కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి శుక్రవారం నిర్వహించిన ఐసెట్ వరంగల్ రీజియన్‌లో ప్రశాంతంగా జరిగింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్న నిబంధనతో సరైన సమయానికే ఎక్కు వ శాతం మంది విద్యార్థులకు పరీక్ష కేంద్రాలకు చేరుకోగా, కొందరు మాత్రం ఉరుకులు, పరుగుల మీద కేంద్రాలకు చేరుకోవడం కనిపించింది. అయితే, ఆలస్యంగా వచ్చిన కొందరు విద్యార్థులు కేంద్రాల గేట్లు వేసి ఉండడంతో నిరాశగా వెనుతిరిగారు. జిల్లాకేంద్రం లో ఏర్పాటు చేసిన 16 పరీక్ష కేంద్రాల్లో 8,742 మందికి 8,210మంది అభ్యర్థులు(94శాతం) హాజరయ్యారు.
తొలుత రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి ఐసెట్ ప్రశ్నాపత్రం సెట్‌ను ఎంపిక చేశారు. కార్యక్రమంలో కేయూ ఇన్‌చార్జ్ వీసీ, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి డోబ్రియల్, కన్వీనర్ ప్రొఫెసర్ ఓంప్రకాష్ పాల్గొన్నారు. కాగా, జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సాయిలు, ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఓంప్రకాష్, క్యాంపస్ ప్రిన్సిపాల్ ఎన్.రామస్వామి, ఆర్ట్స్ కళాశాల ప్రొఫెసర్ జి.భద్రునాయక్, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామానుజరావుతో పాటు కె.దామోదర్‌రావు, యూజీసీ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ ప్రొఫెసర్ టి.యాదగిరిరావు తదితరులు పరిశీలించారు.
ఐసెట్ రాసిన జెడ్పీటీసీ సభ్యురాలు
ఇటీవల జరిగిన ఎన్నికల్లో జఫర్‌గఢ్ జెడ్పీటీసీగా ఎన్నికైన బానోతు అరుణశ్రీ కాకతీయ యూనివర్సిటీలోని పరీక్షా కేంద్రంలో ఐసెట్ రాశారు. హన్మకొండలోని భద్రుక కళాశాలలో గత ఏడాది బీకాం పూర్తి చేసిన ఆమెను ‘న్యూస్‌లైన్’ పలకరించగా, ఎంబీఏ చదవాలన్న లక్ష్యంతోనే ఐసెట్ రాసినట్లు తెలిపారు.
ఐసెట్ ప్రశాంతం
Published Sat, May 24 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM