సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి(ఏపీఎస్‌సీహెచ్‌ఈ) చైర్మన్‌గా ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన గతంలో ఆంధ్ర(ఏయూ), ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఏఎన్‌యూ)లకు వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశారు. ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు పదవీకాలం మంగళవారంతో ముగియడంతో వేణుగోపాల్ రెడ్డిని నియమించారు. అయితే, ప్రొ. జయప్రకాశ్‌రావునే కొనసాగిస్తారని, అందుకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా సుముఖంగా ఉన్నారని ప్రచారం జరిగింది. అలా కాని పక్షంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన రెండు యూనివర్శిటీల ఉపకులపతుల్లో ఒకరిని నియమించవచ్చనే వాదన కూడా వినిపించింది.
అయితే అనూహ్యంగా సీఎం జిల్లా చిత్తూరుకు చెందిన వేణుగోపాల్‌రెడ్డి తెరపైకి వచ్చారు. మంగళవారం రాత్రి జీవో వచ్చే వరకూ ఈ పేరు బయటకు పొక్కకుండా సీఎం కార్యాలయ వర్గాలు జాగ్రత్తపడ్డాయి. విభజన నేపథ్యంలో ఈ నియామకం వివాదాస్పదమవుతుందని భావించిన ముఖ్యమంత్రి.. రాత్రి 7.30కు తన క్యాంపు కార్యాలయానికి ఉన్నత విద్యాశాఖ అధికారులను పిలిపించుకుని ఏపీఎస్‌సీహెచ్‌ఈ చైర్మన్‌గా వేణుగోపాల్‌రెడ్డిని నియమిస్తున్నట్టు తె లిపారు. కాగా ఇప్పటివరకు చైర్మన్‌గా ఉన్న జయప్రకాశ్‌రావు 2004లో ఉన్నత విద్యామండలి ైవె స్‌ఛైర్మన్‌గా నియమితులైయ్యారు. 2007లో ఆయన్ను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 2010 అక్టోబరు 29న చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఫీజుల నిర్ధారణ అంశంలో అత్యంత కష్టకాలాన్ని ఎదుర్కొన్న మండలికి సారథ్యం వహించి విద్యారంగ మన్ననలు పొందారు.
వేణుగోపాల్‌రెడ్డి నేపథ్యం ఇదీ..: ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డిది చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం కామిరెడ్డివారిపల్లి గ్రామం. ఆయన మొదట ఎస్‌కేయూ మేనేజ్‌మెంట్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2002 నుంచి 2005 వరకు ఏఎన్‌యూ వైస్ చాన్స్‌లర్‌గా, 2005 మే నుంచి 2008 మే వరకు ఏయూ వీసీగా పనిచేశారు. యూజీసీ తరఫున పలు తనిఖీ కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు.
'
వైస్ చైర్మన్లు, కార్యదర్శి నియామకానికి ఆమోదముద్ర: ఉన్నత విద్యామండలిలో 2010 నుంచి ఖాళీగా ఉన్న రెండు వైస్ చైర్మన్ పోస్టుల నియామకం ఫైలుపై ఎట్టకేలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదముద్ర వేశారు. దీనికి సంబంధించి బుధవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. అలాగే మూడేళ్లుగా కార్యదర్శి పోస్టులో ఇన్‌చార్జ్ కొనసాగుతున్నారు. కార్యదర్శి పోస్టు భర్తీకి కూడా సీఎం ఆమోద ముద్ర వేశారని, బుధవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ఉన్నత విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. కార్యదర్శిగా అంబేద్కర్ వర్శిటీలో అధ్యాపకుడిగా ఉన్న ప్రొఫెసర్ సతీష్‌రెడ్డి నియమితులు కానున్నట్టు సమాచారం.