుండా సీఎం కార్యాలయ వర్గాలు జాగ్రత్తపడ్డాయి. విభజన నేపథ్యంలో ఈ నియామకం వివాదాస్పదమవుతుందని భావించిన ముఖ్యమంత్రి.. రాత్రి 7.30కు తన క్యాంపు కార్యాలయానికి ఉన్నత విద్యాశాఖ అధికారులను పిలిపించుకుని ఏపీఎస్సీహెచ్ఈ చైర్మన్‌గా వేణుగోపాల్‌రెడ్డిని నియమిస్తున్నట్టు తె లిపారు. కాగా ఇప్పటివరకు చైర్మన్‌గా ఉన్న జయప్రకాశ్‌రావు 2004లో ఉన్నత విద్యామండలి ైవె స్ఛైర్మన్గా నియమితులైయ్యారు. 2007లో ఆయన్ను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 2010 అక్టోబరు 29న చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఫీజుల నిర్ధారణ అంశంలో అత్యంత కష్టకాలాన్ని ఎదుర్కొన్న మండలికి సారథ్యం వహించి విద్యారంగ మన్ననలు పొందారు. వేణుగోపాల్‌రెడ్డి నేపథ్యం ఇదీ..: ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డిది చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం కామిరెడ్డివారిపల్లి గ్రామం. ఆయన మొదట ఎస్కేయూ మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2002 నుంచి 2005 వరకు ఏఎన్‌యూ వైస్ చాన్స్‌లర్‌గా, 2005 మే నుంచి 2008 మే వరకు ఏయూ వీసీగా పనిచేశారు. యూజీసీ తరఫున పలు తనిఖీ కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు. ' వైస్ చైర్మన్లు, కార్యదర్శి నియామకానికి ఆమోదముద్ర: ఉన్నత విద్యామండలిలో 2010 నుంచి ఖాళీగా ఉన్న రెండు వైస్ చైర్మన్ పోస్టుల నియామకం ఫైలుపై ఎట్టకేలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదముద్ర వేశారు. దీనికి సంబంధించి బుధవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. అలాగే మూడేళ్లుగా కార్యదర్శి పోస్టులో ఇన్చార్జ్ కొనసాగుతున్నారు. కార్యదర్శి పోస్టు భర్తీకి కూడా సీఎం ఆమోద ముద్ర వేశారని, బుధవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ఉన్నత విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. కార్యదర్శిగా అంబేద్కర్ వర్శిటీలో అధ్యాపకుడిగా ఉన్న ప్రొఫెసర్ సతీష్‌రెడ్డి నియమితులు కానున్నట్టు సమాచారం.